coronavirus lockdown (Photo Credits: IANS)

Bangalore, May 10: పాక్షిక లాక్‌డౌన్‌ వల్ల కరోనావైరస్ కేసులు ఏమాత్రం తగ్గకపోవడంతో కర్ణాటక సర్కారు నేటి నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ (Karnataka Lockdown) అమల్లోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో నిత్యం 45 వేలకు పైగా పాజిటివ్‌లు, సుమారు 350కి పైగా మరణాలు సంభవిస్తూ ప్రజా జీవితం అతలాకుతలమవుతోంది. ఏ ఆస్పత్రి చూసినా కోవిడ్‌ రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో కోవిడ్‌ కట్టడికి రెండువారాల కింద నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్‌ కర్ఫ్యూ విధించారు.

ఆ తర్వాత ఏప్రిల్‌ 27 నుంచి మే 12 వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు సడలింపులతో లాక్‌డౌన్‌ (Karnataka Bangalore Lockdown) విధించారు. ఇవేమీ కూడా కరోనా విజృంభణను నిలువరించలేకపోయాయి. దీంతో చివరి అస్త్రంగా సంపూర్ణ లాక్‌డౌన్‌కు యడియూరప్ప సర్కారు సిద్ధమైంది. రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. తరువాత జన సంచారంతో పాటు మొత్తం బంద్‌ (Strict Restrictions on Public Movement Till May 24) అవుతాయి.

అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది. ఆస్పత్రులకు వెళ్లవచ్చు. వివాహాలకు 50 మందికి మాత్రమే అవకాశం. నిర్మాణ కార్మికులు పనులకు వెళ్లవచ్చు. సిటీ, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు బంద్‌. కేవలం రైళ్లు, విమానాల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

భారీగా పెరుగుతున్న రికవరీ రేటు, దేశంలో 3.53 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్, తాజాగా 3,66,317 మందికి కోవిడ్, గ‌డ‌చిన 24 గంట‌ల్లో క‌రోనాతో 3,747 మంది మృతి

తాజాగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంప్యుటేషనల్ అండ్ డేటా సైన్సెస్ విడుదల చేసిన నివేదిక గుబులు రేపుతోంది. ఈ నెల 17 నాటికి బెంగళూరులో కేసులు పతాకస్థాయికి చేరుకుంటాయని నివేదిక పేర్కొంది. వచ్చే నెల 11 నాటికి బెంగళూరులో మరో 14 వేల మంది కరోనాతో మరణిస్తారని ఇనిస్టిట్యూట్ నిపుణులు అంచనా వేశారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం, అమల్లో ఉన్న లాక్‌డౌన్ తరహా ఆంక్షలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు. నమోదవుతున్న ఒక్కో కేసు వెనక, వెలుగులోకి రాని రెండు కేసులు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు.

మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగింపు, దేశ రాజధానిలో మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు జారీ

కర్ణాటకలో ఆదివారం కొత్తగా 47,930 కేసులు వెలుగు చూశాయి. ఒక్క బెంగళూరు అర్బన్‌లో 20,897 కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. రికార్డుస్థాయిలో మరో 490 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో వృద్ధులతో పాటు యువత, మధ్యవయస్కులు అధికంగా ఉండడం ఆందోళనకర పరిణామం. ఇక 31,796 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 19,34,378 కి చేరగా, 13,51,097 మంది కోలుకున్నారు. మరణాలు 18,776 కి పెరిగాయి. 5,64,485 మంది కరోనాతో చికిత్స తీసుకుంటున్నారు.

జూన్ 11 నాటికి బెంగళూరులో మరణాలు దారుణంగా పెరిగిపోతాయని ఐఐఎస్‌సీ నిపుణులు చెబుతున్నారు. 14,220 మంది కరోనాకు బలవుతారని పేర్కొన్నారు. నిజానికి ఈ సంఖ్య 26 వేల వరకు ఉంటుందని తొలుత అంచనా వేశారు. అయితే, రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఆంక్షల కారణంగా ఈ సంఖ్య 14 వేలకు తగ్గే అవకాశం ఉందని వివరించారు. కనీసం రెండు వారాలపాటు కర్ణాటకలో కరోనా ప్రమాదకరస్థాయిలో ఉంటుందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాలోని లైఫ్ కోర్స్ ఎపిడెమియాలజీ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ గిరిధర ఆర్ బాబు తెలిపారు. అలాగే, 10 నుంచి 14 రోజులపాటు కరోన మరణాలు తీవ్రస్థాయిలో ఉంటాయని వివరించారు.

పెను ముప్పుగా మారిన సెకండ్ వేవ్‌, 14 రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్, మిగతా రాష్ట్రాల్లో నైట్, డే కర్ఫ్యూలు, నిన్న కొత్తగా నాలుగు లక్షలు దాటిన కోవిడ్ కేసులు, ఒక్కరోజే 4,187 మంది కరోనా కారణంగా మృతి

ఇదిలా ఉంటే బెంగళూరులో సుమారు 6వేల మంది కరోనా పేషెంట్లు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. ఈ వార్తతో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో కూడా దాదాపు 10 వేల మంది కరోనా పేషెంట్లు కనిపించకుండా పోయిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇప్పటి వరకు కూడా వారి ఆచూకీ తెలియలేదు. అయితే కరోనా పరీక్షలకు వచ్చిన వారు తప్పుడు ఫోన్ నెంబర్లు, తప్పుడు చిరునామాలు ఇచ్చారట. వీరిని వెతికేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా... ఏమాత్రం ఫలితం దక్కడం లేదు.

కరోనా నియంత్రణపై ప్రధాని నరేంద్రమోదీ సీఎం యడియూరప్పకు ఫోన్‌చేశారు. పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. మరి కొన్నిరోజుల్లో కన్నడనాట కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని, మరింత కఠినంగా లాక్‌డౌన్‌ విధించినట్లు సీఎం తెలిపారు. అనంతరం సీఎం మంత్రులతో భేటీ అయ్యారు. ప్రతి జిల్లాలో కోవిడ్‌ నిబంధనలు అమలు కావాలని సూచించారు. ఇక సోమవారం నుంచి కర్ణాటక పూర్తిగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వేల సంఖ్యలో జనం ఆదివారమే బెంగళూరు వదిలి పెట్టెబేడా సర్దుకుని సొంత ఊర్లకు బయలుదేరారు. జనతా కర్ఫ్యూ ప్రకటించిన నాటి నుండి బెంగళూరుకు జీవనోపాధికి వలస వచ్చిన జనం స్వంత ఊర్లకు వెళ్లడం ప్రారంభించారు.

ఇప్పుడు లాక్‌డౌన్‌తోపాటు జిల్లా, రాష్ట్ర సరిహద్దులు కూడా మూసివేయడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించడంతో ఇక బెంగళూరులో బతకడం దుర్భరమని భావించిన జనం తండోపతండాలుగా ఊర్లకు బయలుదేరారు. ఆదివారం ఎక్కడ చూసినా జనం తట్టాబుట్టా సర్దుకుని వెళ్తున్న దృశ్యాలే కనబడ్డాయి. రైల్వేస్టేషన్‌ లు కిటకిటలాడాయి. హోసూరు, అత్తిబెలె, తుమకూరు రోడ్డులోని నవయుగ టోల్, గొరగుంటెపాళ్య వద్ద వాహనాలు బారులు తీరాయి.