PM Narendra Modi and Protesting Farmers. (Photo Credits: PTI | ANI)

New Delhi, November 19: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతిని ఉద్ధేశించి (PM Modi Address Nation) ప్రసంగించారు. ఈ సందర్భంగా మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు (Repeal of 3 Farm Laws) చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాన ప్రకటన చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలను ఉపసంహరించుకుంటామని తెలిపారు. రైతులకు క్షమాపణ చెపుతున్నానని వ్యాఖ్యానించారు. మేం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల్లో ఒక వర్గాన్ని ఒప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు.

నేను దేశానికి క్షమాపణలు చెబుతున్నాను, స్వచ్ఛమైన హృదయంతో... మేం రైతులను వ్యవసాయ చట్టాలపై ఒప్పించలేకపోయాం. మేం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడానికి నేను (PM Narendra Modi ) ఇక్కడ ఉన్నాను... ఈ నెల పార్లమెంటు సమావేశాల్లో రద్దు లాంఛనాలను పూర్తి చేస్తాం’’ అని ప్రధాని మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

సాగు చట్టాలపై వెనక్కు తగ్గిన కేంద్రం, 3 వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రధాని ప్రకటన, రైతుల సంక్షేమమే ధ్యేయమన్న మోడీ.

నా ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో రైతులు పడే అన్ని కష్టాలను చూశాను. మన దేశం నాకు ప్రధాని బాధ్యతలను అప్పగించిన తర్వాత రైతుల అభివృద్ధికి, ఉన్నతికి నేను అత్యంత ప్రాధాన్యతను ఇచ్చాను. రైతులకు 22 కోట్ల భూసార పరీక్ష కార్డులను ఇచ్చాం. దీని వల్ల పంట దిగుబడి పెరిగింది. ఒక లక్ష కోట్ల రూపాయలను రైతులకు పరిహారంగా చెల్లించాం. రైతులకు బీమా, పెన్షన్ ఇచ్చాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతుల అకౌంట్లలోకి నగదును నేరుగా బదిలీ చేశాం. వ్యవసాయ బడ్జెట్ ను ఐదు రెట్లు పెంచాం. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు దొరికేలా కృషి చేస్తున్నాం.

కొత్త చట్టాలు మీరు నిలిపివేస్తారా..మమ్మల్ని నిలిపివేయమంటారా ? కేంద్రంపై అసహనం వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం, రైతుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చురక

100 మంది రైతుల్లో.. 80 మంది రైతుల వ‌ద్ద రెండు ఎక‌రాల‌ లోపే భూమి ఉంద‌న్నారు. ఆ భూమే వారికి జీవ‌నాధారంగా మారింద‌న్నారు. రైతులు త‌మ క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం పొందేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. గ్రామీణ మార్కెట్లకు సంబంధించి మౌలిక వసతులను బలోపేతం చేశాం. పంటకు కనీస మద్దతు ధరను కూడా పెంచాం. క్రాప్ లోన్ ను డబుల్ చేశాం. రైతుల సంక్షేమం కోసం ఎంత చేయాలో అంతా చేశాం. రైతన్నల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేశాం. చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసేందుకే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చాం. రైతుల సంక్షేమానికి, ముఖ్యంగా చిన్న రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. పూర్తి స్థాయిలో వారికి సేవ చేసేందుకు మేము నిబద్ధులమై ఉన్నాం.

అయితే కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులను మేము ఒప్పించలేకపోయాం. ఈ చట్టాలపై వారికి అవగాహన కల్పించేందుకు ఎంతో చేశాం. అయితే రైతుల్లో ఒక వర్గం మాత్రం ఈ చట్టాలను వ్యతిరేకించింది. చట్టాలలో మార్పులు తీసుకొచ్చేందుకు కూడా సిద్ధమయ్యాం. వ్యవసాయ చట్టాల అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ అంశంలో ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. అందరికీ ఒకే విషయాన్ని స్పష్టంగా చెపుతున్నా... వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాం. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనిపై ప్రకటన చేసి... రాజ్యంగపరమైన ప్రక్రియను ప్రారంభిస్తాం. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ ఉద్యమాన్ని విరమించి... క్షేమంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరుతున్నా. ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి" అంటూ ప్రధాని భావోద్వేగంతో ప్రసంగించారు.

