కొత్త ఏడాదిలో గుడ్ మార్నింగ్, గుడ్ నూన్, గుడ్ ఈవినింగ్! అంటే రాత్రి పార్టీలో బాగా శ్రమదానం చేసి, అలసిపోయి జనవరి 1న ఎవరు ఎప్పుడు లేస్తారో, అసలు ఈరోజు లేస్తారో తెలీదు కాబట్టి మీరు లేచే సమయాన్ని బట్టి ఈ విషెస్. సరే రాత్రి పార్టీలో ఎంత ఎంజాయ్ మెంట్ ఉన్నా, పొద్దున్నే పార్టీలో అది రివర్స్ అవుతుంది. నిన్న రాత్రి లోపలికి వెళ్లిందంతా బయటకు వచ్చేస్తుంది. నిన్నటి డిజే మ్యూజిక్ అంతా మైండ్ లో రివర్స్ లో ప్లే అవుతున్నట్లు అనిపిస్తుంది. దీనినే హాంగోవర్ (Hangover) అని కూడా అంటారు.
వికారం, తలనొప్పి, సుస్తి, తీవ్రమైన దాహం, లైటింగ్ మరియు సౌండ్ కి సున్నితత్వం ప్రదర్శించడం లక్షణాలు కనిపిస్తాయి. ఇవేకాకుండా, ఇక నుంచి ఎప్పుడు తాగొద్దు అనిపిస్తుంది. మీపై మీకే అసహ్యం కలుగుతుంది, నేను తాగడం మానేశాను అని అందరికీ చెప్పాలని అనిపిస్తుంది. ఇవన్నీ భయంకరమైన హాంగోవర్ లక్షణాలు.
కాళరాత్రే కాదు, న్యూ ఇయర్ ఉదయం (New Year Morning) అంతకంటే భయంకరంగా ఉంటుంది. కానీ, న్యూయర్ ఫస్ట్ డే కూడా డల్‌గా ఉండటం ఏంటి? అందుకే మిమ్మల్ని హాంగోవర్ నుంచి బయటపడే కొన్ని హోం రెమెడీస్ (Home Remedies) ఇక్కడ అందిస్తున్నాం. వాటిని పాటిస్తే, కొంతవరకు రిలీఫ్ లభిస్తుంది.
అల్లం ఛాయ్
అల్లం వికారం నిరోధిక ఔషధంగా పనిచేస్తుంది. హాంగోవర్ అనిపిస్తుంటే ఒక కప్పు వేడివేడి అల్లం ఛాయ్ తాగేస్తే అది మీ కడుపును శాంతపరిచి మిమ్మల్ని కొంత కుదురుకునేలా చేస్తుంది. ఒకవేళ మీకు టీ తాగే అలవాటు లేకపోతే రెండు చెంచాల అల్లం పొడి, లేదా అల్లం చూర్ణం తీసుకొని, సగం నిమ్మకాయ మరియు రెండు టీస్పూన్ల తేనేను రెండు కప్పుల నీటిలో వేసి 5 నిమిషాల పాటు వేడి చేయాలి, ఆ తర్వాత మిశ్రమాన్ని తాగినా సరిపోతుంది.
సమతుల్యమైన అల్పాహారం
హాంగోవర్ కారణంగా ఆకలిగా అనిపించదు లేదా తింటే కూడా నోటికి రుచి తగలదు. అయితే హాంగోవర్ ఉన్నప్పుడు ఉదయం అల్పాహారం మానొద్దు. అల్కాహాల్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. కాబట్టి దానిని సమతుల్యం చేయడానికి అల్పాహారం ఖచ్చితంగా తీసుకోవాలి.
ఇడ్లీ లాంటి ఏదైనా లైట్ ఫుడ్ లేదా చీజ్ ఆనియన్ ఆమ్లెట్, ఆమ్లెట్ టోస్ట్ లాంటి అల్పాహారం తీసుకుంటే ప్రభావం కనిపిస్తుంది.
ప్రిక్లీ పియర్ లేదా అరటిపండు
మీ దగ్గర్లోని సూపర్ మార్కెట్లో పియర్ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే తీసుకోండి, లేనిపక్షంలో అరటి పండ్లు కూడా హంగోవర్ కి బాగా పనిచేస్తాయి. అరటిపండ్లు మీ శరీరంలో పొటాషియం, విటమిన్-బి లను అందిస్తాయి. అవి శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపిస్తాయి. కర్బూజ పండ్లు మీ శరీరానికి హైడ్రేషన్ అందిస్తుంది. కాబట్టి అవి కూడా తీసుకోవాలి
నీరు
ఇక మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. హాంగోవర్ కారణంగా మీకు దాహం ఎక్కువగా వేస్తుంది. ఎందుకంటే అల్కాహాల్ ద్వారా శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. కాబట్టి దాని నుంచి బయటపడాలంటే సమృద్ధిగా నీరు తాగాలి, పండ్ల రసాలు తీసుకోవాలి. తలనొప్పి, అలసట నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.
నిద్ర
నిద్ర సర్వరోగ నివారిణి. సరైన నిద్ర ఉంటే ఎలాంటి అనారోగ్యమైనా త్వరగా నయమవుతుంది. మీకు ఆఫీస్ ఉన్నా, పని ఒత్తిడి ఉన్నా, హాంగోవర్ నుంచి బయటపడేందుకు వీలు చిక్కితే మంచి నిద్ర తీసుకోండి. లేకపోతే హాంగోవర్ ఎంతకీ తగ్గదు.
హాంగోవర్ కోసం పూర్తి “నివారణ” వంటివి ఏవీ లేనప్పటికీ, కొంతవరకు రిలీఫ్ ను అందివ్వడానికి ఈ టిప్స్ మీకు కొంతవరకు ప్రయోజనాలు కలిగిస్తాయి. మెడిసిన్ ద్వారా హాంగోవర్ లక్షణాలు కొంతవరకు తగ్గించుకోవచ్చు కానీ వాటితో సైడ్ ఎఫెక్ట్స్, ఇతరత్రా సమస్యలు తెచ్చుకునే బదులు ఈ హోం రెమిడీస్ అందించాం, వీటిని ప్రయత్నించి మళ్ళీ ఆరోగ్యంగా అవ్వండి.
మరోసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.