Sinus Remedies: కాలంతో పాటు ఇబ్బంది పెట్టె సైనసైటిస్ సమస్యకు డాక్టర్ వద్దకు వెళ్లకుండానే ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో నయం చేసుకోవచ్చు, అవేంటో చూడండి.
Image used for representational purpose only | (Photo Credits: Pixabay)

సైనసైటిస్ ఇబ్బంది పెడుతుందా? ఈ సమస్యను అధిగమించడానికి ఎన్నో రకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, అప్పటికప్పుడు ఈ ఇబ్బంది నుంచి బయట పడాలంటే ఇంట్లోనే కొన్ని రకాల పదార్థాలతో దీని నుండి ఉపశమనం పొందవచ్చు.

కొంతమంది వాతావారణ పరిస్థితుల కారణంగా ఇన్ఫెక్షన్ కు గురైనపుడు ముక్కు లోపలి భాగం మ్యూకస్ తో నిండిపోయి లోపలి నుంచి ఒత్తిడి కలుగజేస్తుంది. దీనివల్ల ముక్కు భాగం ఉబ్బిపోవడం, చెంపలు, కళ్లపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. తద్వారా మొఖం అంతా నొప్పిగా అనిపిస్తుంది.

అయితే ముక్కులో నుంచి ఆ మ్యూకస్ ను తీసేసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి కొంత రిలీఫ్ లభిస్తుంది. మందులకు బదులు ఇంట్లో కూడా కొన్ని రకాల పద్ధతులు అనుసరించి ఈ సైనసైటిస్ నుంచి బయట పడవచ్చు. అవేంటంటే..

ముక్కులోకి సెలైన్ స్ప్రే చేయడం ద్వారా

ఒక పావు కప్పు శుద్ధమైన నీటిలో పావు చెంచాడు ఉప్పు మరియు పావు చెంచాడు బేకింగ్ సోడాతో కలిపి ఆ మిశ్రమాన్ని స్ప్రే లాగా వాడవచ్చు. రోజుకి రెండు లేదా మూడు సార్లు ముక్కు రంధ్రాల ద్వారా ఈ మిశ్రమం స్ప్రే చేయడం ద్వారా మీకు మార్పు కనిపిస్తుంది.

నేటి పాట్ ఉపయోగించడం

ఈ నేటి పాట్ అనేది మార్కెట్లో లభిస్తుంది. చూడటానికి ఒక వాటర్ మగ్ లాగా ఉండి పొడవాటి మూతి (పైప్) కలిగి ఉంటుంది. ఇలాంటి దానిలో శుద్ధమైన నీటిని తీసుకొని, తలను ఒకవైపు వంచి, నోటితో శ్వాస ఆడిస్తూ , నేటి పాట్ ద్వారా నీటిని ముక్కు ఒకవైపు రంధ్రంలోకి పంపించాలి, ఇలా రెండో వైపూ చేయాలి. ఇలా వరుసగా చేస్తుండటం వలన ముక్కు తెరుచుకుంటుంది.

ఆవిరి పట్టడం

చాలా మందికి ఆవిరిపట్టడం తెలిసే ఉంటుంది. జలుబు చేసినపుడు, గొంతు కూర్చున్నప్పుడు ఆవిరి పట్టుకుంటారు. ఒక పాత్రలో నీటిని వేడిచేసి దాని ఆవిరిని తీసుకుంటే చాలా రిలీఫ్ అనిపిస్తుంది.

వేడితో కాపడం

ఒక శుభ్రమైన బట్టను తీసుకొని దానిని వేడిచేసి, ఆ వేడిని ముక్కు, చెంపలపై కొన్ని నిమిషాలు ఉంచడం లాంటిది కూడా ప్రయత్నించండి. ఈ పద్ధతి కూడా మంచి ఫలితాన్నిస్తుంది.

హైడ్రేషన్

నీరు, పండ్ల రసాలు, హెర్బల్ టీలు, కొంచెం స్పైసీగా ఉండే పానీయాలు ఎక్కువగా తాగాలి. శరీరంలో ఎంత నీటి నిల్వ ఉంటే సైనసైటిస్ సమస్య అంత దూరంగా ఉంటుంది. అయితే మామూలు టీ- కాఫీలకు దూరంగా ఉండటం మంచిది.

కొన్ని రకాల నూనెలు వాడటం

పుదీన, యూకలిప్టస్ గుణాలు కలిగిన నూనె లాంటి ద్రావణాలను పీల్చటం, లేదా వేడి నీటిలో వీటిని కలిపి ఆవిరి పట్టడం చేస్తే సైనసిటిస్ నుంచి రిలీఫ్ లభిస్తుంది.

విశ్రాంతి

శరీరానికి తగినంత విశ్రాంతి ఇస్తే, ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా, తొందరగా నయమవుతుంది. కాబట్టి సైనసైటిస్ సమస్యతో బాధపడేవారు తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

సైనసిటిస్ సమస్య 2 లేదా 3 వారాలో నయమయిపోతుంది. ఒకవేళ వారాల కొద్దీ ఈ సమస్య ఇలాగే వేధిస్తుంటే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించి మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది.