Hyd, Feb 23: తెలంగాణలో మరో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana: CM KCR) బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఇది ఒక మల్లన్న సాగర్ కాదు.. తెలంగాణ జల హృదయం సాగరం.. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడం చాలా ఆనందం, సంతోషంగా ఉంది. మనం కలలు కన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు సస్యశ్యామల తెలంగాణను చూస్తున్నాం. నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డ అతి భారీ జలాశయం మల్లన్న సాగర్‌ను (Mallanna Sagar reservoir) ప్రారంభించుకోవడం హర్షించుకోదగ్గ ఘట్టం. ఈ మహాయజ్ఞంలో ప్రతి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని సీఎం తెలిపారు.
గోదావరి నీళ్లు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలను కడుగుతామని చెప్పాం. గోదావరి జలాలతో అభిషేకం చేయబోతున్నాం. ఎంతో మనసు పెట్టి ముందుకు పోయాం. హరీశ్‌రావు సేవలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయి. అవినీతిరహితంగా పని చేశాం. సిద్దిపేటకే కాకుండా హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు ఇది. 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకుని కాపాడుకునే ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు అని కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుతో 11.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఒక్క రోజు నిరసన చేపట్టిన టీఆర్ఎస్ నేతలు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్.. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. గోదావరి జలాలను ఎత్తిపోసి 10 జిల్లాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు. అనేక వివాదాల నడుమ ఈ ప్రాజెక్టు నిర్మాణం (KCR inaugurate Mallanna Sagar) పూర్తయింది. దేశంలోనే తొలిసారి నదిలేని చోట ప్రాజెక్టు నిర్మాణం చేసింది ఇక్కడే. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా పది జిల్లాలకు తాగు, సాగు నీరు అందించనున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలో 2018లో రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–4లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును తొలుత టీఎంసీ నీటి సామర్థ్యంతో నిర్మించాలనుకున్నా రీ డిజైన్ చేసి 50 టీఎంసీలకు పెంచారు. రూ.6,805 కోట్ల బడ్జెట్‌తో మూడున్నర ఏళ్లలోనే పూర్తి చేశారు. ప్రాజెక్టు కోసం 17,781 ఎకరాల భూమిని సేకరించారు. 8 పంచాయతీలతోపాటు మొత్తం 14 నివాస ప్రాంతాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి.
10.5 కిలోమీటర్ల పొడవున్న గుట్టలను ఇరువైపులా కలుపుతూ 22.6 కిలోమీటర్ల కట్టను నిర్మించారు. 10 టీఎంసీలకు ఒక అంచె చొప్పున 5 అంచెల్లో 557 మీటర్ల ఎత్తు వరకు కట్టారు. 143 మీటర్ల పొడవున మత్తడి ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్ పంప్‌హౌస్‌కు చేరిన గోదావరి జలాలను బాహుబలి మోటార్ల ద్వారా ఈ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్ కింద లక్షా 65 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్లకు కూడా దీని ద్వారానే నీటిని పంపుతారు. దీంతో తాగు, సాగునీటి అవసరాలు తీరనున్నాయి. అలాగే నిజాంసాగర్, సింగూరు, ఘనపూర్ ఆయకట్టు స్థిరీకరణ కూడా మల్లన్నసాగర్‌పైనే ఆధారపడి ఉంది. మొత్తంగా 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు మల్లన్నసాగర్‌తో మేలు జరగనుంది.
అతిపెద్ద ఎత్తిపోతల పథకం కావడంతో రిజర్వాయర్‌ను ఒకేసారి పూర్తిస్థాయిలో నింపకుండా విడతల వారీగా ఒక్కోస్థాయి వరకు నింపుతున్నారు. ప్రస్తుతం డ్యాంలో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 60 మీటర్ల ఎత్తైన మట్టికట్ట ఏ మేరకు పనిచేస్తుందో నీటిరంగ నిపుణులు ఎప్పటికప్పుడు పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వ్యవసాయ అవసరాలతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు ఈ రిజర్వాయర్ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు.