Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

న్యూఢిల్లీ, జనవరి 3: దేశవ్యాప్తంగా 15 నుంచి18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు నేటి నుంచి టీకా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం కొవిన్‌ పోర్టల్‌లో ప్రత్యేక స్లాట్‌ అందుబాటులోకి వచ్చింది. దీంతో కొవిన్‌ పోర్టల్‌లో టీకా కోసం పిల్లలు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. అలాగే వ్యాక్సిన్‌ కేంద్రాల్లో కూడా రిజిస్ట్రేషన్‌ జరుగుతోంది. పిల్లలకు కేవలం కొవాగ్జిన్‌ టీకా వేయనున్నట్టు కేంద్రప్రభుత్వం ఇప్పటికే రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం ఇచ్చింది. ఇందుకోసం కొవాగ్జిన్‌ అదనపు డోసులను సరఫరా చేయనుంది.

పిల్లలకు టీకాపై ప్రధాని మోదీ డిసెంబర్‌ 25న ప్రకటన చేశారు. 2007లో పుట్టినవారితో పాటు, అంతకుముందు జన్మించిన వారు టీకా వేసుకోవడానికి అర్హులు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం.. పిల్లలు టీకా వేసుకొన్న తర్వాత అరగంట సేపు వ్యాక్సిన్‌ కేంద్రాల్లోనే ఉండాలి. వారిలో ఏవైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తున్నాయా అన్నది వైద్యులు పరిశీలించి పంపిస్తారు.

రెండో డోసును 28 రోజుల తర్వాత వేస్తారు. పిల్లలకు టీకా నిర్ణయాన్ని తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు ఈ నెల 10 నుంచి మూడో డోసు వేయనున్నారు.