Back Pain Remedies: వెన్నునొప్పితో కదలలేక పోతున్నారా? వెన్నునొప్పి బాధ నుంచి సత్వర ఉపశమనం పొందేందుకు ఈ సులభమైన నొప్పి నివారణ మార్గాల గురించి తెలుసుకోండి.
Image used for representational purpose only | (Photo Credits: Pixabay)

వెన్నునొప్పి (Back Pain) అనేది ఈ మధ్య అందరికీ సర్వసాధారణమైపోయింది. ఈ వెన్నునొప్పి కారణంగా ఇటు వ్యక్తిగతంగా, అటు వృత్తిపరంగా పనులు చేసుకోలేక ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. చాలామందికి నడుము కింది భాగంలో ఈ వెన్నునొప్పి సమస్యకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 80%కి పైగా పెద్దవారిలో నడవలేకపోవడానికి కారణం కూడా ఇదే అవుతుంది. నడుముకు సంబంధించిన మిగతా భాగాల్లో కూడా ఎప్పుడో ఒకసారి ఈ వెన్నునొప్పి బాధను అనుభవించేవారూ ఎక్కువే. ఒక వ్యక్తి శరీర బరువు మోయడం అంతా ఈ వెన్ను భాగంలోనే కేంద్రీకృతం అయి ఉంటుంది. కూర్చోవాలన్నా, లేవాలన్నా, నడవాలన్నా ఏ పనిచేయాలన్నా వెన్ను భాగమే ఆధారం. కాబట్టి ఈ వెన్నునొప్పి సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు.

వెన్నునొప్పి బాధిస్తే దానికి కౌంటర్ గా అసిటామినోఫెన్ (Acetaminophen), ఐబూప్రొఫెన్ (Ibuprofen) లాంటి పెయిన్ కిల్లర్స్  (Pain Killers) తీసుకోవచ్చు. అలాకాకుండా కొన్ని సత్వర నొప్పి నివారణ పద్ధతులను అనుసరించి కూడా ఇంట్లో నుంచే మీకు మీరుగా ఈ బాధ నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు.

వార్మప్ (Warm ups) లేదా చిన్నపాటి వ్యాయామాలు:

వెన్నునొప్పి బాధిస్తున్నపుడు లేవడమే కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కొంత ఓపిక తెచ్చుకుని కొద్దిదూరం నడక, స్విమ్మింగ్ లేదా యోగా చేయడం. ఇలా కొంత వార్మప్ చేసే శరీరంలోని కండరాలు వదులుగా మారి వాటి నుండి 'ఎండోఫ్రిన్స్' అనే హర్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్స్ నేచురల్ పెయిన్ కిల్లర్స్ గా చెప్పబడతాయి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి వెన్నునొప్పులు రావు.

వేడి, చల్లదనంతో కాపడం..

వేడి, లేదా చల్లదనంతో శరీరాన్ని కాపడం ద్వారా ఏ నొప్పి నుంచైనా ఉపశమనం పొందవచ్చు. అది అందరి ఇండ్లలో సాధారణంగా అనుసరించేదే. మంచుముక్కలు ఉన్న ప్యాకెట్ ను నొప్పి భాదించే చోట కొద్దిసేపు అదిమి పట్టి ఉంచితే అది ఆ ప్రాంతమంతా మొద్దుబారినట్లు చేస్తుంది. ఆ రకంగా నొప్పి నుంచి బయటపడవచ్చు. అయితే 20 నిమిషాలకు మించి ఎక్కువసేపు ఇలా చేయకూడదు.

అదేరకంగా ఒక వాటర్ బాటిల్ ను వేడినీటితో నింపి లేదా ఒక పొడిగుడ్డను వేడిని తగిలించి నొప్పిబాధించే చోట ఉంచితే రిలీఫ్ పొందవచ్చు. ఇక్కడ వేడి మరీ ఎక్కువ ఉండకుండా జాగ్రత్తపడాలి.

నడుము విరుచుట లేదా చాచుట..

ఒక 30 సెకన్ల పాటు నడుమును అన్ని వైపులా వంచి ఉంచడం ద్వారా ఫలితం లభిస్తుంది.

కాళ్ళ మీద నిటారుగా నిలబడి నడుమును ముందుకు వంచుతూ పాదాలను తాడం, కడుపు భాగం నేలవైపు ఉండేలా బోర్లా పడుకొని, భుజాల సపోర్ట్ మీద నిలబడి తలని పైకి లేపుతూ నడుమును విరచడం ఇలా నడుముపై ప్రభావం పడేలా కొంచెం స్ట్రెచ్ చేస్తే చాలు.

పెయిన్ రిలీఫ్ క్రీమ్స్..

పుదీనా లేదా మిరియాల గుణాలున్న పెయిన్ రిలీఫ్ క్రీములు వాడితే నొప్పి నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది.

అలాగే కూర్చున్న చోటనే గంటల తరబడి ఒకేలా కూర్చోకుండా స్థానమార్పిడి లేదా కూర్చునే భంగిమ మార్చుకోవడం చేయడం ద్వారా కూడా ఈ వెన్నునొప్పిని నివారించవచ్చు. అన్నింటికి మించి శరీరానికి తగినంత విశ్రాంతి, కనీసం 8-9 గంటల నిద్ర అందివ్వడం ద్వారా తొందరగా ఈ నొప్పుల నుంచి బయటపడవచ్చు.