Director Vetri Duraisamy Died (PIC @ X)

Chennai, FEB 13: చెన్నై న‌గ‌ర మాజీ మేయ‌ర్ స‌దాయి దురైస్వామి కుమారుడు, ఫిల్మ్ డైరెక్ట‌ర్ వెట్రి దురైస్వామి(Vetri Duraisamy) మృత‌దేహం దొరికింది. స‌ట్ల‌జ్ న‌దిలో ఆయ‌న శ‌వాన్ని గుర్తించారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో వెట్రి (Vetri Duraisamy Died) ప్ర‌యాణిస్తున్న కారు ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన ప్ర‌మాదానికి గురైంది. ఇంద్రావ‌తు ఒరునాల్ అనే త‌మిళ చిత్రాన్ని వెట్రి డైరెక్ట్ చేశాడు. అయితే 9 రోజుల క్రితం అత‌ని కారు ప్ర‌మాదానికి లోనైంది. అప్ప‌టి నుంచి ఆయ‌న ఆచూకీ లేదు. ద‌ర్శ‌కుడు వెట్రితో ప్ర‌యాణిస్తున్న గోపినాథ్ అనే మ‌రో వ్య‌క్తిని ర‌క్షించారు. ప్ర‌స్తుతం అత‌ను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కారు డ్రైవ‌ర్ టెంజిన్ ఆ ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు. 45 ఏళ్ల వెట్రి కోసం మాత్రం తీవ్రంగా గాలించారు. కొడుకు కోసం తండ్రి స‌దాయి దొరైస్వామి భారీ రివార్డు కూడా ప్ర‌క‌టించారు. వెట్రి ఆన‌వాళ్ల‌ను గుర్తించిన‌వాళ్ల‌కు కోటి న‌జ‌రానా ప్ర‌క‌టించారు.

 

న‌దిలో ప‌డిన వెట్రి కోసం చాలా బృందాలు గాలించాయి. ఇండో టిబెటిన్ బోర్డ‌ర్ పోలీసు, నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫండ్‌, జిల్లా పోలీసులు అన్వేషించారు. మ‌హిన్ నాగ్ అసోసియేష‌న్‌కు చెందిన గజ ఈత‌గాళ్ల బృందం వెట్రి మృత‌దేహాన్ని గుర్తించారు. షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడిక‌ల్ కాలేజీకి అత‌ని డెడ్‌బాడీని పోస్టుమార్ట‌మ్ కోసం తీసుకెళ్లారు.