Hyderabad, September 2: ‘నేను ట్రెండ్ ఫాలో అవను.. సెట్ చేస్తాను’... ‘గబ్బర్‌సింగ్’ (Gabbar Singh) సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ ఆయన సినీ జీవితానికి సరిగ్గా సరిపోతుంది. ఆయనెప్పుడూ అంతకు ముందున్న ట్రెండ్ ను ఎప్పుడూ ఫాలో కాలేదు. అభిమానులు వెర్రెత్తిపోయే రేంజ్ ట్రెండ్‌ను సెట్ చేస్తారు. మెడపై చెయ్యిపెట్టి రుద్దుకుంటూ.. అగ్రెసివ్ గా ఒక లుక్ ఇస్తే చాలు థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. గొంతు సవరించి పాట పాడితే, పూనకాలే. కొత్త సినిమాలో సరికొత్త ఫ్యాంట్స్ వేస్తే చాలు యూత్ అంతా వాటికోసం క్యూలు కడతారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ హీరోను కొన్నాళ్లు పక్కన పెడతారు ఫ్యాన్స్, దర్శక నిర్మాతలు. అయితే పవన్ కళ్యాణ్ దీనికి అతీతుడు. ఒక దశలో పదేండ్ల పాటే ఫ్లాపుల పరంపరతో అభిమానుల్ని నిరాశపరిచారు పవన్ కళ్యాణ్. అయినా, ఆయన క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు. ఆ వెంటనే గబ్బర్ సింగ్ తో ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టి అంతకు ముందు ఎదురైన పరాజయాలకు గట్టి సమాధానం చెప్పారు. అయితే, పవన్ అంతగా తన ఫ్యాన్ బేస్ ను పెంచుకోడానికి, దర్శక నిర్మాతలపై నమ్మకాన్ని కలిగించడానికి ఒకే ఒక కారణం పవర్ స్టార్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్. దాని వల్లనే ఆయన సెట్ చేసిందే ట్రెండ్ అయింది.
కరుణాకరన్ (Karunakaran) అనే దర్శకుడికి పవన్ అవకాశమివ్వకపోతే ‘తొలిప్రేమ’ (Tholi Prema) లాంటి క్లాసిక్ లవ్ స్టోరీ వచ్చి ఉండేది కాదు. పూరీ జగన్నాథ్ (Puri Jagannath) అనే దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయకపోతే.. ‘బద్రి’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ వచ్చి ఉండేది కాదు. తమిళ దర్శకుడు కదా.. తెలుగు నేటివిటీతో ఏం సినిమా తీయగలడు అని పవన్ యస్.జే సూర్య (SJ Surya) ని లైట్ తీసుకొని ఉంటే.. ‘ఖుషి’ లాంటి ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ వచ్చి ఉండేది కాదు. ఒక ఫ్యాన్ తనతో ఏం సినిమా తీయగలడు అని హరీష్ శంకర్ ను పట్టించుకొని ఉండకపోతే, అప్పటివరకు ఉన్న తెలుగు చలనచిత్ర రికార్డులను గబ్బర్ సింగ్ బద్దలుకొట్టేది కాదు. ఇక, ఇప్పుడు తెలుగు సినిమా బాహుబలి అని చెప్పుకుంటుంది కానీ.. టాలీవుడ్ కి వంద కోట్ల క్లబ్ ఆశలను తొలుత రుచి చూయించింది అత్తారింటికి దారేది సినిమానే. ఈ విషయం దర్శక ధీరుడు రాజమౌళి స్వయంగా చెప్పాడు. ఒక వైపు పాలిటిక్స్ లో బిజీగా ఉంటూ.. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ మరోవైపు ఫ్యాన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తూ.. పవర్ స్టార్‌గా తన స్థానంలో తాను కంటిన్యూ అవుతున్నారు పవన్. అందుకే ఆయన ట్రెండ్ సెట్టర్. దటీజ్ పవర్ స్టార్.. హ్యాపీ బర్త్ డే సర్..