Suma Kanakala (Photo-Video Grab)

Hyderabad, AUG 08: కేవలం సుమ కనకాల యాంకరింగ్‌ కోసమే.. ఆమె డేట్ కుదరటం కోసమే ప్రిరీలీజ్‌ ఫంక్షన్‌లు కూడా వాయిదా వేస్తారంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే సుమకు వున్న పాపులారిటీని బేస్‌ చేసుకుని పలు వాణిజ్య ప్రకటనల్లో నటించే అవకాశాలు కూడా ఆమెను వరించాయి. ఇప్పటికే ఆమె ఎన్నో యాడ్స్‌లో నటించారు. అయితే తాజాగా ఆమె నటించిన ఓ వాణిజ్య ప్రకటనే ఆమెను చిక్కుల్లో పడేసింది. ఇటీవల ఆమె నటించిన ఓ రియల్‌ఎస్టేట్‌ యాడ్‌ చూసి అందులో పెట్టుబడులు పెట్టి నష్టపోయామని బాధితులు ఆందోళన చేపట్టారు. ఆమెను యాడ్‌లో చూస్తే ఆ సంస్థలో ఫ్లాట్స్‌ కొన్నామని సదరు బాధితులు ఆరోపిస్తున్నారు. అంతే కాదు సదరు రియల్‌ఎస్టేట్‌ సంస్థ బోర్డ్‌ తిప్పేయడంతో బాధితులు సుమకు లీగల్‌ నోటిసులు పంపారు. ఈ వివాదంపై సుమ కనకాల తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

 

నేను 2016 నుండి 2018 వరకే అగ్రిమెంట్‌ చేసుకున్న యాడ్‌ను (Real Estate Fraud) ఇప్పుడు వైరల్‌ చేసి నాకు నష్టం కలిగిస్తున్నారు. గడువు పూర్తయిన తరువాత కూడా నా పర్మిషన్‌ లేకుండా నా యాడ్‌ను సోషల్‌మీడియాలో పెడుతున్నారు. అందుకే ఆ సంస్థకు లీగల్‌ నోటిసులు కూడా పంపాను. అంతేకాదు ప్రజలు కూడా అధికారిక న్యూస్‌ ఛానెల్స్‌లో ప్రసారమయ్యే యాడ్స్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఎప్పుడూ నాకు ప్రేమను పంచే అందరికి థ్యాంక్స్‌ అంటూ తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన రాకీ అవెన్యూస్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో తమ కలలను సాకారం చేసుకోవడానికి సొంత ఇంటికోసం ప్రజలు దాదాపుగా 88 కోట్లు చెల్లించారు. కానీ సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ సంస్థ వాణిజ్య ప్రకటనలో సుమ నటించారు. అంతేకాదు సుమ భర్త రాజీవ్‌ కనకాల కూడా ఈ సంస్థకు అధికారిక ప్రచారకర్త (బ్రాండ్‌ అంబాసిడర్‌) గా వ్యవహరించారట.