కొద్ది రోజులుగా కరోనాతో ఫైట్ చేస్తున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (S P Balasubrahmanyam) కోలుకుంటున్నట్లు ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన (S P Balu Health Update) విడుదల చేశాయి. బాలసుబ్రహ్మణ్యం పూర్తి స్పృహలోనే ఉన్నారు.. వైద్యానికి స్పందిస్తున్నారు. (Fully Awake And Responsive) ఫిజియోథెరపీలో కూడా చురుకుగా పాల్గొంటున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
కరోనా సోకడంతో ఎస్పీ బాలు ఈ ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఆయన వెంటిలేటర్‌పై ఉంటూ చికిత్స పొందుతున్నారు.ఎక్మోతో పాటు ఫిజియోథెరపీ చికిత్స అందిస్తున్నారు. ఆయన కోలుకోవాలని యావత్ దేశం ప్రార్ధిస్తుంది.
తొలుత ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ మధ్యలో కాస్త విషమించింది. దాంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన కోలుకుంటున్నారని..మనుషులను గుర్తుపడుతున్నారని తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. పాడేందుకు నాన్న ప్రయత్నిస్తున్నారు, ఏదో చెప్పాలని అనుకుంటున్నారు : ఎస్పీ చరణ్
సూపర్‌స్టార్ రజనీకాంత్ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఓ వీడియో సందేశాన్ని ట్విట్ చేసిన విషయం విదితమే. 'ప్రియమైన బాలు సర్, మీరు త్వరగా కోలుకోవాలి' అని ఆయన ఆకాంక్షించారు.
ఇదిలా ఉంటే కరోనా సోకడానికి గాయని మాళవికనే కారణమంటూ సోషల్‌మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన గాయని మాళవిక.. బాలసుబ్రహ్మణ్యానికి కరోనా సోకడానికి కారణం తానే అని ప్రచారం చేస్తున్నారని వాపోయారు. దీనిపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జూలై నెలాఖరులో ఎస్పీ బాలు హైదరాబాదులో ఓ కార్యక్రమానికి హాజరయ్యారని, ఆ కార్యక్రమానికి మాళవిక కూడా వచ్చిందని, అప్పటికే మాళవికకు కరోనా పాజిటివ్ అని తేలినా నిర్లక్ష్యంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నదంటూ ప్రచారం జరుగుతోంది.దీనిపై మాళవిక ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకడానికి తాను ఎంతమాత్రం కారణం కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయం గురించి మాళవిక స్పందిస్తూ ‘ఎస్పీబాలసుబ్రహ్మణ్యంకి సంబంధించిన ఒక పాటల కార్యక్రమం సామజవరగమన అనే కార్యక్రమానికి హాజరయిన నేను వేరే సింగర్స్‌తో కలిసి షూట్‌లో పాల్గొన్నాను కానీ ఎస్పీ బాలును కలవలేదు. ఆయనకు ఆగస్టు 5 వ తేదీన కరోనా పాజిటివ్ వస్తే నాకు ఆగస్టు 8వ తేదీన కరోనా పాజిటివ్ అని వచ్చింది. కానీ కొంత మంది నాకు జూలైలోనే కరోనా వస్తే కావాలనే ఆ కార్యక్రమానికి హాజరయ్యానని ప్రచారం చేస్తున్నారు’ అని తన బాధను ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు.