TS Coronavirus: తెలంగాణలో కొత్తగా 948 కరోనా పాజిటివ్ కేసులు, గాంధీ హాస్పిటల్‌లో ఇకపై నాన్ కొవిడ్ కేసులకు కూడా చికిత్స, సమ్మెను విరమించిన జూడోలు
Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

Hyd, Nov 18: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 948 కరోనా పాజిటివ్‌ కేసులు (Coronavirus in TS) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటి వరకూ 2.59లక్షలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఐదుగురు మృతి (Covid Deaths) చెందారు. తెలంగాణలో కరోనాతో ఇప్పటి వరకూ 1,415 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,068 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా.. ఇప్పటి వరకూ 2.45లక్షల మంది కరోనా (Coronavirus) నుంచి కోలుకున్నారు. తాజా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న గాంధీ హాస్పిటల్ లో ఇకపై నాన్ కొవిడ్ కేసులను కూడా చూడనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ, ఏప్రిల్ లో నోడల్ సెంటర్ గా గాంధీని ఏర్పాటు చేయగా, ఇప్పటివరకూ దాదాపు లక్ష మందికి పైగానే ఇక్కడ చికిత్స పొందారు. ఇప్పుడు యాక్టివ్ కేసులు తగ్గిపోవడంతో ప్రభుత్వం నవంబర్ 21 నుంచి కరోనాతో పాటు ఇతర కేసులనూ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

దేశంలో కమ్రంగా తగ్గుముఖం పట్టిన కేసులు, గ‌త 24 గంట‌ల్లో 38,617 మందికి కరోనా, దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కోవిడ్ ప్రమాద ఘంటికలు

గడచిన ఆరురోజులుగా జూనియర్ డాక్టర్లు ఈ విషయం మీద సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని మెడికల్ కాలేజీల్లో తక్కువ తీవ్రత ఉన్న కొవిడ్ పేషంట్లకు చికిత్సను అందిస్తూ, కేవలం సీరియస్ పేషంట్లను మాత్రమే గాంధీ ఆసుపత్రికి పంపాలని, ఇతర రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు తాము చికిత్సలు చేస్తేనే అనుభవం పెరుగుతుందని జూడాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారి ప్రధాన డిమాండ్ ను కూడా అంగీకరిస్తున్నామని, గాంధీలో ఇకపై అన్ని రకాల వైద్య సేవలను పొందవచ్చని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇకపై గాంధీ ఆసుపత్రి ప్రత్యేక కొవిడ్ ఆసుపత్రి కాదని, కింగ్ కోటి ఆసుపత్రి, టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్) ఇకపై కరోనా నోడల్ సెంటర్లుగా ఉంటాయని, కోచింగ్ హాస్పిటల్స్ లో కొవిడ్-19 ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేసుకుని, కరోనా పాజిటివ్ వచ్చిన వారికి చికిత్సలను అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు జారీ కాగానే తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ గాంధీ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించింది.