New Delhi, June 09: మధుమేహం..! ప్రపంచ సమాజాన్ని పట్టిపీడిస్తున్న వ్యాధి ఇది..! క్రమశిక్షణ తప్పిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిళ్లతో మనుషులు ఈ వ్యాధిని కొనితెచ్చుకుంటున్నారు. ఈ వ్యాధి హఠాత్తుగా ప్రాణాలు తీయకపోయినా చెట్టుకు చెదలు పట్టినట్లుగా మనిషి ఒంట్లో చేరి.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఒక్కో అవయవాన్ని నిర్వీర్యం చేస్తూ చివరకు మరణానికి చేరువ చేస్తుంది..! అయితే, మన దేశంలో ఇది మరింత వేగంగా విస్తరిస్తున్నది..! కేవలం గత నాలుగేళ్లలోనే దేశంలో మధుమేహుల సంఖ్య 44 శాతం పెరిగిందని తాజా అధ్యయనంలో తేలింది. దేశంలో మధుమేహం (Diabetic) విస్తృతిపై ICMR (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్) చేసిన ఓ అధ్యయనం తాజాగా యూకేకు చెందిన మెడికల్ జర్నల్ లాన్ సెట్‌లో ప్రచురితమైంది. ఆ అధ్యయనం ప్రకారం ప్రస్తుతం మన దేశంలో మధుమేహుల సంఖ్య 10 కోట్ల మార్కును దాటింది. 2019లో 7 కోట్లుగా ఉన్న ఆ సంఖ్య కేవలం నాలుగేండ్లలో 44 శాతం పెరిగింది. అంతేగాక ప్రస్తుతం దేశంలో ప్రీడయాబెటిక్స్ (త్వరలో మధుమేహం బారినపడే అవకాశం ఉన్నవాళ్లు) సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది.
దేశవ్యాప్తంగా 13.60 కోట్ల మందిలో ప్రీడయాబెటిక్ (Pre Diabetic) లక్షణాలు ఉన్నాయి. అంటే దేశం మొత్తం జనాభాలో ప్రీడయాబెటిక్స్ సంఖ్య 15.3 శాతంగా ఉన్నది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే గోవాలో డయాబెటిక్ రోగుల శాతం (26.4 శాతం) ఎక్కువగా ఉన్నది. పుదుచ్చేరి (26.3 శాతం), కేరళ (25.5 శాతం) ఆ తర్వాత వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా చూస్తే దేశం మొత్తం జనాభాలో 11.4 శాతం మంది మధుమేహం వ్యాధిగ్రస్తులు ఉన్నారు. మధుమేహుల (Diabetics) సంఖ్య తక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తాజా అధ్యయనం హెచ్చరికలు చేసింది. రాబోయే ఐదేళ్లలో ఆయారాష్ట్రాల్లో షుగర్ రోగుల సంఖ్య శరవేగంగా పెరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
ఇక గోవా, కేరళ, తమిళనాడు, చండీగఢ్‌లలో డయాబెటిస్ కేసులతో పోలిస్తే ప్రీడయాబెటిక్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. పుదుచ్చేరి, ఢిల్లీల్లో డయాబెటిక్, ప్రిడయాబెటిక్ కేసులు సమంగా ఉన్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో డయాబెటిక్ రోగుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, ప్రీడయాబెటిక్ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నదని పరిశోధకులు తెలిపారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో డయాబెటిక్ రోగుల సంఖ్య కేవలం 4.8 శాతంగా ఉన్నది. కానీ అక్కడి ప్రీడయాబెటిక్ కేసుల సంఖ్య మాత్రం 18 శాతానికి పైగా ఉన్నది. అంటే జాతీయ సగటు 15.3 శాతం కంటే ఇది చాలా ఎక్కువ. ఆ రాష్ట్రంలో ఒక్క డయాబెటిక్ పేషెంట్ ఉంటే.. నలుగురు ప్రీడయాబెటిక్స్ ఉన్నారన్నమాట. వీళ్లంతా డయాబెటిక్ రోగులుగా మారితే అత్యధిక షుగర్ రోగులు ఉన్న రాష్ట్రంగా యూపీ నిలుస్తుంది.
మధ్యప్రదేశ్‌లో ప్రతి డయాబెటిక్ పేషెంట్‌కు ముగ్గురు ప్రీడయాబెటిక్ లక్షణాలు కలిగినవాళ్లు ఉన్నారు. సిక్కింలో డయాబెటిక్ రోగులు, ప్రీడయాబెటిక్స్ సంఖ్య రెండూ ఎక్కువగానే ఉన్నాయి. ప్రీడయాబెటిక్ అంటే శరీరంలో షుగర్ స్థాయిలు ఉండాల్సిన దానికంటే కాస్త ఎక్కువగా ఉంటాయి. కానీ టైప్-2 డయాబెటిక్‌గా పరిగణించాల్సినంత ఎక్కువగా ఉండవు. ఈ ప్రీడయాబెటిక్ లక్షణాలు ఉన్నవాళ్లు తమ జీవనశైలిని మార్చుకోకపోతే కొన్ని నెలల్లోనే డయాబెటిక్ రోగులుగా మారిపోవచ్చని, కొందరు ఆ తర్వాత కూడా ప్రీడయాబెటిక్స్‌గానే కొనసాగవచ్చని, మరికొందరు జీవనశైలిని మార్చుకుని, హెల్తీ డైట్, వ్యాయామాలతో ప్రీడయాబెటిక్ లక్షణాలను పోగొట్టుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామీణ, పట్టణ ప్రజలు లక్ష మందిపై 2008 అక్టోబర్ 18 నుంచి 2019 డిసెంబర్ 17 వరకు ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ప్రకారం 2019 డిసెంబర్ నాటికి దేశంలో మధుమేహుల సంఖ్య కేవలం 7.20 కోట్లుగా ఉన్నది. కానీ ఆ తర్వాత నాలుగేళ్లలోనే ఆ సంఖ్య 10.10 కోట్లకు పెరిగింది. కాగా మధుమేహం రోగులు అధిక రక్తపోటు, రక్తంలో కొవ్వులు, ఊబకాయం లాంటి ఇతర సమస్యల బారిన కూడా పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలిపారు. దేశ జనాభాలో 35.5 శాతం మంది అధిక రక్తపోటుతో, 81.2 శాతం మంది అసాధారణ కొవ్వులతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. అదేవిధంగా 28.6 శాతం మంది సాధారణ ఊబకాయం, 39.5 శాతం మంది పొట్ట సంబంధ ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది.