ఆన్‌లైన్ ద్వారా అనేక మోసాలు జరుగుతున్న సంగతి విదితమే. తాజాగా ఫ్లూబోట్ లింక్ (FluBot Scam) పేరుతో సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు పార్శిల్ పేరుతో ఓ టెక్ట్స్ మెసేజ్ వస్తోంది. ఈ మెసేజ్ (FluBot scam texts infecting smartphones) సారాంశం ఏంటంటే..‘మీ పార్శిల్ త్వరలోనే మీకు చేరనుంది. దాని స్టేటస్ తెలియాలంటే ఈ లింకును క్లిక్ చేయండి’ అంటూ ప్రముఖ కొరియర్ సంస్థ పేరుతో మీ ఫోన్‌కు సందేశం పంపిస్తారు.
అయితే నిజంగా పార్శిల్ రావాల్సిన వాళ్లు ఎప్పుడు వస్తోందో తెలుసుకోవడానికి.. ఆర్డర్లు ఇవ్వని వాళ్లు పార్శిల్ ఏంటనే ఆసక్తితో లింకును ఓపెన్ చేస్తారు. దీన్ని సైబర్ నేరగాళ్లు సరిగ్గా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన ’ఫ్లూబోట్’ మాల్‌వేర్‌ను (FluBot) ఆండ్రాయిడ్ ఫోన్ల పైకి వదులుతున్నారు. తద్వారా డేటా మొత్తాన్ని వారు హ్యాక్ చేస్తున్నారు. ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, యాప్ ఆధారిత బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్, ఈ-మెయిల్, ట్విట్టర్ ఈ డేటా మొత్తాన్ని మాల్‌వేర్ ప్రయోగించిన సైబర్ నేరగాడికి ’ఫ్లూబోట్ అందిస్తుంది.
దీంతో పాటు ప్రతి స్మార్ట్ ఫోన్‌కు (Android users) పిన్, పాస్‌వర్డ్, ఫింగర్ ప్రింట్, ఫేషియల్ విధానాల్లో లాక్‌లు ఉంటున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్‌లో నిక్షిప్తమై ఉండే ఫ్లూబోట్ వైరస్ ఈ పాస్‌వర్డ్స్‌ను సంగ్రహిస్తుంది. ఇప్పటికే లండన్, స్పెయిన్, జర్మనీ, పోలాండ్‌లో అనేక మంది దీని బారినపడ్డారని, భారత్‌కూ ఈ ముప్పు పొంచి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై లండన్‌కు చెందిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (ఎన్‌సీఎస్‌సీ) అలర్ట్ జారీ చేసింది.
Here's Vodafone UK Tweet
We’ve seen reports of this across all networks in many countries, and it seems to be growing quickly. Please be vigilant.
This seems to only be affecting Android devices. We’ve contacted Google to seek their advice.
— Vodafone UK (@VodafoneUK) April 22, 2021
అయితే ఈ మెసేజీలను సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ సర్వర్ల ద్వారా బల్క్ విధానంలో పంపిస్తారు. ఫలితంగా వాళ్లు ఎక్కడ నుంచి పంపారు.. ఎక్కడ ఉన్నారనేది తెలుసుకోవడం సాధ్యపడటం లేదు. ఒకసారి ఫోన్‌లోకి ప్రవేశించిన ఫ్లూబోట్ అంత తేలిగ్గా పోదని, ఇది ఫోన్‌లో నిక్షిప్తమైనట్లు గుర్తించడం కూడా కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఫార్మాట్ చేస్తేనే వైరస్ తొలుగుతుంది.
వివిధ రకాలైన వైరస్‌లు, మాల్‌వేర్స్‌ను సైబర్ నేరగాళ్లు లింకులు, ఆకర్షణీయమైన ఫొటోల రూపంలో పంపిస్తారు. ఈ ఫొటోల లింకుల్లో హ్యాకర్లు మాల్‌వేర్‌ను నిక్షిప్తం చేస్తారు. సైబర్ నేరగాళ్లు కొన్ని రకాలైన వైరస్‌లను ఫోన్లను హ్యాక్ చేసి లబ్ధి పొందడానికి వినియోగిస్తారు. మరికొన్నింటిని తమ ఉనికి చాటుకోవడానికి, ఏజెన్సీలకు సవాళ్లు విసరడానికి, వినియోగదారుల ఫోన్లు క్రాష్ చేయడానికి ప్రయోగిస్తారు. వీటిలో ఏ తరహా మాల్‌వేర్‌తో అయినా సాధారణ ప్రజలకు ఇబ్బందులే వస్తాయి. ఈ నేపథ్యంలో అపరిచిత నంబర్లు, సందేశాలతో వచ్చే లింకులను క్లిక్ చేయకుండా డిలీట్ చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.