
చిత్ర సీమలో విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే కైకాల సత్యనారాయణ ఆరోగ్య స్థితిపై మంగళవారం ఉదయం ఒక్కసారిగా తప్పుడు వార్తలు గుప్పుమన్నాయి. ఆయన మృతి చెందినట్లుగా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారంలోకి వచ్చింది. ఈ క్రమంలో సత్యనారాయణ కూతురు రమాదేవి వదంతులు (Kaikala Satyanarayana's Death Rumors) నమ్మోద్దని విజ్ఞప్తి చేశారు.
నాన్నగారి పరిస్థితి బాగానే వుంది. ఆయన కోలుకుంటున్నారు. బాగా స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. నిన్న డాక్టర్ మాదాల రవిగారు వచ్చారు. ఆయనతో కూడా మాట్లాడి థమ్సప్ కూడా చూపించారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. దయచేసి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను ఆందోళనకు గురిచేయొద్దు అని రిక్వెస్ట్ చేశారు. అపోలో ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అగ్రకథానాయకుడు చిరంజీవి కూడా ఇటీవల స్పందించారు.
సత్యనారాయణతో తాను ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. తన మాటలకు ఆయన ఆనందం వ్యక్తం చేశారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తాజా సమాచారం ప్రకారం సత్యనారాయణ క్రమంగా కోలుకుంటున్నారు. రక్తపోటు అదుపులోకి వస్తోంది. కిడ్నీల పనితీరు మెరుగయ్యింది. ఆయన వెంటిలేటర్ సపోర్ట్‌పై కొనసాగుతున్నారని తెలుస్తుంది.