Farmers protesting against the central government | (Photo Credits: PTI)

New Delhi, Nov 19: రైతుల మేలు కోస‌మేన‌ని చెబుతూ కేంద్ర ప్ర‌భుత్వం గ‌త ఏడాది మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను తీసుకొచ్చింది. తాజాగా రద్దు (Farm Bills Withdrawn) చేస్తున్నట్లు ప్రకటించింది. మరి ఈ చట్టాల్లో ఏముంది. రైతులు దీనిని ఎందుకు వ్యతిరేకించారు. సాగు చట్టాలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి ఓ సారి చూద్దాం.

2020 జూన్ 5న కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న‌ జరగగా, 2020 జూన్ 15 కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై (Farm Bills)కేంద్రం ఆర్డినెన్స్ ప్ర‌వేశ‌పెట్టింది. ఇక 2020 సెప్టెంబ‌ర్ 14న పార్ల‌మెంట్‌లో వ్య‌వ‌సాయ బిల్లు ప్ర‌వేశ పెట్టిన మోదీ ప్ర‌భుత్వం, ఎటువంటి చర్చ లేకుండానే మూడు రోజులకు సెప్టెంబ‌ర్ 17 లోక్ సభలో ఆమోదం పొందినట్లు ప్రకటించింది. ఇక 2020 సెప్టెంబ‌ర్ 20న రాజ్య‌స‌భ‌లో మూడు వ్య‌వ‌సాయ బిల్లులకు (Three Farm Laws) ఆమోద ముద్ర పడింది. సెప్టెంబర్ 27న మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను రాష్ట్ర‌ప‌తి ఆమోదించినట్లుగా ప్రకటన వెలువడింది.

అయితే ఇంత ఆఘమేఘాల మీద చట్టాలు ఆమోదం పొందిన తరువాత రైతులు వీటిని వెంటనే రద్దు చేయాలంటూ ఆందోళన బాట పట్టారు. ఈ చట్టాలు రైతులకు లాభం చేకూర్చేందుకే తెచ్చామని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతున్నప్ప‌టికీ.. రైతులు మాత్రం ఈ చ‌ట్టాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించారు. వీటి వ‌ల్ల లాభాల కంటే న‌ష్టాలే ఎక్కువగా ఉన్నాయ‌ని ఆందోళన బాట పట్టారు. వెంట‌నే కొత్త సాగు చ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు. 2020 న‌వంబ‌ర్ 26న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై పంజాబ్‌, హ‌ర్యానా రైతుల ఉద్య‌మం మొదలయింది.. ఛ‌లో ఢిల్లీ ఆందోళ‌న‌లో 40కి పైగా రైతు సంఘాలు పాల్గొన్నాయి.

నన్ను క్షమించండి, మిమ్మల్ని ఒప్పించలేకపోయానని తెలిపిన ప్రధాని, పూర్తిగా రద్దు చేసేవరకు కదిలేది లేదంటున్న రైతులు, మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దును స్వాగతించిన ప్రతిపక్షాలు

రైతులు రోడ్డెక్కి ధ‌ర్నాలు చేశారు. 2020 న‌వంబ‌ర్ 28 కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై రైతుల‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించారు. 2020 డిసెంబ‌ర్ 3న రైతులు, కేంద్ర ప్ర‌భుత్వం మ‌ధ్య తొలి విడత చ‌ర్చ‌లు జరగగా సమస్య కొలిక్కి రాలేదు. 2020 డిసెంబ‌ర్ 5న రెండోసారి కేంద్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి. దీంతో 2020 డిసెంబ‌ర్ 8న భార‌త్‌బంద్‌కు రైతు సంఘాల పిలుపునిచ్చాయి. 2020 డిసెంబ‌ర్ 9న వ్యవసాయ చట్టాలకు సవరణ ప్రతిపాదన కేంద్రం చేయగా దానిని రైతులు తిరస్కరించారు. గతేడాది డిసెంబ‌ర్ 11న కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దుపై సుప్రీంకోర్టును రైతు సంఘాలు ఆశ్ర‌యించాయి.

దీంతో డిసెంబ‌ర్ 13న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై మ‌రోసారి రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు సిద్ధ‌మ‌ని కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌ప్ర‌క‌టించారు. ఇది కూడా కొలిక్కి రాకపోవడంతో రైతులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. 2020 డిసెంబ‌ర్ 16న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతు సంఘాలు వేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు విచార‌ణ‌ జరిపింది. స‌మ‌స్య ప‌రిష్కారానికి క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌ని సుప్రీంకోర్టు తెలిపింది. డిసెంబ‌ర్ 21 రైతుల నిరాహార దీక్ష‌ చేపట్టారు.

