Hyderabad, September 19: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఫామ్‌హౌస్‌లో అత్యంత కుళ్ళిన స్థితిలో ఉన్న ఒక మనిషి మృతదేహం బయటపడటం కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాలోని పాపిరెడ్డిగూడ గ్రామ సమీపాన ఒక ఫామ్‌హౌస్ తో పాటు, ఆయనకు చెందిన వ్యవసాయ భూములు ఉన్నాయి. బుధవారం రాత్రి నుంచి ఫామ్‌హౌస్ లో గల ఒక షెడ్డు నుంచి తీవ్ర దుర్వాసన రావడాన్ని ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసుకొనే కొంత మంది రైతులు గమనించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, అక్కడకు చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో అణ్వేషించగా, కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఒక మృతదేహం లభ్యమైంది.
ఆ వ్యక్తి మృతి చెంది ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలమే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని ఉంటాడా? లేక హత్య కోణం ఉందా అని అనుమానిస్తున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇక ఈ సంఘటనకు సంబంధించి అక్కినేని నాగార్జున ఇంతవరకూ స్పందించలేదు. గతేడాది ఇదే ఫామ్‌హౌస్‌లో ఇద్దరు వృద్ధ దంపతులు విద్యుత్ షాక్ తగిలి చనిపోవడం గమనార్హం.