New Delhi, Mar 16: చంద్రయాన్ -3 ప్రయోగంపై ఇస్రో చైర్మన్ కె. శివన్ క్లారిటీ ఇచ్చారు. భారతదేశంలో ఏరోస్పేస్, ఏవియానిక్స్ యొక్క భవిష్యత్తు పై యూపీఎస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. 2022 మధ్య నాటికి చందయన్ -3 ప్రయోగం (Chandrayaan-3) ఉంటుందని తెలిపారు. ఇక, 16 టన్నుల పేలోడ్‌లను మోయగల హెవీ-లిఫ్ట్ లాంచ్ వాహనంతో సహా పలు అధునాతన సామర్థ్యాలను ఇస్రో లక్ష్యంగా (Chandrayaan-3 launch planned by mid 2022) పెట్టుకుందని తెలిపారు.
చంద్రయాన్-2లో లోపాలను అర్థం చేసుకుని, దిద్దుబాటు చర్యలు చేపట్టామని చెప్పారు. గగన్‌యాన్ డిజైన్ కూడా తుది దశలో ఉందని చెప్పారు. రానున్న దశాబ్దంలో అనేక ఆధునిక సామర్థ్యాలను సొంతం చేసుకోవడానికి కృషి చేస్తోందని తెలిపారు. జియో స్టేషనరీ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌కు 16 టన్నుల వరకు పేలోడ్స్‌ను మోసుకెళ్ళగలిగే హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికిల్‌ను తయారు చేయడం కూడా దీనిలో ఉందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న జీఎస్ఎల్‌వీ ఎంకే3 లిఫ్ట్ కేపబిలిటీకి నాలుగు రెట్లు ఎక్కువ సామర్థ్యంతో ఈ వెహికిల్‌ను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన (K. Sivan) తెలిపారు. పునర్వినియోగానికి అవకాశం గల వాహనాలను కూడా తయారు చేయబోతున్నట్లు చెప్పారు.
చంద్రయాన్-2 లోపాలను గుర్తించి, అర్థం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి మిషన్ చంద్రయాన్-3 కోసం దిద్దుబాటు చర్యలు చేపట్టామన్నారు. 2022 జూన్ నాటికి చంద్రయాన్-3ని ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. గగన్‌యాన్ డిజైన్ తుది దశలో ఉందని, ప్రాజెక్టు రియలైజేషన్ ప్రారంభమైందని చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి తొలి మానవ రహిత మిషన్ కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
రాబోయే సంవత్సరంలోనూ, సమీప భవిష్యత్తులోనూ ఇస్రో చేపట్టబోతున్న కార్యక్రమాలను వివరిస్తూ, జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీఓ) పేలోడ్ కేపబిలిటీ ప్రస్తుతం 4 టన్నులు ఉందని, దీనిని 5 టన్నులకు పెంచుతామని చెప్పారు. ప్రస్తుత జీఎస్ఎల్‌వీ ఎంకే3 రాకెట్‌పై సెమీ క్రయోజనిక్ ఇంజిన్‌ను ఉపయోగించి ఈ పేలోడ్ కేపబిలిటీని పెంచుతామని చెప్పారు.
సెమీ క్రయోజనిక్ ఇంజిన్లు రాకెట్ గ్రేడ్ కిరోసిన్, లిక్విడ్ ఆక్సిజన్లను మండిస్తాయని, ఇటువంటి ఇంజిన్లు శక్తిమంతమైనవని, పర్యావరణ హితకరమైనవని, ధర కూడా తక్కువేనని చెప్పారు. పర్యావరణ హితకరమైన రాకెట్ ఇంధనాలను తయారు చేయడం కోసం లిక్విడ్ ఆక్సిజన్-మీథేన్, అటువంటి గ్రీన్ ప్రొపెల్లంట్స్‌పై పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు. మీథేన్, లిక్విడ్ ఆక్సిజన్‌లను రీయూజబుల్ రాకెట్లలో విస్తృతంగా ఉపయోగిస్తారన్నారు. మీథేన్ ఎటువంటి అవశేషాలు లేకుండా పూర్తిగా మండుతుందని, కిరోసిన్‌కు ఆ లక్షణం లేదని వివరించారు. కాలుష్యానికి తావు లేకుండా మండటం వల్ల ఈ ఇంజిన్లను చాలా సార్లు ఉపయోగించడానికి వీలవుతుందన్నారు.
ఉపగ్రహాల కోసం మేం 300 ఎంఎన్ హై-థ్రస్ట్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసే చివరి దశలో ఉన్నాం.. ఇది ఉపగ్రహాలలో రసాయన ఇంధనాల వాడకాన్ని తొలగిస్తుంది మరియు ఇంధన బరువును ఆదా చేయడం ద్వారా తేలికైన ఉపగ్రహాలకు శివన్ బాటలు వేస్తుందన్నారు