New Delhi, November 17: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా విశ్వరూపం చూపుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ కేసులను అదుపు చేసేందుకు మార్కెట్ ప్రాంతాల్లో (shut down markets) తిరిగి లాక్‌డౌన్ విధించేందుకు అనుమతించాలంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కేంద్రానికి ఒక ప్రతిపాదన పంపనుంది.
ఢిల్లీలో కేసులు పెరుగుతున్నందున, కేంద్ర ప్రభుత్వానికి జనరల్ ప్రపోజల్ ఒకటి పంపుతున్నాం. నిబంధనలు పాటించని ప్రాంతాలు తిరిగి కోవిడ్-19 హాట్‌స్పాట్‌గా (Covid-19 hotspots) మారే అవకాశాలున్నాయి. పరిస్థితి అనివార్యతను బట్టి అలాంటి మార్కెట్లను కొద్ది రోజుల పాటు ఢిల్లీ ప్రభుత్వం మూసి ఉంచాలనుకుంటోంది' అని కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మంగళవారంనాడు చెప్పారు.
కాగా గడిచిన వారంరోజుల్లో దేశ రాజధానిలో ప్రతిరోజు 4వేలకు పైగా పాజటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. మరోవైపు మృతుల సంఖ్య కూడా భారీగా పెరగడం అధికార యంత్రానికి చెమటలు పుట్టిస్తోంది. దీపావళి పండగ సీజన్, చలికాలం రావటంతో కేసుల సంఖ్య రోజు రోజుకి రెట్టింపు అవుతోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. రాజధాని నగరంలో కోవిడ్ పరిస్థితిని అదుపు చేసేందుకు ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వం రెట్టింపు యత్నాలు చేస్తున్నట్టు ఢిల్లీ సీఎం తెలిపారు.
వైద్యారోగ్యశాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్ అనంతరం మీడియాతో మాట్లాడారు. రోజు పెరుగుతున్న కరోనా కేసులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఢిల్లీలో పాక్షికంగా లాక్ డౌన్ (Delhi Lockdown) పెట్టె యోచనలో ఉన్నాము. దాని కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరాం. ఎక్కువగా కేసులు నమోదు అవుతున్న మార్కెట్లలను కొన్నాళ్లు మూసివేయలనే ఆలోచనలో ఉన్నాము. స్థానిక మార్కెట్లలో నిబంధనలు పాటించడం లేదు. అందుకే అవి కరోనా హాట్ స్పాట్ జోన్ లుగా మారుతున్నాయి.
ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్..తోడయిన కాలుష్యం,
ప్రజలు జాగ్రత్తగా ఉంటేనే నియంత్రణకు సాధ్యం అవుతుంది. సామాజిక దూరం, మాస్కులు తప్పకుండా ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి. ఢిల్లీలో కరోనా తగ్గిన సమయంలో 200 మించి శుభకార్యాలకు హాజరయ్యారు... దాని వల్ల కూడా కరోనా పెరిగింది.ఇప్పుడు శుభకార్యాల కోసం కేవలం 50 మందికి మించి అనుమతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాము.లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కోసం లెటర్ పంపాము’ అని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
తక్షణం 750 ఐసీయూ పడకలు పెంచడం ద్వారా ఢిల్లీ ప్రజలకు కేంద్రం సాయంగా నిలిచిందని సీఎం కృతజ్ఞతలు చెప్పారు. ఇరు ప్రభుత్వాలు, ఏజెన్సీలు కోవిడ్ నియంత్రణ ప్రయత్నాలు రెట్టింపు చేసినప్పటికీ ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే ఫలితం ఉండదని హెచ్చరించారు.