All 41 workers trapped inside the Silkyara tunnel in Uttarakhand since November 12, have been successfully rescued.

ఉత్తర్‌కాశీ, నవంబర్ 28: ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం పాక్షికంగా కూలిపోయిన ఘటనలో చిక్కుకున్న కూలీలంతా క్షేమంగా బయటకు వచ్చారు. 17 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలు ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. 41 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గంటలోపు ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తి అయిందని రెస్క్యూటీం ప్రకటించింది.

ఘటనాస్థలానికి ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి, రోడ్డు రవాణా శాఖల మంత్రి జనరల్‌ వీకే సింగ్‌లు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అంతకు ముందు దాదాపు 17 రోజులుగా సొరంగంలో ఉన్న వీరి వద్దకు ఆరు అంగుళాల వ్యాసం ఉన్న గొట్టాన్ని పంపించారు. ఆ పైప్‌ ద్వారా ఓ ఎండోస్కోపీ తరహా కెమెరాను పంపగా.. కూలీలంతా సురక్షితంగా ఉన్నట్లు అందులో కన్పించింది. ఈ దృశ్యాలను రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్ ధామి ఎక్స్‌లో పంచుకున్నారు.

ఉత్తరకాశీ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌, బయటకు వచ్చిన మొదటి కూలీ, గంటలోపు దాదాపు ఆపరేషన్‌ సక్సెస్ అవుతుందని తెలిపిన సీఎం దామి

కాగా నవంబరు 12న పనులు చేస్తుండగా అనూహ్యంగా చోటు చేసుకున్న ఘటనతో 14 మంది కూలీలు సొరంగంలో చిక్కుకుపోయారు. తిరుగాడడానికి రెండు కి.మీ. మేర ప్రాంతం ఉండడం, బయటి నుంచి తాగునీరు, ఆహారం, ఔషధాలు వంటివన్నీ అందుకునే వెసులుబాటును కల్పించడంతో వారు క్షేమంగానే ఉన్నా, పూర్తిగా బయటపడేవరకు కుటుంబ సభ్యులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. వారిని చూస్తూనే అంతా భావోద్వేగానికి గురయ్యారు.

Here's ANI Tweet

కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలను దాటి సహాయక సిబ్బంది వారి ప్రాణాలను కాపాడగలిగారు. సొరంగ శిథిలాల్లో 57 మీటర్ల పొడవునా గొట్టపు మార్గాన్ని వేయగలిగితే కూలీల వద్దకు చేరుకోవచ్చని గుర్తించిన అధికారులు.. అందుకోసం ఆగర్‌ యంత్రంతో డ్రిల్లింగ్‌ చేపట్టారు. ఈ మిషన్‌ 47 మీటర్లు తవ్విన తర్వాత.. ప్రమాదవశాత్తూ సొరంగంలోని ఇనుపపట్టీని ఢీకొట్టింది.

దీంతో దీని బ్లేడ్లు విరిగిపోయి యంత్రం పనిచేయకుండా పోయింది. అయినా అధికారులు వెనకడుగు వేయలేదు. ప్రత్యామ్నాయంగా కొండపై నుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్‌ పనులు చేపట్టారు. అదే సమయంలో సొరంగంలో చిక్కుకున్న ఆగర్‌ మిషన్‌ శిథిలాలను కట్టర్‌ సాయంతో తొలగించారు. ఆ తర్వాత 12 మంది ‘ర్యాట్‌ హోల్‌ మైనర్ల’ (బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులు)ను రంగంలోకి దించారు. మిగతా డ్రిల్లింగ్‌ పనిని వీరు మాన్యువల్‌గా చేపట్టారు.

సోమవారం రాత్రి నుంచి ఈ ర్యాట్‌ హోల్‌ మైనర్లు మెరుపు వేగంతో తవ్వకాలు చేపట్టడంతో 57 మీటర్ల డ్రిల్లింగ్‌ పూర్తయ్యింది. ఆ తర్వాత కూలీలు ఉన్న ప్రాంతం వరకు గొట్టాన్ని పంపించి అందులో నుంచి వారిని బయటకు తీసుకు వచ్చారు. అప్పటికే సొరంగం వెలుపల సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌ల్లో కూలీలను ఆసుపత్రికి తరలించారు. బాధితులను సొరంగం నుంచి వెలికి తీసిన వెంటనే పరిస్థితి విషమంగా ఉన్న వారికి అత్యవసర చికిత్స అందజేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బాధితులను ఆకాశమార్గంలో తరలించడం కోసం టన్నెల్‌కు సమీపంలోని చిన్యాలిసౌర్‌ ఎయిర్‌ స్ట్రిప్‌లో చినూక్‌ హెలిక్యాప్టర్‌ను సిద్ధంగా ఉంచారు.

అదేవిధంగా రిషికేశ్‌లోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో బాధితుల కోసం 41 పడకలతో కూడిన స్పెషల్ వార్డును సిద్ధం చేశారు. అందులో ట్రామా కేర్‌ సెంటర్‌ను కూడా సిద్ధంగా ఉంచారు. కార్డియాలజిస్టులు, సైకియాట్రిక్‌ స్పెషలిస్టులు, ట్రామా సర్జన్‌తో కూడిన ఒక బృందం కూడా ఆ ప్రత్యేక వార్డులో రెడీగా ఉన్నది. ఎయిమ్స్‌ ప్రాంగణంలో హెలిప్యాడ్‌లో ఒకేసారి మూడు హెలిక్యాప్టర్‌లను ల్యాండ్‌ చేయవచ్చని, పరిస్థితి విషమించిన బాధితులను హెలిక్యాప్టర్ల ద్వారా ఎయిమ్స్‌కు తరలిస్తామని అధికారులు చెప్పారు.

ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌పై కొండచరియలు విరిగిపడటంతో కొంత భాగం కూలిపోయింది. దాంతో అక్కడ పని చేస్తున్న 41 మంది కూలీలు ఆ టన్నెల్‌లో చిక్కుకుపోయారు. ఈ నెల 12న ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.