కొత్త చట్టాలు మీరు నిలిపివేస్తారా..మమ్మల్ని నిలిపివేయమంటారా ? కేంద్రంపై అసహనం వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం, రైతుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చురక

2020 డిసెంబ‌ర్ 30 రైతులతో కేంద్ర ప్ర‌భుత్వం ఆరో విడ‌త చ‌ర్చ‌లు జరిపింది, ఎల‌క్ట్రిసిటీ అమెండ్‌మెంట్ బిల్‌, గ‌డ్డి త‌గుల‌బెట్ట‌డంపై జ‌రిమానా వంటివి తీసేస్తామ‌ని కేంద్రం ఈ చర్చల్లో హామీ ఇచ్చింది. అయినా రైతులు చట్టాల రద్దుకే మొగ్గు చూపారు. 2021 జ‌న‌వ‌రి 4న రైతుల‌తో ఏడోసారి కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జరిపారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌్సిందేనని పట్టుబట్టారు. రైతుల విన‌తిని కేంద్రం తిర‌స్క‌రించింది.

2021 జ‌న‌వ‌రి 7న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జ‌న‌వరి 11న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్లపై విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు.. చ‌ట్టాల‌ను తీసుకొచ్చిన తీరుపై సీరియ‌స్ అయింది. జ‌న‌వ‌రి 12న ఈ చట్టాలపై స్టే విధించింది. ఇక జ‌న‌వరి 15, జ‌న‌వ‌రి 20 వ తేదీల్లో రైతుల‌తో కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జరిపింది. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ఏడాదిన్న‌ర‌ పాటు నిలివేసి, చ‌ట్టంపై చ‌ర్చించేందుకు ఉమ్మ‌డి క‌మిటీ వేస్తామని కేంద్రం తెలిపింది. అయితే ఈ ప్రతిపాదనను కూడా రైతులు తిరస్కరించారు.

2021 జ‌న‌వ‌రి 26న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ రిప‌బ్లిక్ డే రోజున ఢిల్లీలోని ఎర్ర‌కోట వ‌ద్ద రైతుల ఆందోళ‌న‌ చేపట్టగా అది ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. జ‌న‌వ‌రి 28న ఢిల్లీలోని ఘాజీపూర్ స‌రిహ‌ద్దులో రైతులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోకి రైతులు రాకుండా ఘ‌జియాబాద్ వ‌ద్ద రాత్రికి రాత్రే ఉద్య‌మాన్ని విర‌మించి వెళ్లిపోవాల‌ని ప్ర‌భుత్వం ఆర్డ‌ర్ వేసింది. ఫిబ్ర‌వ‌రి 6న చ‌క్కా జామ్ పేరిట దేశ‌వ్యాప్తంగా రాష్ట్ర‌, జాతీయ ర‌హ‌దారుల‌ను రైతులు దిగ్భంధించారు. ఫిబ్ర‌వ‌రి 8న రైలు రోకోకు పిలుపునిచ్చారు.

స్వామినాథన్ కమిషన్ ఏం చెబుతోంది? జాతీయ రైతుల కమిషన్ సూచనలు ఏమిటి? ఎంఎస్ స్వామినాథన్ రిపోర్ట్ యొక్క ముఖ్య సిఫార్సులు ఏమిటీ? పూర్తి సమాచారం

2021 ఫిబ్ర‌వ‌రి 9న పంజాబీ న‌టుడు దీప్ సింధు కార్య‌క‌ర్త‌గా మారి గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున రైతు ఆందోళ‌న‌ల్లో పాల్గొన్నాడంటూ ఢిల్లీ పోలీస్ స్పెష‌ల్ సెల్‌ అరెస్టు చేసింది. ఏడు రోజుల పాటు కస్ట‌డీ విధించింది. ఫిబ్ర‌వ‌రి 18న దేశ వ్యాప్తంగా రైలు రోకోకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది, మార్చి 5న రైతులు, పంజాబ్ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను భేష‌ర‌తుగా ఉప‌సంహ‌రించుకోవాల‌ని పంజాబ్ విధాన స‌భ‌ తీర్మానం ఆమోదించింది.

