New Delhi, Nov 7: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS Quota)కు 10శాతం కోటా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది. ఆ కోటాను సవాల్ చేస్తే వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం ఇవాళ తీర్పును వెలువరించింది. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్ కోటాను సుప్రీంకోర్టు సమర్థించింది. అయిదుగురు సభ్యులు ఉన్న ధర్మాసనంలో సీజేఐ లలిత్‌తో పాటు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, ఎస్ రవీంద్ర భట్, బేలా ఎం త్రివేది, జేబీ పర్దివాలాలు ఉన్నారు.
జస్టిస్ రవీంద్ర భట్ కోటాను వ్యతిరేకించారు. దీనికి సీజేఐ యూయూ లలిత్ కూడా అంగీకారం వ్యక్తంచేశారు. జస్టిస్ జేపీ పర్దివాలా, జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ త్రివేదిలు ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థించారు. దీంతో 3-2 తేడాతో పిటిషన్‌ను కొట్టివేశారు. రాజ్యాంగంలోని 103వ సవరణను (103rd Constitution Amendment) సుప్రీం స్వాగతించింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా అమలుకు సుప్రీం పచ్చజెండా ఊపింది.
యూపీలో దారుణం, మహిళలపై లాఠీ ఝళిపించిన పోలీసులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
అగ్రవర్ణ పేదలకు కోటా ఇవ్వడం చట్ట వ్యతరేకం కాదని, రాజ్యాంగం కల్పించిన 50 శాతం సీలింగ్ పరిమితిని కూడా ఉల్లంఘించడం లేదని కోర్టు తెలిపింది. 2019 జనరల్ ఎన్నికల ముందు ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రభుత్వం తీసుకువచ్చింది. రాజ్యాంగంలోని 103వ సవరణ ద్వారా ఈ కోటాను అమలు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంలో పిటీషన్ వేశారు.
2019 సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను తీసుకొచ్చింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్లు కల్పించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లపై 1992 సుప్రీంకోర్టు విధించిన 50శాతం పరిమితిని దాటి ఈ కోటాను ఎలా ఇస్తారంటూ పలువురు పిటిషనర్లు ప్రశ్నించారు. ఇది రాజ్యాంగం మూల స్వరూపాన్ని ఉల్లంఘించడమే అని ఆరోపిస్తూ వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించింది.