New Delhi, August 31: కాంగ్రెస్ పార్టీలో ఓ శకం ముగిసింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అస్తమయం (Pranab Mukherjee No more) చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఈ సాయంత్రం కన్నుమూశారు. ప్రణబ్ మృతితో రాజకీయపార్టీలకు అతీతంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో (Congress Party) కొనసాగిన ఆయన వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో ఏడుసార్లు పార్లమెంటేరియన్‌గా ప్రణబ్ (Pranab Mukherjee) పని చేశారు. ఆయన్ను అందరూ ప్రణబ్ దాదాగా పిలుస్తుంటారు. బెంగాల్‌లో ప్రణబ్ దా అనే పిలుపు చాలా పాపులర్ అయ్యింది.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi), రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (President Kovind), ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్‌ను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ప్రణబ్ ముఖర్జీదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతించారు. భారతరత్న ప్రణబ్ ముఖర్జీ కన్నుమూతతో (Pranab Mukherjee Dies) దేశం విషాదంలో కూరుకుపోయిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రణబ్ ముఖర్జీ గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆయన మరణం దేశానికి తీరని లోటని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు.
ప్రణబ్ ముఖర్జీ క్రమశిక్షణ, అంకిత భావంతో దేశానికి సమున్నత సేవలు అందించారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దేశం గొప్ప రాజకీయ నేతను కోల్పోయిందని హోంమంత్రి అమిత్ షా ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.అనేక దశాబ్దాలపాటు భారత దేశానికి విశేష సేవలందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిరాడంబరత, నిజాయితీలకు ప్రతిరూపమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రణబ్ మృతి పట్ల యావత్ జాతి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తోందని రాహుల్ అన్నారు. ప్రణబ్ ముఖర్జి మరణంతో భారత రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగిసినట్లేనని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అభిప్రాయపడ్డారు.
సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (TS CM KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ అంశంతో ప్రణబ్‌కు ఎంతో అనుబంధం ఉందన్నారు. యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. దాదా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రణబ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ సేవలు అజరామరం అని కొనియాడారు. ఐదు దశాబ్ధాల పాటు దేశానికి ఎంతో సేవ అందినారని ప్రశంసించారు.
ప్రణబ్ జీవిత ప్రయాణం (Former President Pranab Dada Biography)
ప్రణబ్ పూర్తిపేరు ప్రణబ్ కుమార్ ముఖర్జీ. ఆయన 1935 డిసెంబరు 11న బెంగాల్ ప్రెసిడెన్సీలోని మిరాఠీ (ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో ఉంది) గ్రామంలో జన్మించారు. ప్రణబ్ తండ్రి కమద్ కింకర్ ముఖర్జీ స్వతంత్ర సమర యోధుడు. తల్లి పేరు రాజ్యలక్ష్మి ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ తండ్రి కమదా కింకార్ ముఖర్జీ ఓ స్వాతంత్ర్య సమరయోధుడు. మహాత్మాగాంధీ నేతృత్వంలో స్వతంత్ర్య పోరాటం, ఉద్యమాల్లో పాల్గొన్న కారణంగా ఆయన పలుమార్లు జైలుకు వెళ్లారు. ఆ రోజుల్లో ప్రజలు ఆహారం లేక అల్లాడేవారనీ... బెంగాల్లో దాదాపు 50 లక్షల మంది ఆకలితో చనిపోయారని ఆహార భద్రతా బిల్లు తీసుకొచ్చిన సందర్భంగా ప్రణబ్ గుర్తుచేసుకున్నారు.
ప్రణబ్ దాదా బాల్యం
ప్రణబ్ తన బాల్యంలో స్కూల్‌కి వెళ్లడం కోసం రోజూ 10 కిలోమీటర్లు నడిచారు. ‘‘అప్పట్లో మాకు ఎలాంటి రవాణా సదుపాయాలు ఉండేవి కాదు. చిన్నతనంలో చదువు కోసం రోజూ 10 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. వేసవిలో, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది...’’ అని ప్రణబ్ ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. పొలిటికల్ సైన్స్, హిస్టరీ సబ్జెక్టుల్లో ఎంఏతో పాటు ఎల్ఎల్ బీ పట్టా కూడా అందుకున్నారు. కోల్‌కతా వర్సిటీలోనే ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు.
ప్రణబ్ కుటుంబం విషయానికొస్తే.... ఆయనకు 1957లో సువ్రాతో వివాహం జరిగింది. ప్రణబ్-సువ్రా ముఖర్జీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు అభిజిత్, కుమార్తె శర్మిష్ట రాజకీయాల్లో ఉన్నారు. ప్రణబ్ కు అక్కయ్య అన్నపూర్ణ, తమ్ముడు పియూష్ ఉన్నారు. పోస్టు అండ్ టెలిగ్రాఫ్ విభాగంలో క్లర్క్‌గా పని చేశారు. కోల్‌కతాలోని విద్యానగర్ కాలేజీలో 1963లో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు దేషేర్ డాక్ అనే పత్రికలో జర్నలిస్టుగానూ సేవలు అందించారు.
రాజకీయాల్లోకి ఎంట్రీ
రాజకీయాల్లోకి అడుగుపట్టక ముందు టీచర్‌గా, జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో ప్రణబ్ ప్రతిభను గుర్తించిన ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించారు. ఆయనను ఎంతో ప్రోత్సహించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాజకీయ ప్రస్థానం 1969లో ప్రారంభమైందని చెప్పవచ్చు. మిడ్నాపూర్ ఉప ఎన్నికల వేళ వీకే కృష్ణమీనన్ తరపున ప్రణబ్ ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నారు. ప్రణబ్ ట్యాలెంట్‌ను గుర్తించిన ఇందిర ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించింది. ఆ విధంగా 1969లో ఆయన తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1969లో రాజ్యసభకు వెళ్లడం ఆయన పొలిటికల్ కెరీర్ లో ఓ మలుపు అని చెప్పాలి.
అక్కడి నుంచి 75, 81, 93, 99లోనూ ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. బెంగాల్‌లోని జాంగిపూర్ నుంచి 2004లో ఆయన తొలిసారి లోక్‌సభకు ఎన్నికైనా, దీనికి ముందు వరుసగా నాలుగు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు. 2004లోలో లోక్ సభకు ఎన్నికైన ఆయన 2012లో కొనసాగారు. అంతకుముందు 1993 నుంచి 1995 వరకు కేంద్ర వాణిజ్యమంత్రిగా, 1995 నుంచి 1996 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా వ్యవహరించారు. 2006 నుంచి 2009లోనూ అవే బాధ్యతలు నిర్వర్తించారు.
2004 నుంచి 2006 వరకు రక్షణమంత్రిగా, 2009 నుంచి 2012 వరకు ఆర్థికమంత్రిగా పదవులు అలంకరించారు. 2012లో ప్రతిభా పాటిల్ పదవీ విరమణ తర్వాత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఆయన 2017 వరకు కొనసాగారు. ప్రణబ్ భారత్ లోనే కాదు అంతర్జాతీయంగానూ పలు పదవులకు వన్నె తెచ్చారు. భారత ఆర్థికమంత్రిగా వ్యవహరించిన సమయంలో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంకు, ఆఫ్రికన్ డెవలప్ మెంట్ బ్యాంకుల బోర్డ్ ఆఫ్ గవర్నర్లలో ఒకరిగా బాధ్యతలు నిర్వర్తించారు.
13 నెంబర్‌తో ఎంతో ప్రత్యేక అనుబంధం
మచ్చలేని రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు 2008లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. 2019లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న వరించింది. ముఖ్యంగా గాంధీల కుటుంబానికి సన్నిహితుడిగా గుర్తింపు పొందడమే కాదు, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రణబ్ ముఖర్జీకి 13 నెంబర్‌తో ఎంతో ప్రత్యేక అనుబంధం ఉంది. 13 నంబర్ అనగానే చాలా మంది భయపడుతుంటారు కానీ.. దాదా జీవితం ఆ నెంబర్‌తోనే ముడిపడి ఉంది. రాష్ర్టపతిగా ప్రణబ్ రంగంలోకి దిగింది 13వ తేదీనే. ఢిల్లీలో దాదా నివాసముండే బంగ్లా నంబర్ కూడా 13. ఆయన పెళ్లి రోజు కూడా 13 తేదీనే. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్ర మమతా బెనర్జీ రాష్ర్టపతిగా ప్రణబ్ కు మద్దతు తెలిపి ఆయన పేరును ఎత్తి చాటింది కూడా జూన్ 13, 2012నే..
రాజకీయ వ్యూహకర్త, పార్లమెంటేరియన్
రాజకీయ వ్యూహకర్తగా, పార్లమెంటేరియన్‌గా ప్రణబ్ ముఖర్జీ తిరుగులేని నేతగా కొనసాగారు. మన్మోహన్ సింగ్ సారథ్యంలోని ప్రభుత్వంలో ప్రణబ్ పనిచేయడంతో పాటు, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే ట్రబుల్ షూటర్‌గా పేరుతెచ్చుకున్నారు. ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ హయాంలో ప్రణబ్‌కు అంతగా ప్రాధాన్యం లభించలేదు. ఇందిరాగాంధీతో సరిపోలిన ప్రతిభాశాలి, అనుభవశాలి కావడంతో ఆయనను రాజీవ్ గాంధీ పక్కనపెట్టి, పార్టీపై పట్టు సాధించాడని చెబుతారు. ప్రణబ్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా పశ్చిమబెంగాల్ పీసీసీకి పంపడం జరిగింది.
రాజీవ్ తెరపైకి..
