మీరు పనిచేస్తున్నపుడు కానీ, లేదా డ్రైవింగ్ చేస్తున్నపుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు గానీ సడెన్‌గా ఏదో జర్క్ లాగా ఒకవైపు కన్ను అదరడం ఎప్పుడైనా మీరు గమనించారా? ఇలా అదరడం కొద్ది సేపట్లో ఆగిపోవచ్చు లేదా రెండు మూడు రోజుల వరకు కొనసాగొచ్చు.
చాలా మంది విశ్వసించేదేంటంటే ఈ కన్ను అదరడం (eye twitching) ఏదైనా భవిష్యత్ సంకేతాన్ని తెలియజేస్తుంది అని. మగ వారికి ఎడమ కన్ను అదిరితే ఏదో కీడు జరగబోతుందని అలాగే కుడి కన్ను అదిరితే శుభసూచకం, శుభ వార్తలు వింటారు అని చెప్తారు. వామ్మో ఈరోజు నా ఎడమ కన్ను ఏంటి ఇలా కొట్టుకుంటుంది. ఈరోజు ఏమన్నా మూడిందా? ఏం ఆపద వస్తుందో ఏమో అనుకుంటూ భయపడేవాళ్లు చాలా మందే ఉంటారు. ఆడవారికైతే ఇది రివర్స్‌గా ఉంటుంది. ఎడమ కన్ను కొట్టుకుంటుందంటే ఏదో మంచి జరుగుతుందని నమ్ముతారు. మరి ఇందులో నిజమెంత అంటే ఇవి కేవలం వారి విశ్వాసాలు, నమ్మకాలు మాత్రమే, దీనికి ఇంతవరకూ ఎలాంటి బలమైన, ఖచ్చితమైన నిరూపణ అయితే జరగలేదు.
ఇక సైన్స్ పరంగా చెప్పాలంటే ఇదొక వ్యాధి అని చెప్పటానికి వీలు లేదు కానీ, కంటికి సంబంధించిన నాడీ వ్యవస్థలో ఏదైనా లోపం తలిత్తితే ఈ కన్ను అదరడం అనేది జరుగుతుంది. కెఫీన్ లేదా అల్కాహాల్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, నిద్రలేమి మరియు ఏదైనా విషయం గురించి ఒత్తిడికి లోనవుతున్నప్పుడు, కంటికి సరైన కునుకు లేనప్పుడు అది నేరుగా కంటికి సంబంధించిన నాడీవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దానివల్ల కనురెప్పలో గానీ, కంటికింద గానీ, లేదా కంటిబొమ్మల దగ్గర ఉండే నాడుల్లో చిన్న కదలికలు రావడం జరుగుతుంది. ఆ కదలికల వలనే మనకు కన్ను అదిరినట్లు అనిపిస్తుంది.
ఈ కన్ను అదరడానికి గల కారణాలు పరిశీలిస్తే..
కాఫీ- టీలు ఎక్కువగా తాగటం: మీకు ఈ కన్ను అదిరితే ఒకటి గమనించండి. మీరు ఆరోజు లేదా అంతకు ముందు కెఫీన్ సంబంధిత పదార్థాలు ఎక్కువగా తీసుకొని ఉంటారు. మీకు తెలిసో, తెలియకుండానో కాఫీలు లేదా టీలు ఎక్కువగా తాగిస్తే దానిలోని కెఫీన్ నేరుగా నాడీవ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. తద్వార కంటికి సంబంధించిన ఈ కదలికలు వస్తాయి. ఈ కాఫీ- టీలు తగ్గిస్తే, ఈ అదరడాన్ని తగ్గించవచ్చు.
కళ్లపై భారం మోపడం: రోజంతా కంప్యూటర్ ముందు పనిచేస్తే, తదేకంగా కంప్యూటర్ స్క్రీన్ చూడటం లేదా మొబైల్ చూస్తూ ఉండటం, వీడియో గేమ్స్ ఆడటం ద్వారా కళ్లపై చాలా భారం పడుతుంది. దీనివల్ల కళ్లు సంకోచానికి గురవుతాయి. ఇది కేవలం కన్ను అదరటమే కాకుండా, కళ్లు మిటకరించటం, రెటినా దెబ్బతినటం లాంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది.
ఒకవేళ మీరు రోజంతా కంప్యూటర్ ముందే కూర్చుని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటే మధ్యమధ్యలో స్వల్ప విరామాలు తీసుకుంటూ ఉండండి, ఉన్నచోటనే అప్పుడప్పుడూ 3 నుంచి 5 నిమిషాలు కళ్లు మూసుకొని కళ్లకు కొంత విశ్రాంతినిస్తూ పోయినా ఈ సమస్యలను అధిగమించవచ్చు.
నిద్రలేమి, అలసట: మీకు ఏవైనా వ్యక్తిగత లేదా వృత్తి సంబంధమైన కారణాల ద్వారా నిద్రలేమి, అలసట లాంటి సమస్యలు ఎదుర్కొంటుంటే కన్ను అదరడం జరుగుతుంది. కంటికి సరైన నిద్ర, విశ్రాంతి చాలా అవసరం అదే మిమ్మల్ని ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. నిద్రలేమితో బాధపడేవారు సమయం దొరికినప్పుడల్లా చిన్నపాటి కునుకు తీస్తే సమస్యను దూరం చేసుకోవచ్చు.
అలెర్జీలు: శరీరంలో కొన్ని రకాల అలెర్జీలు ముఖ్యంగా డస్ట్ ఎలర్జీ ఉన్నవారికి, మరియు దగ్గు, పడిశంతో జ్వరం ఉన్నవారికి కూడా కళ్ల సంకోచాన్ని గుర్తించవచ్చు.
ఈ కంటి సంకోచాలకు సంబంధించి ఎలాంటి మెడిసిన్ అవసరం లేకపోయినా ఇది శరీరంలో మెదడు- నాడీవ్యవస్థకు తలెత్తిన లోపాలను సూచిస్తుంది, వాటిని ఎప్పటికప్పుడు సవరించుకోవడం మంచిది. అలాగే కొన్నిసార్లు రెండు కళ్లలో ఈ కదలికలు లేదా శరీరంలో ఏదైనా భాగంలోని కండరాలలో ఈ జర్క్ లు లేదా సంకోచాలు గమనిస్తే అవి టోరెట్ సిండ్రోమ్ మరియు బెల్స్ పల్సీ లాంటి రుగ్మతలను తెలియజేస్తుంది. డాక్టర్స్ ను సంప్రదించి సరైన హెల్త్ కేర్ తీసుకోవడం మంచిది.