Monsoon Diet Tips: వానలో వేడివేడి పకోడి తింటున్నారా? ఈ వానాకాలంలో తినకూడని పదార్థాలలో అదే మొదటిది.  ఇంకా ఏమేం తినకూడదో తెలుసుకోండి.

Monsoon - బయట జోరుగా వర్షం పడుతుండగా, చల్లటి గాలి మిమ్మల్ని తాకుతుంటే అలా రోడ్డు పక్కనే బండి మీది నుంచి వేడివేడి పకోడి సువాసన మిమ్మల్ని రారామ్మని ఆహ్వానిస్తుంది. నిగనిగలాడే మిర్చి బజ్జీలు నన్ను కూడా ఒక చూపు చూడమని మిమ్మల్ని బుజ్జగిస్తాయి. పొరపాటున కానీ వాటికి మీరు టెంప్ట్ అయ్యారో దాని రుచి ఎలా ఉంటుందో అవి మీ ఆరోగ్యంపై చూపించే దెబ్బ రుచి అంతకంటే అదిరిపోయేలా ఉంటుంది.

వానాకాలం (Rainy Season) లో తిండి విషయంలో (Diet)  చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, సాధ్యమైనంత వరకు ఇంట్లో వండిన వాటికే ప్రాధాన్యతను ఇవ్వండి.

అయితే ఈ వానాకాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాల కూడా దూరంగా ఉండటం మంచిది. అవేంటో తెలుసుకోండి.

నూనెలో వేయించిన పదార్థాలు

వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ కమ్మగా పకోడిలు, బజ్జీలు, సమోసాలు వేయించుకుని తినడం ఎవరికి ఇష్టం ఉండదు? ఇవి చాలామందికి మాన్ సూన్ ఫేవరెట్స్. కానీ వానాకాలంలో ఆయిల్ ఫుడ్స్ తినడం అంత మంచిది కాదు. నూనెలో డీప్ ఫ్రై చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ సీజన్ లో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నూనెలో వేయించిన ఆహారపదార్థాలు తినడం దగ్గు, అజీర్తి తదితర సమస్యలతో జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం చేస్తాయి. ఎప్పుడైనా బాగా తినాలనిపిస్తే ఒకటి - రెండు సార్లు ఇంట్లో శుద్ధమైన నూనెతో చేసుకుని తింటే ప్రాబ్లెం లేదు.

అలాగే ఏ కాలంలో అయినా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ మంచిది కాదు, వానాకాలంలో అస్సలు మంచిది కాదు, కాబట్టి ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండండి.

పెరుగు

పెరుగు ఒంటికి చాలా మంచింది కానీ అన్ని వేళల్లో మంచిది కాదు. ఎండాకాలంలో బయటకు వెళ్తున్నప్పుడు డీహైడేషన్ కాకుండా, శరీరాన్ని చల్లబరిచేందుకు పెరుగు, చల్ల ఉపయోగపడతాయి. వర్షాకాలంలో డీహైడ్రేషన్ సమస్య ఏమి ఉండదు కాబట్టి మీరు ఆరోగ్యాన్ని పాడుచేసుకోవాలనుకుంటే తప్ప పెరుగు, మజ్జిగ, నిమ్మరసం, ఇతర జ్యూస్ లు, కార్బోనేటెడ్ బేవరేజెస్ జోలికి వెళ్లకపోవడం మంచిది. వాటికంటే తాజా పండ్లు తినడం, గోరు వెచ్చని అల్లం ఛాయ్ లాంటివి తాగడం మంచిది.

పానీపూరి

అబ్బో.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరమా? పానీపూరి కోసం వాడే కుండలో ఆ నీళ్లు ఎక్కడివో, దానిలో ఎన్ని లక్షల క్రిములు ఈత కొడుతుంటాయో ఊహించుకోవడం కూడా కష్టమే. వర్షాకాలంలో పానీపూరిలు తినడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. నీరు కలుషితం అవ్వడం ద్వారా వ్యాప్తి చెందే రోగాలు, రోగ కారకాలన్నింటికి ఆ పానిపూరీనే ఓ అడ్డా. దగ్గు, జలుబు, పచ్చకామెర్లు, డయేరియా లాంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.

ఆకుకూరలు

వానాకాలంలో ఆకుకూరలు ఎవరు తినరు. ఎందుకంటే ఈ వానాకాలంలోనే వాటి ఆకులపై క్రిమికీటకాలు బాగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి వానాకాలంలో ఆకుపచ్చగా కనిపించే కాయగూరలు, ఆకుకూరలకు దూరంగా ఉండటం మంచిది. మీకు తినాలనిపిస్తే శుభ్రంగా మంచినీటితో కడిగి, బాగా ఉడికించుకొని తినడం మంచింది.

మత్ససంబంధమైన ఆహారపదార్థాలు (Seafood)

మీకు అనిపించొచ్చు ఈ వానాకాలంలో చేపలు, నీటిలో దొరికే ఇతర జీవులు బాగా దొరుకుతాయి. ఫ్రెష్ గా వండి తినేసుకోవచ్చు అని. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఈ వానాకాలంలోనే చెరువులు, కుంటలు, నదులు, సముద్రాలు అన్నీ కలుషితం అయ్యేది. నీరు కలుషితం ఉండటం ద్వారా అందులో ఉండే జీవరాశి కలుషితమైనట్లే. వాటిలో చాలా రకాలయిన హానికర బ్యాక్టీరియాలు ఆవాసం ఏర్పరుచుకుంటాయి. కాబట్టి సాధ్యమైనంతవరకూ సీఫుడ్స్ కు దూరంగా ఉండి ప్రత్యామ్నాయాలు చూసుకోవడం మంచిది. అయితే చేపలైనా, ఇంకా ఎలాంటి మాంస పదార్థాలయినా పూర్తి శుభ్రంగా కడిగి, బాగా వండి తినాలి. ఈ వానాకాలంలో మాంసం మితంగా తీసుకోవాలి.

శీతల పదార్థాలు

వర్షంలో మిరపకాయ బజ్జీలు ఎవరైనా తింటారు, చల్లగా ఐస్ క్రీంలు తినేవాడే రొమాంటిక్ ఫెలో అని ఎవరైనా అంటే అస్సలు నమ్మకండి. ఐస్ క్రీంలు, కుల్ఫీలు, పుల్ల ఐస్ అదీ, ఇదీ పేరేదైనా దూరం దూరం. లేకపోతే రొమాంటిక్ ఫెలో, రొమాన్స్ లాంటి వాటికి ఛాన్సే లేదు నేరుగా హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సి ఉంటుంది.