New Delhi, July 18: మరికాసేపట్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు(Monsoon session) ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. 26 రోజుల్లో 18 సిట్టింగ్స్‌లో సమావేశాలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతాయి. లోక్‌సభ(Lok sabha), రాజ్యసభకు(Rajyasabha) ఎన్నికైన/నామినేట్ అయిన సభ్యులు మొదటగా ఉభయసభల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం దేశంలో నెల కొన్న పరిణామాలతో వాడీవేడిగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Monsoon session) జరిగే అవకాశం ఉంది. ప్రజా సమస్యలు, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, నిరుద్యోగం, అగ్నిపథ్, ధరల పెరుగుదల, జీఎస్టీ పరిహారం పెంపు, మత విద్వేషాలు, రాజ్యాంగ వ్యవస్థల, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, భారత్ చైనా సరిహద్దు వివాదం, విదేశీ బొగ్గు తప్పనిసరిగా వాడటం వంటి అంశాలపై కేంద్రాన్ని విపక్షాలు నిలదీయనున్నాయి.
తెలుగు రాష్ట్రాల పెండింగ్ అంశాలు, విభజన హామీలను పార్లమెంట్‌లో (parliament) లేవనెత్తేందుకు వైసీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు ప్రణాళికలు వేసుకున్నారు. ఈ సమావేశాల్లో పాత, కొత్తవి కలిపి మొత్తం 32 బిల్లులను సభల ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. సమగ్ర చర్చల తరువాతే బిల్లులు ఆమోదించాలని విపక్షాలు కోరుతున్నాయి. 14 బిల్లులకు ఆమోదం తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం అంటోంది.
కంటోన్మెంట్ బిల్లు, మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ చట్ట సవరణ బిల్లు, దివాలా చట్ట సవరణ బిల్లులను కూడా కేంద్ర సర్కారు ప్రవేశపెట్టనుంది. కంటోన్మెంట్లను మున్సిపాలిటీలతో సమానంగా అభివృద్ధి చేసేలా ఓ బిల్లు రూపకల్పన చేశారు. మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ సవరణ బిల్లు ద్వారా ప్రభుత్వ పాత్రను హేతుబద్ధీకరిస్తున్నారు. దివాలా కోడ్ సవరణ బిల్లు ద్వారా నిర్ణీత వ్యవధిలో దివాలా పరిష్కారం దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పిరియాడికల్స్ బిల్ -2022 ద్వారా డిజిటల్ న్యూస్ పోర్టల్స్ కు రిజిస్ట్రేషన్, ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ నియామకం ఉండేలా చూడాలని కేంద్రం భావిస్తోంది.
ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్(సవరణ) బిల్లు 2019, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ సవరణ బిల్లు 2022 , వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) సవరణ బిల్లు-2021, యాంటీ మారిటైం పైరసీ బిల్లు–2019, ది నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు -2021, ది కానిస్ట్రిట్యూషన్ (ఎస్సీ, ఎస్టీ) ఆర్డర్స్( రెండవ సవరణ) బిల్లు– 2022, సెంట్రల్ యూనివర్సిటీల సవరణ బిల్లు–2022, ది ఫ్యామిలీ కోర్ట్స్ (సవరణ) బిల్లు – 2022 , మెడిటేషన్ బిల్లు 2021, సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు – 2021, ది రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఇండియన్ బిల్లు-2019ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.