క్యాప్సికమ్‌లో విటమిన్ ‘ఎ,సి’ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పచ్చిమిర్చిలా ఘాటుగా కాకుండా, తక్కువ కారంతో రుచిగా ఉంటాయి. వీటిని డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి .
కళ్లు, చర్మం: క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి అత్యవసరం. క్యాప్సికమ్‌లోని ల్యూటిన్ అనే కెరోటెనాయిడ్ కంటిచూపు మందగించకుండా చూస్తుంది. క్యాప్సికమ్‌లో సీ విటమిన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్త నాళాలు, చర్మం, ఎముకల దృఢత్వానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిలో తోడ్పడుతుంది.
బరువు తగ్గడంలో: క్యాప్సికమ్‌లోని క్యాప్‌సైనిన్ అనే ఆల్కలాయిడ్ జీవక్రియను ప్రేరేపిస్తుంది. ఇది కొవ్వు కణాల వృద్ధిని అరికడుతుంది. శరీరంలో ఎక్కువ క్యాలరీలు కరిగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి క్యాప్సికమ్ మంచి డైట్.
క్యాన్సర్ నివారిణి: ఆకుపచ్చ, పసుపు క్యాప్సికమ్‌లో కన్నా ఎరుపు క్యాప్సికమ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, వాపు తగ్గించే గుణాలు ఎక్కువ. ఇవి ప్రొస్టేట్, గర్భాశయ, బ్లాడర్, క్లోమ గ్రంథి క్యాన్సర్‌ను నివారిస్తాయి. క్యాప్సికమ్‌లోని ఫినోలిక్స్, ప్లేవోనాయిడ్స్ శరీరంలో ఎలర్జీని తగ్గిస్తాయి.
గుండె పదిలంగా: ఎరుపు రంగు క్యాప్సికమ్‌లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకుపచ్చ క్యాప్సికమ్‌లో కొవ్వును తగ్గించే ఫైబర్ ఉంటుంది. వీటిలోని విటమిన్ బి6, ఫోలిక్ ఆమ్లాలు గుండె సంబంధ వ్యాధులకు కారణమయ్యే హోమోసిస్టిన్ అమినో ఆమ్లం ఉత్పత్తిని నియంత్రిస్తుంది.
కురుల ఆరోగ్యానికి: క్యాప్సికమ్ జుట్టును బలంగా చేస్తుంది. తలకు రక్తప్రసరణ పెరిగి వెంట్రుకలు పెరగడంలో సాయపడుతుంది. ఎండిన క్యాప్సికమ్‌ను నీళ్లలో వేసి 4-5నిమిషాలు వేడిచేయాలి. చల్లారాక తలకు పట్టించి 12-15 నిమిషాల పాటు ఉండనివ్వాలి. తర్వాత తలను నీళ్లతో శుభ్రం చేస్తే జుట్టు మెరుస్తుంది.