New Delhi, July 12: వచ్చే ఏడాది చైనా రికార్డును భారత్ తిరగరాయబోతోంది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశంగా నిలిచిన చైనా 2023 నాటికి రెండో ప్లేసులోకి రానుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశంగా భారత్ నిలవబోతున్నది. జూన్ 11ప్రపంచజనాభా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి (UNO) తాజా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత్ జనాభా 141.2 కోట్లు, చైనా జనాభా 142.6 కోట్లు అని తెలిపారు. 2023లో చైనాను అధిగమిస్తుందని (India to Surpass China) ఆ నివేదిక తెలిపింది. 2100 నాటికి భారత్ జనాభా 109 కోట్ల మందితో తొలి స్థానంలో నిలుస్తుంది. తర్వాత నైజీరియా, చైనా నిలుస్తాయి.
వచ్చే నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. 3.7 కోట్ల మంది జనాభాతో జపాన్ రాజధాని టోక్యో తొలి స్థానంలో ఉంటుంది. భారత్ రాజధాని ఢిల్లీలో 2.9 కోట్ల మంది నివసిస్తున్నారు. చైనాలోని షాంఘై నగరం 2.6 కోట్ల మందితో మూడో స్థానంలో నిలుస్తుంది.
ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day 2022) సందర్భంగా జనాభా విస్పోటనానికి పలు కారణాలను UNO తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 270 మంది నవజాత శిశువులు జన్మిస్తే వచ్చే ఏడాది ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2100 నాటికి 1100 కోట్ల మందికి చేరుతుందని. తెలిపింది. 19వ శతాబ్ధి ప్రారంభంలో 100 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా కేవలం 220 ఏండ్లలోనే 800 కోట్లకు చేరుకుంటున్నది. 2011 నాటికి ప్రపంచ జనాభా 700 కోట్ల మార్క్‌ను దాటేసింది. శరవేగంగా జనాభా పెరిగిపోవడానికి జననాల రేటు అధికంగా ఉండటమే తొలి కారణంగా తెలిపింది.
18వ శతాబ్ధితో పోలిస్తే 20వ శతాబ్ధి చివరినాటికి జననాల రేటు చాలా ఎక్కువ. 250 ఏండ్ల క్రితం వరకు ఒక మహిళ సగటున ఆరుగురు బాలలకు జన్మనిచ్చేవారు. 1950 నుంచి స్వల్పంగా జననాల రేటు తగ్గింది. 1950వ దశకం నాటికి ఒక మహిళ సగటున ఐదుగురికి జన్మనిచ్చారు. 1950 నుంచి జననాల రేటు తగ్గినా, జనాభా విస్పోటన పరిస్థితులు ఏర్పడ్డాయి.. ఆసియా ఖండంలో చైనా, భారత్‌లలో శరవేగంగా జనాభా పెరిగింది.
ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళ సగటున 2.5 పిల్లలకు జన్మనిస్తున్నారు. ఇక19వ శతాబ్ధి ప్రారంభంలో 100 మిలియన్లకు చేరుకున్న ప్రపంచ జనాభా తర్వాత శరవేగంగా పెరగడానికి అధిక జననాల రేటే కారణం. ప్రపంచ జనాభా 200 కోట్ల మందికి చేరడానికి 123 ఏండ్లు పట్టింది. 1927లో ప్రపంచ జనాభా 200 కోట్ల మార్క్‌ను చేరితే, 1960 నాటికి 300 కోట్లకు.. తదుపరి ప్రతి 20 ఏండ్లకు 100 కోట్ల జనాభా పెరుగుతూ వచ్చింది.
250 ఏండ్ల క్రితం అంటే 1770లో మానవులు కేవలం 28 ఏండ్లు మాత్రమే జీవించేవారు. కానీ ఈ రోజు సగటున 70 ఏండ్లకు పైగా జీవిస్తున్నారు. 18వ శతాబ్ధితో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా మానవుడి ఆయురార్థం పెరిగింది. 30 దేశాల్లో మానవుడి సగటు ఆయురార్థం 80 ఏండ్లపైమాటే. 100 దేశాల్లో సగటు జీవన కాలం 70 ఏండ్లు. భారతీయుల సగటు జీవిత ఆయురార్థం 69.7 ఏండ్లు. ఇక జననాల కంటే మరణాల రేటు శరవేగంగా తగ్గడం కూడా జనాభా విస్పోటనానికి మరో ప్రధాన కారణం. 1950 నుంచి జనన, మరణాల రేటు స్థిరంగా తగ్గుతూ వస్తున్నది. 1950లో ప్రతి వెయ్యి మందిలో 20 మంది మరణిస్తే, 2020లో 7.60 మంది మాత్రమే చనిపోయారు. మరణాల కంటే జననాల రేటు రెండు రెట్ల కంటే ఎక్కువగా ఉండటం మరో కారణంగా యుఎన్ఓ తెలిపింది.
శిశు మరణాలు తగ్గుముఖం పట్టడం వల్ల కూడా ప్రపంచ జనాభా 800 కోట్ల దిశగా అడుగులేస్తున్నది. 1990లో ప్రతి వెయ్యి మందిలో 93 మంది మరణిస్తే, 2020లో 37 మందికి పరిమితమైంది. ఆరోగ్య పరిరక్షణ వసతులు పెరగడం దీనికి కారణంగా తెలుస్తున్నది. అయినా సబ్-సహారా ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికీ ప్రతి వెయ్యి మంది బాలల్లో 79 మంది మరణిస్తున్నారు. యూరప్, ఉత్తర అమెరికాల్లో ప్రతి వెయ్యి మందికి ఆరుగురు శిశువులు మాత్రమే చనిపోతున్నారు. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లలో నలుగురే చనిపోతున్నారు.