కదిలేది లేదు..రోడ్ల పైనే వ్యవసాయం చేస్తాం, అక్టోబర్ 2 వరకు ఇక్కడే కూర్చుంటామని తేల్చి చెప్పిన రైతు సంఘాలు, గాంధీ జయంతి వరకు కేంద్రానికి గడువు ఇస్తున్నామని వెల్లడి

జో కియా కిసానో కే లియే కియా, జో కర్ రహా హున్ దేశ్ కే లియే కర్ రహా హున్ (నేను చేసింది రైతుల కోసం, నేను చేస్తున్నది దేశం కోసం)’’ అని ప్రధాని మోదీ అన్నారు.దేశంలోని పేదలు, రైతుల సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలను కూడా ప్రధాన మంత్రి వివరించారు. ‘‘నా ఐదు దశాబ్దాల కాలంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేను చూశాను... దేశం నన్ను ప్రధానమంత్రిని చేసినప్పుడు, నేను కృషి వికాస్, రైతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ధ‌ర్నాలు చేస్తున్న రైతులంతా త‌మ ఇండ్ల‌కు వెళ్లిపోవాల‌ని ప్ర‌ధాని కోరారు. తాను ఏది చేసినా.. అది రైతుల కోస‌మే చేశాన‌న్నారు. ఏది చేసినా.. అది దేశం కోస‌మే చేశాన‌న్నారు. మీ దీవ‌న‌ల‌తో.. నా కృషినంతా మీకు ధార‌పోస్తాన‌న్నారు. రైతు బాగు కోసం మ‌రింత క‌ఠినంగా ప‌నిచేస్తాన‌ని మోదీ అన్నారు. మీ స్వ‌ప్నాల‌ను, దేశ స్వ‌ప్నాల‌ను నిజం చేసేందుకు ప‌నిచేస్తాన‌ని ప్ర‌ధాని తెలిపారు. రైతులు ఆందోళ‌న విర‌మించాల‌ని, ఇబ్బంది పెట్టి ఉంటే క్ష‌మించాల‌ని, దేశంలోని రైతులంద‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.

రైతులకు దారుణమైన అన్యాయం జరుగుతోంది, కేంద్రానికి లేఖ రాసిన 75 మంది మాజీ సివిల్‌ సర్వెంట్ల బృందం, రైతులకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం, సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్రానికి సూచన

నూతన సాగు చట్టాలను (Farm Laws) కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంతో.. రైతుల త్యాగాలు ఫలించాయని పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో ముందడుగు వేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై విజయం సాధించిన రైతులను అభినందించారు.

కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద సాగు చెట్టాలను చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. గతేడాది నవంబర్‌ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్నారు. దాదాపు ఏడాదిగా రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. రైతులకు క్షమాపణలు చెప్పారు. ‘నల్ల చట్టాలను రద్దు చేయడం సరైన దిశలో ఒక అడుగు. కిసాన్ మోర్చా చేస్తున్న సత్యాగ్రహం చారిత్రక విజయం సాధించింది. మీ త్యాగం డివిడెండ్‌లను చెల్లించింది’ అని సిద్ధూ ట్వీట్ చేశారు.

రైతుల నిరసన ఆగేది లేదు.

మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా, రైతులు మాత్రం నిరసన కొనసాగిస్తామంటున్నారు. సింఘు సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్న రైతులు తిరిగి ఇళ్లకు వెళ్లాలని ప్రధాని కోరారు. అయితే ఢిల్లీకి సమీపంలోని సింఘు సరిహద్దులో క్యాంప్ చేస్తున్న రైతులు మాత్రం దీనిపై చట్టం చేశాకే తిరిగి ఇళ్లకు వెళతామంటున్నారు. పార్లమెంటులో చట్టాలను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మాత్రమే తాము నిరసన స్థలం నుంచి బయలుదేరుతామని రైతులు ముక్తకంఠంతో చెప్పారు. కేంద్రం గత ఏడాది సెప్టెంబరులో తీసుకువచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఏడాది కాలంగా ఆందోళనలు చేశారు. దీంతో దిగివచ్చిన కేంద్రం మూడు వివాదాస్పద చట్టాలను ఎట్టకేలకు రద్దు చేయనుంది.

