Big Boss Telugu: క్రికెట్ చరిత్రలో ఐపీఎల్‌కు ఎలా అయితే ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుందో, టెలివిజన్ చరిత్రలో బిగ్ బాస్ కు కూడా ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. సరదా సన్నివేశాలు, వేడి పుట్టించే మాటలు, నువ్వా నేనా అన్నట్లు సాగే ఆటలు- కొట్లాటలు, నరాలు తెగే ఉత్కంటత, ఆటగాళ్ల భావోద్వేగాలు ఇలా ఒకటేమిటి కావాల్సినంత డ్రామా, కావాల్సినంత వినోదం అన్నీ దొరుకుతాయి. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి రోజుల తరబడి 'ఇంట్లో' ఉంటూ అన్నింటిని తట్టుకొని ఎవరైతే చివరివరకు వరకు ఉంటారో వాడే బిగ్ బాస్.
తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1కి NTR హోస్ట్‌గా వ్యవహరించారు. మొదటి సీజన్‌లో శివ బాలాజీ విజేతగా నిలిచారు, రెండో సీజన్‌లో Nani హోస్ట్‌గా వ్యవహరించారు అప్పుడు కౌశల్ మంద విజేతగా నిలిచారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ -3 (Big Boss Season 3) కి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) బిగ్ బాస్ హోస్ట్‌గా అధికారికంగా ప్రకటించినప్పటినించీ ఈ సీజన్ 3 ఎలా ఉండబోతుందో అని అందరిలో ఆసక్తి మొదలైంది. నాగార్జునా టీవీ హోస్ట్‌గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో తో బాగా అలరించాడు. దీంతో బిగ్ బాస్ సీజన్ 3 పై అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం బిగ్ బాస్3 జూలై 21న ప్రారంభమై అక్టోబర్ 28, 2019 వరకు 100 రోజుల పాటు అలరించనుంది. ఈసారి హౌజ్ లో 14 మంది కంటెస్టంట్స్ ఉండబోతున్నారు. ఇక ఈసారి ఆట ఆడేది ఎవరు, ఆడించేది ఎవరు, బిగ్ బాస్ 3 విజేతగా నిలిచేది ఎవరు అనేది బుల్లితెరపై చూడండి.