2021 మార్చి 6న కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల ఉప‌సంహ‌ర‌ణ కోసం రైతులు చేప‌ట్టిన ఉద్య‌మానికి వంద రోజులు పూర్తి అయింది. 2021 ఏప్రిల్ 15 రైతులతో చర్చలు జరపాలంటూ ప్ర‌ధాని మోదీకి హ‌ర్యానా ఉప ముఖ్య‌మంత్రి దుష్యంత్ చౌతాలా లేఖ రాసారు. 2021 మే 21న మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల‌ను పునః ప్రారంభించాల‌ని సంయుక్త కిసాన్ మోర్చా ప్రధాని మోదీకి లేఖ రాసింది. మే 27న ఆరు నెలల ఆందోళ‌న‌ల‌కు గుర్తుగా బ్లాక్ డే నిర్వహించారు.

2021 జూన్ 5న కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ప్ర‌క‌టించి ఏడాది పూర్తి అయింనదున..దీనికి గుర్తుగా నిర‌స‌న‌లు తెలుపుతూ సంపూర్త క్రాంతికారి దివ‌స్‌గా రైతులు పాటించారు. జూన్ 26న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు ఢిల్లీ మార్చ్‌ నిర్వహించారు. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కావ‌డంతో ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కిసాన్ స‌న్స‌ద్ పేరుతో మూడు సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవ‌డంపై రైతులతో చ‌ర్చ‌లు ప్రారంభించింది. 2021 ఆగ‌స్టు 7న 14 ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కుల‌తో పార్ల‌మెంట్ హౌస్‌లో స‌మావేశం ఏర్పాటు చేశారు. 2021 ఆగ‌స్టు 28న క‌ర్నాల్ నిర‌స‌న ప్ర‌దేశంలో రైతుల‌పై పోలీసుల లాఠీఛార్జ్‌ జరగడంతో పరిస్థితి మరింత తీవ్రం అయింది.

2021 సెప్టెంబ‌ర్ 7న రైతులు క‌ర్నాల్ ప్ర‌దేశానికి చేరుకుని మినీ సెక్ర‌టేరియ‌ట్‌ను ముట్టడించారు. సెప్టెంబ‌ర్ 17న మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు ఆమోదం పొంది ఏడాది పూర్తయినందుకు నిర‌స‌న‌గా భార‌త్ బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. సాగు చ‌ట్టాల ఉప‌సంహ‌ర‌ణ కోసం ఇప్ప‌టికీ దేశ రాజ‌ధాని వ‌ద్ద రైతులు దీక్ష‌లు చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఎట్ట‌కేల‌కు కేంద్రం త‌లొగ్గింది. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించారు.

రైతులకు దారుణమైన అన్యాయం జరుగుతోంది, కేంద్రానికి లేఖ రాసిన 75 మంది మాజీ సివిల్‌ సర్వెంట్ల బృందం, రైతులకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం, సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్రానికి సూచన

దీంతో రైత‌న్న‌లు సంబరాల్లో మునిగిపోయారు. గ‌తేడాది నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీతోపాటు దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌కు దిగిన వారిపై కేసులు న‌మోద‌య్యాయి. ఈకేసుల ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ కేసుల్లో చ‌ట్ట విరుద్ధ కార్య‌కలాపాల నిరోధ‌క చ‌ట్టం (ఉపా), త‌దిత‌ర కీల‌క కేసులు న‌మోదయ్యాయి. ఢిల్లీ పోలీసు అధికారులు మాత్రం కేసులు య‌ధాత‌థంగా కొన‌సాగుతాయంటున్నారు. ఇన్ని పరిణామాల మధ్య 2021 నవంబ‌ర్ 19న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నట్లు ప్రధాని ప్రకటన చేశారు.

రైతులపై కేసుల సంగతేంటి 

ఇదిలా ఉంటే విధ్వంసం, నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న నిబంధ‌న‌ల కింద కేసులు న‌మోద‌య్యాయి. ఇక ఉపా కేసులు, ఇత‌ర కేసుల విచార‌ణ కొన‌సాగుతుంద‌ని ఢిల్లీ సీనియ‌ర్ పోలీసు అధికారులు చెప్పారు. ఒక‌వేళ ప్ర‌భుత్వాలు అనుమ‌తిస్తే సంబంధిత కేసుల‌నూ న్యాయ‌స్థానాల్లో క్లోజ‌ర్ రిపోర్ట్ స‌బ్మిట్ చేస్తామ‌ని అధికారులు చెబుతున్నారు. 2020 సెప్టెంబ‌ర్ ఉంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు దేశ రాజ‌ధాని ఢిల్లీలో 39 కేసులు, ఒక ఆత్మ‌హ‌త్య కేసు న‌మోదైంద‌ని హోంశాఖ‌ ప్ర‌క‌టించింది.