1984లో అప్పటి ప్రధాని ఇందిరా హత్య తర్వాత తానే నిజమైన వారసుడిగా భావించిన ప్రణబ్ డిమాండ్‌ను తోసిపుచ్చి రాజీవ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. అనుకున్న పదవి దక్కకపోవడంతో 1984లో కాంగ్రెస్‌కు ప్రణబ్ గుడ్‌బై చెప్పారు. రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ పేరుతో 1984లో ప్రణబ్ సొంత పార్టీ స్థాపించారు.1989లో రాజీవ్‌గాంధీ ఆయన్ని బుజ్జగించి తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చారు.1991లో రాజీవ్ హత్య తర్వాత ప్రధాని అయ్యేందుకు ప్రణబ్ ప్రయత్నాలూ చేశారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీని కాదనుకుని పీవీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ కుటిల రాజకీయాల ఫలించకపోతే ప్రణబ్ ఎప్పుడో దేశ ప్రధాని అయ్యేవారిని ఆయన సహచరులు చెబుతుంటారు. ఆరు దశాబ్ధాల పాటు రాజకీయల్లో కొనసాగిన దాదా.. పార్లమెంటు వ్యవహారాల్లో ఆయన్ని మించిన వారు లేదనే విధంగా మెలిగారు.
తెలంగాణతో ప్రత్యేక అనుభందం
ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణతో ప్రత్యేక అనుభందం ఉంది. ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ సంతకం పెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునః విభజన బిల్లుపై సంతకం చేశారు. ఆయన జారీచేసిన ప్రత్యేక గెజిట్ ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ప్రణబ్ నాయకత్వం వహించారు.
రాష్ట్రపతి భవన్ ప్రణబ్ కెరీర్‌లో చివరి మజిలీ
రాష్ట్రపతి భవన్ ప్రణబ్ కెరీర్‌లో చివరి మజిలీగా చెప్పవచ్చు. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి నామినీగా ఆయన 2012లో దేశ 13వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2017లో ఆయన పదవీకాలం ముగిసింది. జనవరి 2019లో ప్రణబ్ ముఖర్జీని అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న' వరించింది. ఆ సందర్భంగా 'ఔట్ స్టాండింగ్ స్టేట్స్‌మన్ ఆఫ్ అవర్ టైమ్స్' అంటూ ప్రణబ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.
నిఖార్సైన రాజకీయవేత్త
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పక్కా కాంగ్రెస్ నేత అయినా రాష్ట్రపతిగా బాధ్యతలు ముగిశాక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాగ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో కలిసి వేదికను పంచుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంత రచ్చ చేసినా ప్రణబ్ వెనక్కు తగ్గలేదు. కార్యక్రమంలో పాల్గొని తాను నిఖార్సైన రాజకీయవేత్తనని నిరూపించుకున్నారు. రాష్ట్రపతి అయినప్పటినుంచీ తాను అన్ని పార్టీలకు చెందినవాడినని చెప్పకనే చెప్పారు. రాష్ట్రపతి బాధ్యతలు ముగిశాక కూడా ఆయన అదే తరహాలో వ్యవహరించారు.
45 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరణ
ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పని చేసిన కాలంలో ఏకంగా ఆయన 45 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. వారందరికీ ఉరి శిక్ష ఖరారు చేశారు. కేవలం నాలుగింటిని మాత్రమే జీవిత ఖైదుగా మార్చారు ప్రణబ్. ఘోరమైన పాపాలకు పాల్పడిన వారికి మరణ శిక్ష సరైందే అని దాదా గట్టిగా నమ్మేవారు. అలా ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అఫ్జల్‌గురు, యాకుబ్ మెమన్‌తో పాటు మరెంతో మంది క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించి, వారందరికీ ఆయన ఉరి శిక్ష ఖరారు చేశారు. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ఆర్డినెన్స్‌ను మాత్రం సంప్రదాయాలకు విరుద్ధంగా ఐదుసార్లు నాన్చారు. గుజరాత్ ప్రభుత్వ ఉగ్రవాద-నిరోధక బిల్లునూ వెనక్కి తిప్పి పంపారు.
దౌత్యపరమైన అనుభవం
దౌత్యపరమైన అనుభవం కూడా ప్రణబ్‌కు ఎక్కువే. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకుల బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో చేశారాయన. 1994, 95, 2005, 06 సంవత్సరాల్లో యూఎన్ అసెంబ్లీకి వెళ్లారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య వనరుల పంపకాలపై 1991లో ఓ ఫార్ములాను ప్రణబ్ రచించారు. గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములాగా దాన్ని గుర్తించారు. ఆర్బీఐ గవర్నర్‌గా మన్మోహన్ సింగ్‌ను అపాయింట్ చేస్తూ 1982లో ఆర్థిక మంత్రిగా ప్రణబ్ సంతకం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ, జాతి నిర్మాణం అంశాలపై ఆయన అనేక పుస్తకాలు రాశారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
పలు పుస్తకాలను రచించిన దాదా
మరోవైపు రచయితగా కూడా ప్రణబ్ పలు పుస్తకాలను రచించారు. 1987లో ‘ఆఫ్ ద ట్రాక్’ పుస్తకాన్ని 1992లో ‘సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్’, చాలెంజెస్ బిఫోర్ ద నేషన్ పుస్తకాలను.. 2014లో ‘ద డ్రమాటిక్ డెకేడ్: ద డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్’అనే పుస్తకాలను రచించారు. 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న ప్రణబ్.. 2010లో ఆసియాలో అత్యుత్తమ ఆర్థిక మంత్రి అవార్డు పొందారు. 2013లో బంగ్లాదేశ్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు.