India eliminated big reason behind terrorism: PM Modi on Article 370 move (Photo-Twitter)

Bangkok,Novemebr 3: కాశ్మీర్‌కు సంబంధించిన ప్రత్యేక హోదాను రద్దు చేయడం ద్వారా ఉగ్రవాదం, వేర్పాటువాదాలను తమ ప్రభుత్వం అణచివేసిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) స్పష్టం చేశారు. దేశంలో ఉగ్రవాదం, వేర్పాటువాదం వేళ్లూనుకునేందుకు గల కారణాన్ని గుర్తించి, తొలగించినట్లు ఆయన తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ చేరుకున్న ప్రధాని భారత సంతతి ప్రజలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దేశంలో వేర్పాటువాదం, ఉగ్రవాదం(Terrorism) వేళ్లూనుకునేందుకు మూలాలను నాశనం చేశాం. ఆగస్టు 5న ఆర్టికల్‌ 370(Article 370)ను రద్దు చేశాం.

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)కు సొంత రాజ్యాంగాన్ని కల్పించడం వంటి అనేక తాత్కాలిక నిబంధనలను తొలగించాం. మన నిర్ణయం సరైందే అని ప్రపంచం గుర్తించింది. మీరిచ్చే ప్రశంసలు భారత్‌ పార్లమెంట్, పార్లమెంట్‌ సభ్యులకే చెందుతాయి’అని ప్రధాని పేర్కొన్నారు.

ఒకప్పుడు అసాధ్యం గా భావించిన లక్ష్యాలనే తమ ప్రభుత్వం సాధిస్తోందని, ఆ దిశగానే మరింత ముం దుకు వెళ్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదం, వేర్పాటువాదాల అంతానికి తాము తీసుకున్న నిర్ణయం సరైనదైతే దాని ప్రకంపనలు ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, 370 అధికరణ రద్దు నిర్ణయానికి సంబంధించిన సానుకూల ప్రతిస్పందనలను తాను థాయ్‌లాండ్‌లో కూడా వింటున్నానని అన్నారు. 370 అధికరణ రద్దు అంశాన్ని మోదీ ప్రస్తావించినపుడు భారతీయ సంతతి ప్రజలు హర్షధ్వానాలు పలికారు. తనకు లభించిన ఈ హర్షధ్వానాలన్నీ భారత పార్లమెంటుకు, ఈ చట్టాన్ని ఆమోదించిన పార్లమెంటేరియన్లకు చెందుతాయని తెలిపారు.

ప్రధాని స్పీచ్ 

చిత్తశుద్ధితో ఏ ప్రభుత్వం పనిచేసినా దానిపై ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయని పేర్కొన్న మోడీ ఈ సందర్భంగా కర్తార్‌పూర్ కారిడార్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ సిక్కుమత కేంద్రాన్ని యాత్రీకులు ఇకనుంచి స్వేచ్ఛగా సందర్శించే అవకాశం ఉంటుందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన అనేక పథకాలను కూడా మోడీ ఈ సందర్భంగా వివరించారు. తాము మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలకు గుర్తింపుగానే రెండోసారి కూడా ప్రజలు తమకు పూర్తి మెజారిటీని కట్టబెట్టారని మోడీ అన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన వంటి పథకాలు, కర్తార్‌పూర్‌ కారిడార్‌తో ప్రయోజనాలను ప్రధాని వారికి వివరించారు. భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

ఈ నెల 3వ తేదీన బ్యాంకాక్‌ సమీపంలోని నొంతబురిలో జరిగే ఆసియాన్‌–ఇండియా 16వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని పాల్గొంటారు. 4న 14వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం, ఆర్‌సెప్‌ మూడో శిఖరాగ్ర సమావేశంలోనూ మోదీ హాజరవుతారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర భేటీలో ఆసియాన్‌లోని 10 దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా పాల్గొననున్నాయి. దేశానికి ఒనగూరే ప్రయోజనాలను బేరీజు వేశాకే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్‌సీఈపీ) ఒప్పందంపై సంతకం చేస్తామని మోడీ తెలిపారు.

ఆర్‌సిఇపి అంటే ఏమిటి?

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం అనేది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. సభ్య దేశాల మధ్య ఎటువంటి పన్నులు, ఇతర నిబంధనలు లేకుండా స్వేచ్ఛాయుతంగా దిగుమతులకు, ఎగుమతులకు వీలు కల్పించే ఒప్పందం. వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడిన మనలాంటి దేశాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇతర దేశాలను నుంచి వచ్చిపడే దిగుమతులతో మన ఉత్పత్తుల ధరలు తగ్గిపోయి దివాళా తీసే పరిస్థితి ముంచుకొస్తుంది. ఆర్‌సిఇపిలో అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ఈస్ట్‌ ఆసియన్‌ నేషన్స్‌ (ఆసియాన్‌)లోని పది దేశాలతో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) దేశాలైన భారత్‌, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సభ్యులుగా ఉంటాయి