ఇప్పటివరకు టెలివిజన్‌లో ఎన్ని షోలు వచ్చినా, బిగ్ బాస్ రియాల్టీ షో (Big Boss Realty show) ఎప్పుడూ టాప్ టీఆర్పీ రేటింగ్స్‌ను సొంతం చేసుకుంటూ వస్తుంది. 2006లో హిందీలో ప్రారంభమైన బిగ్ బాస్ తర్వాత కన్నడ, బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు మళయాలం భాషలకు విస్తరించింది. ఆయా భాషలలో అక్కడి పాపులర్ ఛానెల్స్ ఈ బిగ్ బాస్ నిర్వహణ, ప్రసార హక్కులను సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. తెలుగులో స్టార్ మా (Star Maa) 2017 నుంచి ఈ షోను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బిగ్ బాస్ షో కు అవసరమయ్యే ఇంటిని మొదటి సీజన్‌లో మహారాష్ట్రలోని లోనవాలా ప్రాంతంలో ఏర్పాటు చేయగా, ఆ తర్వాత 2వ, ప్రస్తుతం 3వ సీజన్ కోసం ఇంటిని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు.
తెలుగులో బిగ్ బాస్3 (Telugu Bib Boss 3) జూలై 21 నుంచి ఆరంభం కాబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రోమోను స్టార్ మా ఛానెల్ విడుదల చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఇష్టపడే అక్కినేని నాగార్జునను బిగ్ బాస్ 3 సీజన్ కోసం హోస్ట్‌గా ఎంపిక చేసినదగ్గరి నుంచి ఈ షోపై అంచనాలు భారీగా ఉన్నాయి, అలాగే టీవిలో విపరీతమైన క్రేజ్ ఉండే యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి లాంటి సెలబ్రిటీలను హౌజ్ లో కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేయడం పట్ల కూడా ఈసారి సీజన్ 3 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రేక్షకులలో ఆసక్తి పెంచేందుకు ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన స్టార్ మా ఛానెల్ లేటెస్ట్‌గా 'నటన లేదు.. అంతా నిజమే' అంటూ విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంటుంది. వివిధ సందర్భాల్లో నేతలు కెమెరాల ముందు తాము సమాజ సేవ చేస్తున్నట్లు నటించడం, అమ్మాయిలు ఇంట్లో పని చేస్తున్నట్లు నటించడం, ఎప్పుడూ గొడవపడే మొగుడు పెళ్లాలు కెమెరా ముందు అన్యోన్యంగా ఉంటున్నట్లు నటించడం, అలాగే ఎక్కడో ఉండి ఇంకెక్కడో ఉన్నట్లు కెమెరాలో చూపించడం లాంటివి ఇంక చెల్లదు, బిగ్ బాస్ 3లో 24 గంటలు, 64 కెమెరాలు ఎప్పుడు ఎవరేం చేసిన పట్టేస్తాయి' అని ఆ ప్రోమోలో బిగ్ బాస్3 ఎలా ఉండబోతుందో సాంపుల్ చూపించారు. చూడాలి మరి ఈ బిగ్ బాస్3 ముందుముందు ఇంకెంత నాటకీయంగా మారబోతుందో.