హ‌ర్యానా స‌ర్కార్ 136 కేసులు న‌మోదు చేశామ‌ని తెలిపింది. అంతేకాక 10 వేల మంది గుర్తు తెలియ‌ని రైతుల‌పై కేసులు న‌మోద‌య్యాయి. సోనెప‌ట్‌లో 26, అంబాలాలో 15, కురుక్షేత్ర‌లో 14 కేసులు ఉన్నాయి. 2,500 మందికి పైగా రైతుల‌పై ప్ర‌భుత్వాలు కేసులు పెట్టాయ‌ని సంయుక్త్ కిసాన్ మోర్చా ఆరోపించింది. య‌మునాన‌గ‌ర్‌, అంబాలా, క‌ర్నాల్‌, సిర్సా, కురుక్షేత్ర‌ల‌లో ఎక్కువ మందిపై కేసులుపెట్టార‌ని బీకేఎం తెలిపింది.

మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు ఏంటి 

1. నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల (స‌వ‌ర‌ణ ) బిల్లు – 2020

2. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల వ‌ర్త‌క‌, వాణిజ్యం ( ప్రోత్సాహం, స‌దుపాయ క‌ల్ప‌న )బిల్లు -2020

3. ధ‌ర‌ల హామీ, వ్య‌వ‌సాయ సేవ‌ల ఒప్పంద బిల్లు ( సాధికార‌త, ర‌క్ష‌ణ ) -2020

మరి ఈ వివాదాస్పద వ్యవసాయ చ‌ట్టాల్లో ఏముంది?

1. నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల (స‌వ‌ర‌ణ ) బిల్లు

దేశంలో ఇప్పుడు నిత్య‌వ‌స‌ర స‌రుకుల చ‌ట్టం-1955 అమ‌లులో ఉంది. దీనికి స‌వ‌ర‌ణ‌లు చేస్తూ కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఈ చట్టం కింద నిత్య‌ావ‌స‌ర స‌రుకుల జాబితాలో ఉన్న వ‌స్తువుల ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా, పంపిణీ, వాణిజ్యాల నియంత్రణ మొదలగు వాటిపై అధికారం కేంద్రానికి ఉంటుంది. వ్య‌వ‌సాయరంగంలో పోటీ, రైతుల ఆదాయం పెంచ‌డానికి ఉద్దేశించిన చ‌ట్టంగా ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. వినియోగ‌దారుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుతూనే నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌పై నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌ను స‌ర‌ళీక‌రించ‌డం ఈ చ‌ట్టం ఉద్దేశ‌మ‌ని చెప్పారు.

కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు, ఎరువులు, పెట్రోలియం ఉత్ప‌త్తులు వంటి స‌రుకుల‌ను నిత్య‌వ‌స‌రాలుగా పేర్కొన‌డానికి కేంద్ర ప్ర‌భుత్వానికి ఈ చ‌ట్టం అధికారం ఇస్తుంది. అంటే యుద్ధం వ‌చ్చిన‌ప్పుడు, ప్ర‌కృతి విప‌త్తులు త‌లెత్తిన‌ప్పుడు, ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిన‌ప్పుడు లాంటి అసాధార‌ణ ప‌రిస్థితులు త‌లెత్తిన‌ప్పుడు నిత్య‌వ‌స‌రాల ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా, పంపిణీ, వాణిజ్యాన్ని ఈ కొత్త చట్టం ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం నియంత్రించ‌గ‌ల‌దు. ఈ కొత్త సాగు చ‌ట్టం ప్ర‌కారం తృణ ధాన్యాలు, ప‌ప్పులు, ఆలుగ‌డ్డ‌లు, ఉల్లిగ‌డ్డ‌, నూనె గింజ‌లు వంటి ఆహార ప‌దార్థాల స‌ర‌ఫరా, నిల్వ‌ను నియంత్రించే అధికారం కూడా కేంద్రానికి ఉంటుంది.

2. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల వ‌ర్త‌క‌, వాణిజ్యం ( ప్రోత్సాహం, స‌దుపాయ క‌ల్ప‌న )బిల్లు -2020

వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల అమ్మ‌కాల‌పై రైతుల‌కు పూర్తి స్వేచ్ఛ క‌ల్పిస్తుంద‌ని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఈ చ‌ట్టం ప్ర‌కారం క‌నీస మ‌ద్దతు ధ‌ర కోసం ప్ర‌భుత్వాల‌పై ఆధార‌ప‌డ‌కుండా పండించిన పంట‌ను త‌మ ఇష్టానుసారం రైతులు ఎక్క‌డైనా అమ్ముకోవ‌చ్చు. ఇందులో భాగంగా మార్కెట్ క‌మిటీ స‌రిహ‌ద్దులు దాటి విక్ర‌యించే వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌పై రాష్ట్రాలు కానీ.. స్థానిక ప్ర‌భుత్వాలు కానీ ఎలాంటి ప‌న్నులు, ఫీజులు వ‌సూలు చేయ‌డానికి వీల్లేదు.

