Coronavirus in India: దేశంలో కమ్రంగా తగ్గుముఖం పట్టిన కేసులు, గ‌త 24 గంట‌ల్లో 38,617 మందికి కరోనా, దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కోవిడ్ ప్రమాద ఘంటికలు
Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, November 18: దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 38,617 క‌రోనా కేసులు (Coronavirus in India) కొత్త‌గా న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 89,12,908కు చేరాయి. ఇందులో 4,46,805 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 83,35,110 మంది బాధితులు కోలుకున్నారు. మ‌రో 1,30,993 మంది క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించారు. ఇక, నిన్నటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో 474 మంది మ‌ర‌ణించ‌గా (death toll), 44,739 మంది బాధితులు కోలుకున్నారు.

కాగా, దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో నిన్న‌టికంటే 6,596 కేసులు త‌గ్గాయ‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంక్షేమ‌శాఖ వెల్ల‌డించింది. న‌వంబ‌ర్ 17 వ‌ర‌కు దేశంలో 12,74,80,186 న‌మూనాల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ‌ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ICMR) ప్ర‌క‌టించింది. ఇందులో నిన్న ఒక్క‌రోజే 9,37,279 మంది క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని వెల్ల‌డించింది.

ఇదిలా ఉంటే ‌దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తు‌న్నాయి. గ‌త నెల ఆరంభంలో 90 వేల‌కుపైగా న‌మోదైన కేసులు..అక్టోబ‌ర్ మూడో వారంలో 50 వేల‌కు ప‌డిపోయిన‌ రోజువారీ కేసులు ఇప్పుడు 38 వేల‌కు చేరుకున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గ‌త 45 రోజుల్లో దేశంలో కోవిడ్‌19 రిక‌వ‌రీ కేసులు పెరిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. మ‌రో వైపు యాక్టివ్ కేసుల సంఖ్య త‌గ్గింద‌న్నారు. ఏపీ, చ‌త్తీస్‌ఘ‌డ్‌, రాజ‌స్థాన్‌, హ‌ర్యానా, యూపీ, క‌ర్నాట‌క‌, బెంగాల్‌, ఢిల్లీ, కేర‌ళ‌, మ‌హారాష్ట్రలో కోవిడ్ కేసులు 76.7 శాతంగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

మళ్లీ లాక్‌డౌన్ దిశగా ఢిల్లీ, అనుమతించాలని కేంద్రాన్ని కోరనున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కోవిడ్-19 హాట్‌స్పాట్‌‌గా మారే మార్కెట్లలో కఠిన ఆంక్షలు

ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో అక్క‌డ త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు రాజేశ్ తెలిపారు. ఐసీయూ బెడ్‌ల‌ను పెంచిన‌ట్లు తెలిపారు. టెస్టింగ్‌ల‌ను రెండింత‌లు చేశారు. ఒక‌వేళ ఎవ‌రికైనా కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే, వాళ్లు త‌క్ష‌ణ‌మే ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న కోరారు. టెస్టింగ్ చేయించుకునేందుకు వెనుకాడ‌రాద‌న్నారు. ఢిల్లీలో ఉన్న 4వేల కంటోన్మెంట్ ప్రాంతాల‌ను త‌నిఖీలు చేసేందుకు సిబ్బందిని పెంచుతున్న‌ట్లు ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ వెల్ల‌డించారు.

స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసిజ‌ర్ ప్ర‌కారం ఈ ప్ర‌క్రియ సాగుతుంద‌న్నారు. జూన్ త‌ర్వాత స‌గ‌టును టెస్టింగ్ సంఖ్య పెరిగిన‌ట్లు చెప్పారు. ఆగ‌స్టు మ‌ధ్య‌లో కోవిడ్ కేసులు త‌గ్గాయ‌న్నారు. ఇక అక్టోబ‌ర్ నుంచి రికార్డు స్థాయిలో కేసులు త‌గ్గుతున్న‌ట్లు తెలిపారు. గ‌త 48 గంట‌ల్లో కొన్ని కేసుల‌ను మాత్ర‌మే డిటెక్ట్ చేశామ‌ని, కానీ ఇప్పుడే ఎటువంటి అంచ‌నాకు రాలేమ‌న్నారు.