Arjun Suravaram Reporting: అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు నవంబర్ 29న డేట్ కుదిరింది, ఆ కేసు యొక్క పూర్తి సాక్ష్యాధారాలతో రిపోర్టింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న 'అర్జున్ లెనిన్ సురవరం' !
Arjun Suravarm Trailer Out Now | Photo Credits: Lahari Music

తన ప్రతీ చిత్రం విభిన్నంగా ఉండాలని ఆలోచించే యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddhartha) 2018లో వచ్చిన రీమేక్ మూవీ 'కిరాక్ పార్టీ' తర్వాత మళ్లీ ప్రేక్షకులకు కనిపించలేదు. నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' (Arjun Suravaram) సినిమా గతేడాదే విడుదల కావాల్సి ఉన్నా, చాలా కారణాల చేత సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు ఫైనల్ ముహూర్తం ఖరారైంది. నవంబర్ 29కి ఎట్టి పరిస్థితుల్లో సినిమా విడుదల చేస్తామని సినిమా యూనిట్ ప్రకటించింది.

టి. సంతోష్ (T Santhosh) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిఖిల్ మరియు లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) హీరోహీరోయిన్లుగా నటించారు. ఇందులో నిఖిల్ ఒక జర్నలిస్ట్ కనిపించనున్నాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే, కులాసాగా సాగిపోతున్న తన జీవితంలో అనుకోకుండా ఒక భారీ కుంభకోణంలో ఎలా చిక్కుకుంటాడు? ఆపై దాని నుంచి బయటపడే క్రమంలో, అది తన ఒక్కడి సమస్య కాదని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఒక చీకటి ముఠా దందా అని తెలుసుకొని యూనివర్శిటీలకు సంబంధించిన నకిలీ ధృవపత్రాల స్కాం గురించి జర్నలిస్ట్ అర్జున్ సురవరం ఎలా వెలుగులోకి తెస్తాడు అనే కథాంశంతో తెరకెక్కించినట్లు తెలుస్తుంది. "బాధితుడిలా కాదు, ఒక రిపోర్టర్‌లా ఆలోచించాలి" అంటూ స్పూర్థి కలిగించేలా డైలాగ్స్ ఉన్నాయి.

ఆ ట్రైలర్ మీరూ చూసేయండి- Arjun Suravaram Trailer :

ఈ చిత్రాన్ని 2018లో మే 1న విడుదల చేయాలని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల దానిని అదే ఏడాది డిసెంబర్ కు వాయిదా వేశారు. కానీ, ‘మహర్షి’ మరియు ‘ఎవెంజర్స్: ఎండ్ గేమ్’ అదే సమయంలో విడుదలవుతున్నాయని, మరోసారి కూడా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే ఈ సినిమా ఔట్ పుట్ పట్ల డిస్ట్రిబ్యూటర్స్ సంతృప్తి చెందకపోవడం వల్లే, మరోసారి రీషూట్, కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్లారని అప్పట్లో ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపించాయి.

ఈ సినిమా టైటిల్ పట్ల కూడా వివాదం నడిచింది. మొదట్లో ఈ సినిమాకు 'ముద్ర' అనే టైటిల్ పెట్టారు. అయితే టైటిల్, అవే లోగోలతో జగపతిబాబు సినిమా అప్పటికే విడుదలవడంతో ఈ సినిమాలో నిఖిల్ పాత్ర పేరు 'అర్జున్ లెనిన్ సురవరం' పేరుతోనే టైటిల్ ఫిక్స్ చేయాల్సి వచ్చింది. మొత్తానికి అన్ని గండాలు దాటుకొని ఈ సినిమా నవంబర్ 29న థియేటర్స్ లోకి రాబోతుంది.