Farm Laws Repealed: సాగు చట్టాలపై వెనక్కు తగ్గిన కేంద్రం, 3 వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రధాని ప్రకటన, రైతుల సంక్షేమమే ధ్యేయమన్న మోడీ.

New Delhi November 19: ఢిల్లీ సరిహద్దులతో పాటూ దేశవ్యాప్తంగా అన్నదాతలు చేస్తున్న అలుపెరుగని పోరాటానికి కేంద్రం దిగివచ్చింది. వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కుతగ్గింది. మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్రమోడీ.

త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సాగు చట్టాలను వెనక్కు తీసుకునే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు ప్రధాని. సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులంతా తమ కుటుంబాలతో పాటూ క్షేమంగా ఇండ్లకు వెళ్లిపోవాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. గురునానక్ జయంతి, ప్రకాశ్ పర్వ్ సందర్భంగా ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. తాను ఏం చేసినా దేశ రైతుల సంక్షేమం కోసం, దేశ ప్రజల కోసమేనన్నారు. సూక్ష్మ వ్యవసాయ పద్దతులు, 22 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు, పంట దిగుబడి పెంచే అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు ప్రధాని తెలిపారు.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు గతేడాది నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రైతులు దీక్షా శిబిరాల్లోనే కన్నుమూశారు. నవంబర్ 26న తమ పోరాటానికి ఏడాది పూర్తవుతున్నందున భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. ఇంతలోనే ప్రధాని సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో తాము విజయం సాధించినందుకు రైతుల సంబురం చేసుకుంటున్నారు.