Airport | Image used for representational purpose

New Delhi, August 20: ప్రపంచంలోని చాలాదేశాల్లో ఎంపాక్స్‌ కేసులు (Mpox Outbreak) రోజు రోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆఫ్రికా, యూరప్‌ అనంతరం వైరస్‌ ఆసియా దేశాలకు సైతం విస్తరిస్తున్నది. ఎంపాక్స్‌ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. వైరస్‌ పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధ్యయనాల ప్రకారం.. ఎంపాక్స్‌ ఇన్ఫెక్షన్‌ ఎక్కువగా ఉండడంతో పాటు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉన్నది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఇన్ఫెక్షన్‌ భారీగా విస్తరించేందుకు అవకాశం ఉన్నది.  ప్ర‌పంచ‌దేశాలకు మ‌రో వైర‌స్ ముప్పు, వేగంగా వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్ వైర‌స్ పై డ‌బ్లూహెచ్ వో ఆందోళ‌న‌, ఇంత‌కీ మంకీ పాక్స్ అంటే ఏంటి? ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి?

పాకిస్థాన్‌లో మరో మంకీపాక్స్‌ కేసు సోమవారం నమోదైంది. దీంతో ఆ దేశంలో ఈ వైరస్‌ సోకిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి తిరిగొచ్చిన 47 ఏళ్ల పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌వాసికి ఈ వైరస్‌ సోకినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌పై పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు..బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని నౌకాశ్రయాల దగ్గర కూడా నిఘా పెంచాలని, మంకీపాక్స్‌ లక్షణాలు ఉన్న వారెవరైనా కనిపిస్తే వెంటనే తెలపాలని పేర్కొంది. అయితే భారత్ లో ఈ కేసులు (No Infection Reported So Far) నమోదు కాకపోవడం ఊరట కలిగించే అంశం.  ఆఫ్రికాలోని 13 దేశాల్లో ఎంపాక్స్‌ కల్లోలం, హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర దేశాలకు పొంచి ఉన్న ముప్పు

మంకీపాక్స్‌ వైరస్‌ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు, చికిత్స చేసేందుకు వీలుగా దేశరాజధాని ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా, సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింగ్‌ ఆసుపత్రులను ఆరోగ్యమంత్రిత్వశాఖ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంకీపాక్స్‌ నోడల్‌ కేంద్రాలుగా తమ పరిధిలోని కొన్ని ఆసుపత్రులను గుర్తించాలని పేర్కొంది. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్ర ఆధ్వర్యంలో ఆదివారం మంకీపాక్స్‌ సన్నద్ధతపై కేంద్రం సమీక్ష జరిపింది.

వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, కరోనా వైరస్‌ కంటే ఎంపాక్స్‌ ప్రమాదకరమని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, కొవిడ్‌ కారణమయ్యే వైరస్‌ సార్స్‌ కోవ్‌-2, ఎంపాక్స్‌ వైరస్‌ చాలా రకాలుగా విభిన్నంగా ఉన్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రెండు వైరస్‌లు జూనోటిక్‌ వ్యాధులే. అంటే జంతువల నుంచి మనుషులకు వ్యాప్తిస్తాయి. సార్స్‌ కోవ్‌-2 వైరస్‌ గబ్బిలాల్లో, ఎంపాక్స్‌ తొలిసారిగా కోతుల్లో గుర్తించారు.

యూఎస్‌ ఆధారిత యూనివర్సిటీ హాస్పిటల్స్‌ రెయిన్‌బో బేబీస్‌ అండ్‌ చిల్డ్రన్స్‌లో ఇన్ఫెక్షియస్‌ డిసీజ్‌ స్పెషలిస్ట్‌ అమీ ఎడ్వర్డ్స్‌ కొవిడ్‌-19 కంటే ఎంపాక్స్‌తో తక్కువ ప్రమాదం ఉంటుందని.. ఇందులో కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయన్నారు. ఎంపాక్స్‌ సులభంగా వ్యాపించదు. సోకిన వ్యక్తులను గుర్తించడం సులభమే. దీనికి వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉన్న రెండు టీకాలున్నాయి.

కొవిడ్‌ మాదిరిగా కాకుండా ఎంపాక్స్‌ అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులకు మాత్రమే సోకే ప్రమాదం ఉంటుంది. దగ్గరి కాంటాక్టులను గుర్తించి చికిత్స అందించడం సులభమే. శరీర ద్రవాలు, గాయాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. దగ్గు, తుమ్ముల ద్వారా విడుదలయ్యే తుంపర్లు, కలుషితమైన బట్టల కారణంగా సైతం సోకేందుకు అవకాశం ఉంటుంది. కొవిడ్‌ తరహాలో గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం లేదు.