స్వామినాథన్ కమిషన్ ఏం చెబుతోంది? జాతీయ రైతుల కమిషన్ సూచనలు ఏమిటి? ఎంఎస్ స్వామినాథన్ రిపోర్ట్ యొక్క ముఖ్య సిఫార్సులు ఏమిటీ? పూర్తి సమాచారం

ఇప్పటికిప్పుడు తమ ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. పార్లమెంట్ లో చట్టాలను విధిగా రద్దు చేసిన తర్వాతే.. ఆందోళన విరమింపు, సరిహద్దుల నుంచి కదిలే విషయం మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రైతులకున్న ఇతర సమస్యలపైనా చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా, ఆందోళనల విరమణ, తదుపరి కార్యాచరణకు సంబంధించి రేపు రైతు సంఘాల నేతలు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్టు చెబుతున్నారు. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు.. కనీస మద్దతు ధర పెంపుపైనా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ డిమాండ్ ఇంకా పెండింగ్ లోనే ఉందని, దానిపై ఏదో ఒకటి తేల్చాలని తేల్చి చెప్పారు.

ఎవరేమన్నారు..

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశ‌వ్యాప్తంగా ఉన్న రైతుల‌కు ఆయ‌న కంగ్రాట్స్ తెలిపారు. రైతుల ఆందోళ‌న‌లు ఫ‌లించిన‌ట్లు ఆయ‌న అన్నారు. కేంద్రం ముందే ఈ నిర్ణ‌యం తీసుకుని ఉంటే, సుమారు 700 మంది రైతుల‌ను ప్రాణాల‌ను ద‌క్కించుకునేవాళ్ల‌మ‌న్నారు. భార‌తీయ చరిత్ర‌లో తొలిసారి కేవ‌లం ఆందోళ‌న వ‌ల్ల ప్ర‌భుత్వం మూడు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటోంద‌ని సీఎం కేజ్రీవాల్ అన్నారు.

బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ మాయావ‌తి మాట్లాడుతూ.. రైతుల త్యాగం ఫ‌లించింద‌న్నారు. 3 రైతు చ‌ట్టాల ర‌ద్దు నిర్ణ‌యం ముందే తీసుకుంటే బాగుండేద‌న్నారు. అయితే పంట‌పై క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర డిమాండ్ ఇంకా పెండింగ్‌లో ఉంద‌న్నారు. జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఎంఎస్‌పీ కేంద్రం చ‌ట్టాన్ని రూపొందించాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ కూడా ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు. దేశం, రైతు ప్ర‌యోజ‌నాల దృష్ట్యా మూడు సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేశార‌న్నారు. రైతుల‌కు అండ‌గా బీజేడీ ఎప్పుడూ ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు.

హ‌ర్యానా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గురు పూర్ణిమ రోజున కేంద్రం రైతు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవ‌డాన్ని స్వాగ‌తించారు. స‌మాజంలో శాంతి, సామ‌రస్య స్థాప‌న‌కు ఇది బ‌ల‌మైన అడుగు అన్నారు. రైతు సంఘాలు త‌మ ఆందోళ‌న‌ల్ని విర‌మించుకోవాల‌ని ఆయ‌న కోరారు. రైతు సంక్షేమం కోసం తాము ప‌నిచేస్తామ‌న్నారు.

రైతుల ప్ర‌య‌త్నాలు ఫ‌లించిన‌ట్లు రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ప్ర‌స్తుతం దేశంలో ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. ప్ర‌ధాని మోదీ మూడు సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింద‌న్నారు. యూపీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. ఎన్నిక‌ల్లో నెగ్గేందుకు ప్ర‌ధాని, బీజేపీ తీవ్ర ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. ప‌శ్చిమ బెంగాల్ త‌ర‌హాలో యూపీలో బీజేపీ ఓడినా ఆశ్చ‌ర్యం లేద‌ని గెహ్లాట్ అభిప్రాయ‌ప‌డ్డారు.

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కూడా సాగు చ‌ట్టాల ర‌ద్దు నిర్ణ‌యాన్ని ఆహ్వానించారు.