Supreme Court of India (Photo Credit: ANI)

New Delhi, Nov 7: 2012లో దేశ రాజధానిలో సంచలనం రేపిన సామూహిక అత్యాచార, హత్య కేసులో (Chhawla Rape Case) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ముగ్గురు దోషులకు ఢిల్లీ హైకోర్టులో మరణశిక్ష పడగా.. వారిని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది.2012 ఫిబ్రవరి 9వ తేదీన ఢిల్లీ కుతుబ్‌ విహార్‌ వద్ద గురుగావ్‌ ఆఫీస్‌ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కారులో వచ్చిన దుండగులు ఆమెను ఎత్తుకెళ్లారు.

వారి చేతులో బాధితురాలు సామూహిక అత్యాచారం, హత్యకు గురైంది. అత్యాచారం అనంతరం ఆమెను అత్యంత పాశవికంగా చిత్రహింసలు పెట్టి చంపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. హతురాలి మృతదేహాన్ని హరియాణాలోని ఓ పొలంలో గుర్తించారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేశారు.

ఈ కేసులో తొలుత విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు.. ముగ్గురు నిందితులను దోషులుగా నిర్ధారించి మరణ శిక్ష (Awarded the Death Penalty) విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ట్రయల్‌ కోర్టు తీర్పును సమర్థించింది. ఈ హత్యాచార ఘటనను ‘అత్యంత దారుణమైనది’గా అభివర్ణించిన హైకోర్టు.. నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ 2014లో తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుపై ముగ్గురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈడ‌బ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం, రాజ్యాంగంలోని 103వ స‌వ‌ర‌ణ‌ను స్వాగతించిన సుప్రీం

దీనిపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల విచారణ జరిపింది. దోషుల పిటిషన్‌ను ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. అయితే దోషుల తరఫున డిఫెన్స్‌ కౌన్సిల్‌ వాదిస్తూ.. వారి వయసు, కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శిక్షపై తీర్పు వెలువరించాలని కోరారు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. దోషుల ఉరిశిక్షను రద్దు చేయడమే గాక.. వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పుపై బాధితురాలి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై న్యాయపోరాటం కొనసాగిస్తామని తెలిపింది.

తీర్పు సమయంలో బాధితురాలి తండ్రి చేతులు జోడించి ధర్మాసనం ముందు నిల్చున్నారు. అయితే.. సెంటిమెంట్లకు ఇక్కడ తావు ఉండదంటూ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఢిల్లీ పోలీసుల తరపున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భటి.. ఈ గాయం బాధితురాలిది మాత్రమే కాదని.. సమాజానిదని వాదించారు. కేవలం హత్యాచారమే చేయకుండా.. ఆమె శరీరాన్ని ఛిద్రం చేసి వాళ్లు పెద్ద తప్పు చేశారని ఆమె వాదనల్లో పేర్కొన్నారు.

ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. కీలక తీర్పు ఇచ్చింది. ఆ సమయంలో బాధితురాలి తండ్రి చేతులు జోడించి నిల్చోగా.. బాధితురాలి తండ్రి బాధను తాను అర్థం చేసుకోగలనని తెలిపారు సీజేఐ లలిత్‌. అయితే.. వాస్తవాలు, సాక్ష్యాలు-ఆధారాల ఆధారంగా తీర్పు ఉంటుందని, సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుంటే కేసు తప్పదారి పట్టే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ.. ఆ ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు.