Being Single: నాకెవ్వరు అవసరం లేదు, నా బతుకేదో నేను బతుకుతా, తింటా- పంటా, జీవితాంతం సింగిల్ గానే ఉంటా అని మీకెప్పుడైనా అనిపించిందా?
representational image | photo credits: Pixabay

జీవితంలో మనం అనుకున్నవి అన్నీ జరిగి జీవితం సాఫీగా సాగిపోతుందంటే మనం సంతోషంగా ఉంటాం. అదే అందుకు విరుద్ధంగా జరిగితే? అంటే జరగాల్సింది జరగకపోతే, అనుకున్న లక్ష్యాలు నెరవేరకపోతే జీవితంలో అనుకున్నదేది సాధించలేకుండా ఈ జీవితం ఇక వ్యర్థం అనుకున్న స్థితిలో బాధ అలుముకుంటుంది.

అయితే కొన్నిసార్లు ఈ రెండు సందర్భాల్లో కూడా అటూ సంతోషమూ, ఇటూ బాధ రెండూ అనిపించవు. ఈ రెండికి మధ్యలో తటస్థ స్థితిలో (Neither Happy nor Sad) ఉన్నట్లు అనిపిస్తుంది. మరి ఎందుకిలా? ఈ పరిస్థితికి కారణం ఏంటి?

కావాల్సినవి అన్ని ఉన్నాయి కానీ సంతోషంగా లేము, మరోవైపు జీవితంలో చెప్పుకోడానికి పెద్దగా ఏమి లేవు అయినా బాధలేదు. ఈ సమస్యకు కారణం 'ఒంటరితనం' (Loneliness) అని ఒక రీసెర్చిలో వెల్లడైంది.

బాధైనా, సంతోషమైనా పంచుకోవటానికి మనకంటూ ఓ ఆత్మబంధువు, ఓ చిరకాల మిత్రుడు లేనప్పుడు. ఒక మనిషిని తననితాను ఈ లోకం నుంచి విడిపోయేలా చేస్తుంది. ఇకపై ఏం చేసినా అన్నీ తానే, అన్నింటికీ తానే 'ఏక్ నిరంజన్' అనేలా ఆలోచనలు చుట్టుముడతాయి. ఆ ఆలోచనలు మనిషిని నలుగురిలో కలుపుగోలుగా ఉండనివ్వదు, అందరికీ దూరంగా ఒంటరిగా బ్రతకాలనిపించేలా, తనలో తానే మాట్లాడుకునేలా చేస్తాయి. తన మిత్రుడు- శత్రువు ఇద్దరూ తనే అనిపిస్తుంది.

సమాజానికి ఆ మనిషి అందరిలానే కనిపిస్తాడు. అందరితో కలిసినట్లే ఉంటాడు, కానీ తన చుట్టూ ఎంతమంది జనం మధ్య ఉన్నా అతడు ఒంటరి వాడు. అతడి ప్రపంచం అతడిదే. ఒక్కడే తింటాడు, ఒక్కడే స్వతంత్రంగా అన్ని పనులు చేసుకుంటాడు. ఇలా ఉండటాన్ని  గ్లోబల్ గా హాన్ జాక్ లైఫ్ (Honjok) అంటారు.

మనిషి  'సామాజిక ఏకాంతానికి'  కారణాలు ఇవై ఉండొచ్చు

 

పరిస్థితులు: 

తమ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి నుంచి విడిపోతే లేదా వారు భౌతికంగా దూరమైతే అదీకాకుండా జీవితంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి దొరకని సందర్భంలో. ఆ బాధ ఒంటరితనానికి దారితీస్తుంది. అయితే కాలంలో పాటు కొందరిలో మంచి మార్పు కనిపిస్తుంది కానీ కొందరిలో అలాగే ఉండిపోతుంది. ముఖ్యంగా తమకు కావాల్సిన వ్యక్తి నుండి విడిపోయినపుడు. ( డివోర్స్ లేదా బ్రేకప్ అయినపుడు).

ఎప్పటికీ విడిపోలేము అనుకున్న వ్యక్తి నుంచి విడిపోయినపుడు కొంత షాక్ అనేది ఉంటుంది. అయితే ఆ షాక్ నుంచి కోలుకోడానికి టైం పడుతుంది, ఇతరుల సాహచర్యంతో బయటపడవచ్చు.

అయితే ఇక్కడ ఇతరులు కూడా ఎవరు పట్టించుకోని సమయంలో. ఎంతో కాలం వేచిచూసినా, మరెంతో కాలం గడిచిపోయినా తమ జీవితంలో మరో వ్యక్తికి వస్తారనే నమ్మకంలేని సమయంలో మనిషి ఆలోచనలు ఇక నువ్వు ఒంటరివే, నీకోసం ఎవరూ లేరు. అలాంటపుడు బాధపడి అనవసరం అన్నట్లుగా వస్తాయి.

పంతం, వ్యక్తిత్వం

ఆత్మగౌరవం లేదా పంతాన్ని ఎక్కువగా ప్రదర్శించేవారు ఒంటరిగానే ఉండిపోతారు. గతంలో ఏదైనా అవమానం జరిగితే, బాధ కలిగితే అది వారి మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. వారికి అందరితో కలవాలని మనస్సులో ఉన్నప్పటికీ వారి వ్యక్తిత్వం కానీ, పంతం కానీ వారితో మళ్ళీ కలవనివ్వవు. అలాగే మనుషుల మీద కూడా నమ్మకం కోల్పోయి, వేరే వారితో మళ్ళీ ఇలాంటి అనుభవమే ఎదురవొచ్చనే భయంతో ఇతరులు తమతో కలిసేందుకు ఆస్కారం ఇవ్వరు.

చుట్టూ ఉండే వాతావరణం

మీరు ఎంత యాక్టివ్ అయినా మీ చుట్టూ ఉండే వాతావరణం అందుకు తగినట్లుగా లేకపోతే, మీకు-మీరే.. మాకు మేమే అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినపుడు, విదేశాలకు వెళ్లినపుడు లేదా బాషా- సంస్కృతులు వేరుగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఒంటరితనం ఆవశ్యకమవుతుంది. అది అలాగే కొనసాగితే ఒక స్టేజ్ కి వచ్చాక ఇంకా బాధ - సంతోషం ఏముంటాయి?

వారసత్వం

కొంతమందికి వారి వారసత్వం కారణంగా కూడా వారిని ఒంటరిగా ఉండేలా చేస్తుంది. వారు స్వభావరీత్యా అలాగే ఉంటారు. తమకు ఎవరితో అవసరం లేదు, తాము ఎవరితో సంబంధం పెట్టుకోము అనేది వారి భావన.

సంతోషం, బాధ లేకపోవడం అనే ఈ స్థితి మంచిదా? కాదా?

పైన చెప్పిన పరిస్థితులు ఉంటే ఒక పీక్ స్టేజ్ లో మనిషికి అన్నీ ఉన్నా అటూ సంతోషంగాని, బాధగానీ ఉండవు. ఎందుకంటే తాను అనుభవించాల్సిన బాధ, సంతోషం అంతా గతంలో అనుభవించేసి ఉంటాడు కాబట్టి. తర్వాత ఎన్ని బాధలు, సంతోషాలు వచ్చినా తనకు కొత్తగా ఏం అనిపించదు. దీంతో అటూ సంతోషంగా ఉండడు, అలా అని బాధలో ఉండడు. అంతా శూన్యం. కాలంతో పాటు ఫ్లోలో మెల్లగా ఎలాగో అలా బ్రతికేస్తూ ఉంటారు.

పైన చెప్పినట్లుగా ఈ పరిస్థితికి కారణం ఒంటరితనం - మనిషి నలుగురితో మనస్పూర్తిగా కలిసి ఉంటే ఈ పరిస్థితి వచ్చే అవకాశమే ఉండదు.

ఒంటరితనం అనేది అందరిలో చాలా సాధారణ విషయం. ఒంటరితనం కొంతవరకు మంచిదే, కానీ అది తాత్కాలికమై ఉండాలి. ఆ ఒంటరితనం దీర్ఘకాలం అయితే ఖచ్చితంగా అది మానసికంగా, శారీరకంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. బ్రతికి ఉన్న మనిషి అంటే భావోద్వేగాలకు ఖచ్చితంగా స్పందిస్తూ ఉండాలి. అది బాధ అయినా, సంతోషమైనా వ్యక్తం చేయాలి. అది ఆరోగ్యకరమైన అలవాటు కూడా. ఎలాంటి స్పందనలు లేవు అంటే మనిషి బ్రతికి ఉన్న శవమే.

దీనిని అధిగమించడం ఎలా?

సులభంగానే ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. దీనికి చేయాల్సింది మానవ ప్రయత్నమే. మీరు ఈ తటస్థ స్థితిలో గనుక ఉంటే మిమ్మల్ని మీరు క్షమించేసుకోండి, మీకు మీరుగా విధించుకున్న ఆంక్షల నుండి బయటకు రండి. జీవితంలో దెబ్బతిన్నారా? మళ్ళీ ప్రయత్నించండి, దాని ఫలితం ఎలాగైనా ఉండనీ, పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉండనీ మీ ప్రయత్నం మాత్రం ఆగకూడదు. ప్రయత్నమే విజయం.

కొత్తగా పరిచయాలు చేసుకోవాలి, చేస్తూనే పోవాలి దానికి మొదటి అడుగు మీ నుంచే పడాలి. చిన్నచిన్న విజయాలను సెలబ్రెట్ చేసుకుంటూ పోండి. ఉన్నది ఒక్కటే జీవితం, యే జిందగీ నా మిలేగీ దోబారా.. లివ్ యువర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్!