Rajinikanth's Man Vs Wild Episode | Photo: Discovery Channel

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షోలలో ఒకటైన 'మ్యాన్ Vs వైల్డ్' (Man Vs Wild)లో ఆ షో హోస్ట్ బేర్ గ్రిల్స్‌తో (Bear Grylls) కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఒక ప్రత్యేక ఎపిసోడ్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ షో షూటింగ్ కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో జరుగుతోంది. జనవరి 28న, మంగళవారం రోజు షూటింగ్ ప్రారంభమైంది. ఈ షూటింగ్ సందర్భంగా రజనీకాంత్ చీలమండకు స్వల్ప గాయం, మరియు భుజంపై గాయాలు అయ్యాయి, ప్రారంభమైన మొదటి రోజే షూటింగ్ మధ్యలో నిలిచిపోయింది అంటూ పలు వార్తా కథనాలు వైరల్ అయ్యాయి.

అయితే " అలాంటిదేమి జరగలేదు లేదు, మ్యాన్ Vs వైల్డ్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశాను. అటవీ ప్రాంతం కాబట్టి చిన్నచిన్న ముళ్లు గీసుకున్నాయంతే, అంతకుమించి ఎలాంటి గాయాలు కాలేదు. ఐ యామ్ ఆల్ రైట్! అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు". అంటూ షూటింగ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత చైన్నె విమానాశ్రయంలో రజినీకాంత్ అక్కడున్న మీడియా రిపోర్టర్లతో చెప్పారు.

బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో డిస్కవరీ ఛానల్ యొక్క పాపులర్ ప్రోగ్రాం 'ఇంటు ది వైల్డ్ షూటింగ్' సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ పాల్గొన్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని (Rajinikanth Not Injured) ఫారెస్ట్ అధికారి చెప్పారు.

"ఆయనకు గాయాలు అయ్యాయి అనేదంతా అబద్ధం. స్క్రీన్ ప్లే ప్రకారం, రజనీకాంత్ కింద పడాలి, కాబట్టి తాడు నుండి కిందకు దిగేటప్పుడు, ఆయన కింద పడిపోయారు, అది చూసి అందరూ పరుగెత్తారు. ఇది కూడా వారి స్క్రీన్ ప్లేలో ఒక భాగమే" అని బందీపూర్ రిజర్వ్ డైరెక్టర్ మరియు అడవుల సంరక్షణకారుడు టి. బాలచంద్ర న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.  మ్యాన్ Vs వైల్డ్: అప్పట్లో ప్రధాని మోదీ, ఇప్పుడు సూపర్ స్టార్ రజినీ

అనంతరం, రజనీకాంత్ లేచి, తన షూట్ పూర్తి చేసుకొని చెన్నైకి బయలుదేరి వెళ్లారు. రజినీకాంత్ షూటింగ్ లో గాయపడ్డారు అనే వార్తలు ఫేక్ అని ఆ అధికారి కొట్టిపారేశారు. అలాగే ఇక్కడ షూటింగ్ చేసుకోడానికి డిస్కవరీ ఛానల్ కు 6-8 గంటలు అనుమతి ఇచ్చాము, మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 4 గంటలకు ముగిసింది అని బాలచంద్ర చెప్పారు.