త‌మ పంట‌ను అమ్ముకునేందుకు, ధ‌ర‌ను నిర్ణ‌యించుకునేందుకు రైతులు, ప్రైవేటు వ్యాపారుల‌కు ఈ బిల్లు పూర్తి స్వేచ్ఛను క‌ల్పిస్తుంది. దీంతో పాటుగా ఎల‌క్ట్రానిక్ వ‌ర్త‌కానికి కూడా ఇది అనుమ‌తిస్తుంది. కాబ‌ట్టి ఆన్‌లైన్‌లో క్ర‌య‌విక్ర‌యాల కోసం ఎల‌క్ట్రానిక్ ట్రేడింగ్ వేదిక‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. పాన్‌కార్డు ఉన్న కంపెనీలు, భాగ‌స్వామ్య సంస్థ‌లు, రిజిస్ట‌ర్డ్ సొసైటీలు, ఫార్మ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఆర్గ‌నైజేష‌న్‌, వ్య‌వ‌సాయ స‌హ‌కార సంస్థ‌లు ఏవైనా స‌రే ఆన్‌లైన్ వ‌ర్త‌క వేదిక‌ను ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయ‌వ‌చ్చు.

3. ధ‌ర‌ల హామీ, వ్య‌వ‌సాయ సేవ‌ల ఒప్పంద బిల్లు

ఈ చట్టం ప్ర‌కారం ఒక రైతు తాను పంట వేయ‌డానికి ముందే కొనుగోలుదారుడితో నిర్ణీత కాలానికి ఒప్పందం కుదుర్చుకోవ‌చ్చు. క‌నిష్టంగా ఒక పంట‌కాలం నుంచి ఐదేళ్ల వ‌ర‌కు ఈ ఒప్పందాన్ని చేసుకోవ‌చ్చు. ఈ ఒప్పంద ప‌త్రంలోనే వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ధ‌ర‌ను పేర్కొనాల్సి ఉంటుంది. ఈ ఒప్పంద వ్య‌వ‌సాయంలో త‌లెత్తే స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఒక అథారిటీ ఉంటుంది.

అదే మూడంచెల వ్య‌వ‌స్థ స‌యోధ్య బోర్డు, స‌బ్ డివిజిన‌ల్ మెజిస్ట్రేట్‌, అప్పీలేట్ అథారిటీ. ప్రైవేటు వ్యాపారికి, రైతుకు మ‌ధ్య ఒప్పందం స‌మ‌యంలో ఏదైనా వివాదం త‌లెత్తితే మొద‌ట బోర్డు ప‌రిధిలో స‌యోధ్య కుద‌ర్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. అక్క‌డ ప‌రిష్కారం దొర‌క్క‌పోతే 30 రోజుల తర్వాత స‌బ్ డివిజ‌న‌ల్ మెజిస్ట్రేట్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. స‌బ్ డివిజిన‌ల్ మెజిస్ట్రేట్ నిర్ణ‌యం న‌చ్చ‌కుంటే అప్పీలేట్ అథారిటీని సంప్ర‌దించ‌వ‌చ్చు. వీటిలో ఏ స్థాయిలోనైనా స‌రే రైతుకు వ్య‌తిరేకంగా నిర్ణ‌యం వ‌స్తే రిక‌వ‌రీ కోసం వ్య‌వ‌సాయ భూమిని తీసుకోవ‌డానికి ఈ చ‌ట్టం అంగీక‌రించ‌దు.

రైతులు ఎందుకు వ్య‌తిరేకించారు?

నిజానికి ఈ మూడు చ‌ట్టాలు రైతులు మేలు చేసేలా క‌నిపించినా ఏ మాత్రం ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన‌వి కావ‌ని రైతు సంఘాలు, విప‌క్షాలు మొద‌ట్నుంచి ఆరోపిస్తూనే ఉన్నాయి. ఈ చ‌ట్టాల వ‌ల్ల ప్రైవేటు వ్యాపారులు, బ‌హుళ జాతి కంపెనీల గుప్పిట్లో రైతులు చిక్కుకునే ప్ర‌మాద‌మే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వారు ఆరోపిస్తున్నారు. స‌న్న‌కారు రైతుల‌ను ఈ చ‌ట్టాలు క‌ష్టాల్లోకి నెట్టేస్తాయ‌ని.. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అందుకే రైతులు కూడా ఈ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న‌కు దిగారు.