New Delhi, june 8: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు (Global COVID-19) పెరుగుతూనే ఉన్నాయి. లాటిన్ అమెరికా, రష్యా భారత్‌లో కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆదివారం నాటికి 70 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్త మృతుల సంఖ్య నాలుగు లక్షలు (Global COVID-19 Deaths) దాటింది. అమెరికాలో మృతులు 1.10 లక్షలకు చేరువ కాగా, యూరప్ దేశాల్లో 1.75 లక్షల మందికి పైగా మరణించారు. చైనాను దాటేసిన మహారాష్ట్ర, దేశ వ్యాప్తంగా 7 వేలమందికి పైగా మరణం, ఇండియాలో 2,56,611కి చేరుకున్న కోవిడ్-19 కేసుల సంఖ్య
మరణాల్లో అమెరికా, బ్రిటన్ తర్వాత మూడో స్థానంలో ఉన్న బ్రెజిల్ ఇక నుంచి వైరస్ మృతులు, కొత్తగా నమోదైన కేసుల వివరాలను వెల్లడించడం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. బ్రెజిల్‌లో ఇప్పటివరకు మరణాలు 34 వేలు దాటాయి. ఈ నేపథ్యంలో మరణాలు, దేశంలో వైరస్ తీవ్రతను దాచి పెట్టేందుకు బ్రెజిల్ తీసుకున్న అసాధారణ నిర్ణయం అని విమర్శకులు పేర్కొన్నారు. 7 లక్షలకి చేరువవుతున్న కేసులతో ఆ దేశం ప్రపంచ పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. 36 వేలకు పైగా మరణాలతో మూడో స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు 70 లక్షలు దాటాయి.
మరోవైపు కరోనా పాజిటివ్ కేసుల్లో దారుణంగా ప్రభావితమైన దేశాల్లో స్పెయిన్ దాటేసి ఐదో స్థానానికి చేరుకున్న భారత్‌లో శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో దాదాపు 10 వేల కేసులు (9,971) కొత్తగా నమోదయ్యా యి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,56,611కి చేరుకున్నది. మొత్తం మృతులు 7 వేల మార్కును దాటిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
మొత్తం కేసుల్లో లాటిన్ అమెరికాలో 16 శాతం కేసుల వరకు నమోదయ్యాయి. 24 గంటల్లోనే 2,680 మంది ప్రాణాలు కోల్పోవడంతో కోవిడ్ మృతుల సంఖ్య 4 లక్షలు దాటినట్టు హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆరోగ్య నిపుణులు ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మృతుల్లో చాలా మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల అధికారిక లెక్కల్లో తేడాలు ఉన్నాయన్నది వారి అభిప్రాయం. మొత్తం మృతుల్లో నాలుగో వంతు అమెరికాలోనే సంభవించాయి. మరోవైపు దక్షిణ అమెరికాలో మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా మలేరియాతో మరణించే వారి సంఖ్యతో సమానంగా కోవిడ్ (COVID-19 pandemic) మృతులు అయిదు నెలల్లోనే సంభవించాయి. చైనాలోని వూహాన్‌లో జనవరి 10న తొలి మరణం సంభవించింది. లక్ష మరణాలు నమోదు కావడానికి మూడు నెలలు పట్టింది. ఏప్రిల్ మొదటి వారంలో మృతులు లక్ష దాటేశాయి. అదే నెల చివరి వారంలో 2 లక్షలు దాటేశాయి. ఇక 23 రోజుల్లో మరణాలు మూడు లక్షల నుంచి నాలుగు లక్షలకు చేరుకున్నాయి.