Bigg Boss 14: రేటు పెంచేసిన సల్మాన్‌ ఖాన్‌, బిగ్‌బాస్‌ 14కు ఒక్కో వారానికి 16 కోట్లు తీసుకోనున్నారని వార్తలు, అక్టోబర్‌ నుంచి ప్రసారం కానున్న బిగ్‌బాస్‌ 14..!
Salman Khan (Photo Credits: Instagram)

బిగ్‌బాస్‌ షోకు దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న విషయం విదితమే. ఈ షోకి కర్త,కర్మ,క్రియ అన్నీ సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) అని చెప్పవచ్చు. 2010 నుంచి దాదాపు 10 సీజన్‌లుగా సల్మాన్‌ ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ ఏడాది కరోనా కారణంగా బిగ్‌బాస్‌ షో నిర్వహణపై పలు అనుమానాలు తలెత్తాయి. తాజాగా ప్రభుత్వాలు షూటింగ్‌లకు అనుమతివ్వడంతో ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి బిగ్‌బాస్‌ షో ప్రసారం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా ఈ ఏడాది బిగ్‌బాస్‌ షో కోసం సల్మాన్‌ భారీ రెమ్యూనరేషన్‌ను డిమాండ్‌ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ 14వ సీజన్‌కి (Bigg Boss 14) గాను సల్మాన్‌ ఒక్క వారానికే రూ.16 కోట్ల రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీజన్ 4 నుంచి 6 వరకు సల్మాన్ ఒక్కో ఎపిసోడ్‌కి సుమారు 2.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ని తీసుకున్న సల్మాన్, సీజన్ 7కు వచ్చేసరికి దాన్ని రెట్టింపు చేసి ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 5కోట్లు తీసుకున్నట్లు సమాచారం.ఇక సీజన్‌ 9 కోసం 7-8 కోట్ల రూపాయలు, సీజన్‌ 12లో ఎపిసోడ్‌కు రూ. 12 నుంచి 14 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

సీజన్ 13 నాటికి మొత్తం సుమారు 26 ఎపిసోడ్లకు గాను అతను రూ. 403 కోట్లు అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే గత సీజన్‌ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్వహకులు ఈ ఏడాది బిగ్‌బాస్‌ షోను 5 వారాల పాటు పొడిగించినట్లుగా తెలుస్తోంది. దాంతో సల్మాన్‌ తన రెమ్యూనరేషన్‌ని కూడా అమాంతం పెంచినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీని గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

సల్మాన్ ఖాన్‌ పన్వెల్ ఫామ్‌హౌస్‌లోనే ఈ బిగ్‌బాస్‌ సీజన్‌ 14 షూటింగ్‌ని నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. బిగ్‌బాస్‌ 14 కోసం ఇప్పటికే ‘హమారి బహు సిల్క్‌’కు చెందిన జాన్ ఖాన్, ‘భబీజీ ఘర్ పర్ హై’కు చెందిన శుభంగి అత్రే, ‘తుజ్‌ సే హై రాబ్తా’ నటుడు షాగున్ పాండేలను సంప్రదించినట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రటకన వెలువడలేదు.