Statue of Gidugu Venkata Ramamurthy | Telugu Language Day (Photo Credits: File Photo)

భారతదేశంలో ప్రాచీనంగా ఉన్న ఆరు అత్యున్నత స్థాయి భాషలలో తెలుగు భాష ఒకటి. క్రీ.పూ 400 సంవత్సరాల నుండే తెలుగు భాష వాడుకలో ఉన్నట్లుగా చరిత్ర ఆధారంగా తెలుస్తుంది. ఇండియాలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తెలుగు భాషా ప్రధాన రాష్ట్రాలు. యానాం, పాండిచ్చేరి టెరిటరీలలో కూడా ఎక్కువ మంది తెలుగు భాషను మాట్లాడుతారు. ఇటు కర్ణాటక, ఒడిషా, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలలో మరియు అండమాన్ దీవులలో కూడా తెలుగు భాష ప్రభావం చాలా ఉంది. శ్రీలంక దేశంలోని 'జిప్సీ' కమ్యూనిటీ ప్రజలు కూడా మాట్లాడే భాష తెలుగే.

ప్రతీ ఏడాది ఆగస్టు 29ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "తెలుగు భాష దినోత్సవం" గా పాటిస్తారు. తెలుగు భాషకు ఎనలేని కృషి చేసిన కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి రోజైన ఆగష్టు 29ని తెలుగు భాష దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తెలుగు భాష మాట్లాడే విధానం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ఇద్దరు తెలుగు వ్యక్తుల మధ్య మాట్లాడబడే తెలుగు భాషలో కూడా వ్యత్యాసం కనిపిస్తుంది. అయితే అందరికీ ఆమోదయోగ్యమైన అందరికీ అర్థమయ్యే రీతిలో ఉన్నత ప్రమాణాలతో గిడుగు రామమూర్తి తన రచనలతో గ్రాంథిక భాష నుండి వ్యవహారిక భాష (వాడుక భాష)లోకి తెలుగును ఆధునీకరించారు, తెలుగు భాషాభివృద్ధికి పాటుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన గౌరవార్థం తెలుగు భాష దినోత్సవం ఏపి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.

రామ్మూర్తి పంతులు సేవలను కొనియాడిన నేతలు.

ఇక నేడు మాతృభాష దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు తమ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు భాష ఔన్నత్యానికి చేసిన రామ్మూర్తి పంతులు చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా, మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని వారు పిలుపు నిచ్చారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా, తల్లి లాంటి మాతృభాషను మరవకూడదని ఆయన పేర్కొన్నారు. తాను రాజ్యసభ ఛైర్మన్ హోదాలో వ్యవహరిస్తున్నప్పుడు సభ్యులకు తమ మాతృభాషలోనే మాట్లాడే స్వేచ్ఛనిచ్చినట్లు గుర్తు చేశారు.