 
                                                                 బ్రిటన్ రాజకుటుంబంలో మరోసారి సంచలనం రేగింది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో గత కొన్నేళ్లుగా వివాదాల్లో చిక్కుకున్న ప్రిన్స్ ఆండ్రూపై రాజు చార్ల్స్ III కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాచరిక బిరుదులను రద్దు చేయడంతో పాటు, ఆయనకు విండ్సర్ ప్యాలెస్ పరిసర ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన నివాసాన్ని కూడా ఖాళీ చేయమని ఆదేశించారు. ఈ నిర్ణయంతో ఆండ్రూ ఇకపై ప్రిన్స్ అనే బిరుదును కోల్పోయి, కేవలం ఆండ్రూ మౌంట్‌బాటన్ విండ్సర్ అనే పేరుతోనే గుర్తించబడతారు.
ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.రాజకుటుంబ గౌరవం, ప్రజల నమ్మకం అత్యంత ప్రాధాన్యమైనవి. గతంలో ఆండ్రూ చేసిన నిర్ణయాల్లో లోపం ఉందని భావించి, ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ప్యాలెస్ ప్రకటనలో పేర్కొంది.
ఆండ్రూ పేరు ఎప్‌స్టీన్ కేసులో ప్రస్తావనకు రావడం బ్రిటన్ రాజవంశానికి తలనొప్పిగా మారింది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ బాధితుల్లో ఒకరైన వర్జీనియా రాబర్ట్స్ గిఫ్రే చేసిన ఆరోపణలు 2019లో వెలుగులోకి వచ్చాయి. గిఫ్రే ప్రకారం, తాను చిన్న వయసులో ఉన్నప్పుడు ఎప్‌స్టీన్ ద్వారా ఆండ్రూతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పింది. ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా భారీ చర్చకు దారి తీసింది.
ఆ ఆరోపణల నేపథ్యంలో 2019లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆండ్రూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన వివరణలు ప్రజలను మరింత ఆగ్రహానికి గురి చేశాయి. ప్రజాభిప్రాయం తీవ్రంగా మారడంతో, ఆండ్రూ ఆ తర్వాత రాజకుటుంబ అధికారిక బాధ్యతలన్నింటినీ వదిలివేశారు. 2022లో గిఫ్రే అమెరికాలో దాఖలు చేసిన సివిల్ కేసును ఆండ్రూ కోర్టు బయటే సర్దుబాటు చేసుకున్నారు. సుమారు 12 మిలియన్ పౌండ్లు చెల్లించి కేసును ముగించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేసినప్పటికీ, బాధితురాలు అనుభవించిన మానసిక వేదన పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఈ-మెయిల్స్, దస్తావేజులు ప్రకారం, ఆండ్రూ ఎప్‌స్టీన్‌తో తన చెప్పిన దానికంటే ఎక్కువ కాలం సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు తేలడంతో, రాజకుటుంబం పై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో రాజు చార్ల్స్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, సోదరుడిపై నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారని రాయల్ వర్గాలు చెబుతున్నాయి. రాజు ఆదేశాల ప్రకారం, ఆండ్రూ ప్రస్తుతం నివసిస్తున్న విండ్సర్ రాయల్ లాడ్జ్ ను విడిచిపెట్టి, శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్ లోని ఒక ప్రైవేట్ నివాసానికి తరలే అవకాశం ఉంది. రాజు తన సోదరుడికి పరిమితమైన ఆర్థిక సహాయాన్ని మాత్రమే అందిస్తారని సమాచారం. ఆండ్రూతో కలిసి అదే మాన్షన్‌లో నివసిస్తున్న ఆయన మాజీ భార్య సారా ఫెర్గూసన్ కూడా కొత్త నివాసాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది.
ప్యాలెస్ ప్రకటనలో లైంగిక వేధింపుల బాధితులు, ప్రాణాలతో బయటపడినవారి పట్ల మా సానుభూతి ఎల్లప్పుడూ ఉంటుంది. రాజవంశం పట్ల ప్రజల విశ్వాసాన్ని కాపాడటం మా బాధ్యత అని రాజు రాణి స్పష్టంగా పేర్కొన్నారు.ఈ నిర్ణయం ద్వారా రాజు చార్ల్స్, బ్రిటన్ రాజవంశం ప్రతిష్ఠను రక్షించడంలో తాను రాజీ పడరాదన్న సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చారు. రాజకీయ విశ్లేషకులు దీనిని రాయల్ రీసెట్ గా పేర్కొంటున్నారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
