చికెన్ నాన్‌వెజ్ ప్రియులు ఎవరైనా దాన్ని తినేందుకు అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తారు. ఈ క్రమంలోనే తమ జిహ్వా చాపల్యాన్ని కూడా తీర్చుకుంటారు. అయితే చికెన్ బాగా ఉడికి, సరిగ్గా దాన్ని వండి ఉంటే… అలాంటి చికెన్‌ను ఏ వెరైటీ రూపంలోనైనా నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ చికెన్‌ను సరిగ్గా ఉడికించకపోతే..? అప్పుడు అలాంటి చికెన్‌ను తిన్న వారికి అనారోగ్యాలు రాక మానవు. డయేరియా, కడుపునొప్పి వంటివి అప్పటికప్పుడు సంభవించే అనారోగ్యాలు. కానీ అలా ఉడకని చికెన్ తినడం వల్ల ఆ అనారోగ్యాలు మాత్రమే కాదు, కొందరిలో పక్షవాతం వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందట. సైంటిస్టులు పరిశోధించి చెబుతున్న సత్యమే ఇది..!
అమెరికాలోని మిషిగాన్ స్టేట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ వైద్య బృందం తాజాగా చేసిన పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే… చికెన్‌ను సరిగ్గా ఉడికించకపోవడం వల్ల అందులో సాల్మొనెల్లా కాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా టైపి, క్యాపిలోబాక్టర్ జెజునీ అనే 3 రకాల బాక్టీరియాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయట. ఇవి మనం తిన్న ఆహారంలో కలిసి అనంతరం నేరుగా రక్త ప్రసరణలో చేరుతాయి. అప్పుడు ఆ రక్తంలో ఉండే ఆ బాక్టీరియాలు మనకు డయేరియా, కడుపునొప్పి, వాంతులు, రక్త విరేచనాలు, టైఫాయిడ్ జ్వరం, తలనొప్పి వంటి అనారోగ్యాలు తెచ్చి పెడతాయి. దీంతోపాటు రక్తంలో ఉన్న బాక్టీరియా ఎముకలకు చేరితే దాంతో ఆస్టియోమైలిటిస్ అనే ఎముకల వ్యాధి, గుండెకు చేరితే పెరికార్డయిటిస్, మెనింజైటిస్, లివర్‌కు చేరితే హెపటైటిస్, ఊపిరితిత్తులకు చేరితే న్యుమోనియా, పేగులకు చేరితే ఇన్‌ఫెక్షన్లు వస్తాయట.
అయితే ఆ బాక్టీరియాలు నాడీ మండల వ్యవస్థపై కూడా ఒక్కోసారి ప్రభావం చూపుతాయట. అలా గనక జరిగితే మెదడు లేదా వెన్నెముకలలో ఇన్‌ఫెక్షన్ వస్తుందట. అది గులియన్ బార్ సిండ్రోమ్‌కు దారి తీసి అనంతరం కాళ్ల నుంచి మొదలై చేతుల వరకు పాకి చివరకు పక్షవాతం వస్తుందట. ఇదీ… ఉడకని చికెన్‌పై ఆ వైద్య బృందం చేసిన పరిశోధన. ఈ క్రమంలో అలాంటి చికెన్‌ను గనక తింటే ప్రతి 2వేల మందిలో ఒకరికి కచ్చితంగా పక్షవాతం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదే గనక జరిగితే మెదడుతో సహా ఇతర అవయవాలు చచ్చుబడిపోతాయని వారు హెచ్చరిస్తున్నారు. కనుక మీరు ఎప్పుడు చికెన్ తిన్నా అది సరిగ్గా ఉడికిందని నిర్దారణ అయితే తినండి. చికెన్ సరిగ్గా ఉడకాలంటే దాన్ని ఏ ఉష్ణోగ్రతకు వేడి చేయాలో తెలుసా. 165 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు. అంటే కనీసం 73 డిగ్రీల వరకు చికెన్‌కు వేడి తగిలేలా ఉడికించాలి. అప్పుడే అందులో ఉండే బాక్టీరియాలు పోతాయి.