Niharika Wedding: నిహారిక వెడ్స్  చైతన్య, ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో డిసెంబర్ 9న వివాహం, చిరంజీవి ‘ఆంటి కూతురా..అమ్మో అప్సరా’ పాటకు చిందేసిన నూతన వధూవరులు
Niharika Konidela Weds Chaitanya Jonnalagadda (Photo-Instagram)

మెగాస్టార్ వారింట పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్‌ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక వివాహం (Niharika Wedding) గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నగడ్డ వెంకట చైతన్యతో (Niharika Konidela Weds Chaitanya Jonnalagadda) జరుగుతున్న విషయం తెలిసిందే. అగష్టు నిశ్చితార్థం జరుపుకున్న నిహారిక-చైతన్యలు రేపు(బుధవారం) రాత్రి 7 గంటలకు ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ ఈ వేడుకకు సుందరంగా ముస్తాబవుతోంది.

ఇప్పటికే ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఒక్క పవన్‌ కల్యాణ్‌ మినహా మెగా కుటుంబ సభ్యులంతా సోమవారమే రాజస్తాన్‌ చేరుకున్నారు. ఇక ఈ రోజు పవన్‌ వేడుకలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నిహారిక పెళ్లి సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్‌ తన స్టైలిష్‌ లుక్‌లో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.

పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి రాజస్తాన్‌లో సంగీత్ వేడుక నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో కొణిదెల, అల్లు వారి ఫ్యామిలీ స‌భ్యులు అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. నిహారిక, చైతన్యతో కలిసి మెగాస్టార్‌ బావగారు బాగున్నారా చిత్రంలోని ఆంటీ కూతురా అమ్మో అప్సరా పాటకు డ్యాన్స్‌‌ చేయడం ప్రత్యేకంగా నిలిచింది.

 

View this post on Instagram

 

A post shared by Hyderabad Times (@hyderabad_times)

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక రాజ‌స్థాన్‌లోని హోట‌ల్‌లో దిగిన సమయంలో హారిక‌, చైతూల‌కి అక్క‌డి బ్యాండ్ మేళం బృందం ఘ‌న స్వాగతం ప‌లకగా జోష్‌లో నిహరిక తన కాబోయే భర్త చైత‌న్య‌తో క‌లిసి చిందులేశారు

నిహారిక పెళ్లి సంధర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఓ ట్వీట్‌ చేశారు కాబోయే నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. నాటి చిన్నారి నిహారికను ఆయన ఎత్తుకుని ఉన్న ఫొటోతో పాటు పెళ్లికూతురుగా ముస్తాబైన ఇప్పటి నిహారిక ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో ముందస్తుగా కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు’ అంటూ ఆశీర్వదించారు.

తాజాగా నాగబాబు నిహారిక-చిరంజీవి దిగిన ఓ సెల్పీ ఫోటోను తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ ఫోటోలో తన తల్లి నిశ్చితార్థం నాటి చీరను ధరించిన నిహారిక.. పెద్దనాన్న చిరంజీవితో కలిసి నవ్వులు చిందిస్తున్నారు. ‘అతని ప్రేమకు అవధుల్లేవు, అతని చిరునవ్వు ప్రతి సందర్భాన్ని ఒక వేడుకగా మార్చుతుంది’ అంటూ చిరంజీవి గురించి ట్వీట్‌ చేస్తూ నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఇక మెగా బ్రదర్స్‌ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పోస్టుతో అన్న మీద ఉన్న ప్రేమను నాగబాబు మరోసారి బయటపెట్టారు.

ఇక ఉదయ్ పూర్ వెళ్లలేని వారికి, ఇతర బంధుమిత్రులకు డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో వివాహ రిసెప్షన్‌ను ఇవ్వనుంది కొణిదెల కుటుంబం. ఇక నిహారిక పెళ్లి చేసుకునే వెంకట చైతన్య జొన్నలగడ్డ టెక్ మహేంద్రలో ఉద్యోగం చేస్తున్నాడు.