New Delhi, November 14: దేశంలో నిన్న 44,878 కేసులు నమోదవగా ఈ రోజు తక్కువగా 44 వేల కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 44,684 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 87,73,479కు (Coronavirus Cases Near 88 Lakh in India) చేరాయి. ఇందులో 4,80,719 యాక్టివ్ కేసులు ఉండగా, 81,63,572 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న మరో 47,992 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య నిన్నటికంటే 3,828 తగ్గాయి.
కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 520 మంది బాధితులు (Covid Deaths) మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 1,29,188కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (Ministry of Health and Family Welfare) ప్రకటించింది. దేశంలో నిన్న ఒకేరోజు 9,29,481 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి ICMR) ప్రకటించింది. నవంబర్ 13 నాటికి 12,40,31,230 నమూనాలకు కరోనా పరీక్షలుచేశామని తెలిపింది.
ఢిల్లీ కరోనా గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. కాలుష్యం కారణంగా రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఢిల్లీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 7,802 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా 91 మంది మృతి చెందారు. వరుసగా రెండవ రోజు కరోనాతో 90 మంది మృతి చెందారు.
గడచిన 24 గంటల్లో 6,462 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 4,74,830గా ఉంది. వీరిలో 4,23,077 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఢిల్లీలో మొత్తం 7,423 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం 44,329 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 26,741 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ ఢిల్లీలో మొత్తం 53,78,827 కరోనా టెస్టులు చేశారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి వచ్చే నెలలో అనుమతులు లభించే అవకాశం ఉండడంతో, 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేయాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ నిర్ణయించింది. ఈ సంస్థ సీఈవో ఆదార్ పూనావాలా మాట్లాడుతూ.. ఈ టీకాకు వచ్చే నెలలో అనుమతులు లభించే అవకాశం ఉందన్నారు.
డిసెంబరులో టీకాను పంపిణీ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించినట్టు చెప్పారు. వ్యాక్సిన్ వినియోగానికి వచ్చే ఏడాది పూర్తిస్థాయి అనుమతులు కనుక లభిస్తే 50:50 శాతం నిష్పత్తితో దక్షిణాసియా దేశాలకు, పేద దేశాలకు సరఫరా చేస్తారు. టీకా పంపిణీ వ్యవహారాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చూసుకుంటుంది.
కొవిడ్ టీకాను అభివృద్ధి చేస్తున్న ఐదు సంస్థలతో టీకా ఉత్పత్తికి సంబంధించి భాగస్వామ్యం కుదుర్చుకున్న సీరమ్ ఇనిస్టిట్యూట్.. ఆస్ట్రాజెనెకా టీకాను గత రెండు నెలల్లో 4 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేసింది. త్వరలోనే నోవావ్యాక్స్ టీకా ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ రెండు టీకాలు కరోనా వైరస్‌ను సమర్థంగా కట్టడి చేస్తాయని భావిస్తున్నట్టు పూనావాలా తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తికావాలంటే 2024 వరకు సమయం పడుతుందని పూనావాలా అంచనా వేశారు. వైరస్ ఎంతవరకు నియంత్రణలోకి వచ్చిందనే విషయంలో ఆ తర్వాత రెండేళ్లకు గానీ స్పష్టత వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు.