Telugu Actor Raja babu Dies: తెలుగు చిత్ర సీమలో మరో విషాదం, అనారోగ్యంతో ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రాజబాబు కన్నుమూత
Telugu Actor Raja babu Dies (Photo-Video Grab)

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నటుడు, ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రాజబాబు(64) (Senior Telugu actor Rajababu passes away) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గతరాత్రి మృతి (Telugu Actor Rajababu Dies) చెందారు. ఆయన వయసు 64 సంవత్సరాలు.  ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు. రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నరసాపురపేట. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన 1995లో ‘ఊరికి మొనగాడు’సినిమాతో తెరంగేట్రం చేశారు.

ఆ తర్వాత సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రమ్మోత్సవం, భరత్ అనే నేను వంటి చిత్రాల్లో నటించారు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో “స్వర్గం -నరకం “,“రాధమ్మ పెళ్లి ”అనే సినిమాలను సైతం నిర్మించారు. సినిమాతో పాటు వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, వంటి సీరియల్స్‌లోనూ నటించారు. ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు దాదాపు 48 సీరియల్స్‌లో నటించారు. 2005వ సంవత్సరంలో "అమ్మ " సీరియల్ లోని పాత్రకు నంది అవార్డు వచ్చింది.