bigg-boss-3-telugu-winner-rahul-sipligunj (Photo-Twitter)

Novemebr 4: బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ముగిసింది.బిగ్‌బాస్‌’ సీజన్‌ 3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. రూ.50 లక్షల ప్రైజ్‌ మనీని గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. ఎన్నో అంచనాలతో జూలై 22న 17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అనేక మలుపులు, టాస్క్‌లతో వంద రోజులకు పైగా సాగిన ‘బిగ్‌’ రియాల్టీ షో లో 17 మంది సభ్యుల్లో అంతా ఎలిమినేట్‌ అవగా చివరికి ఇద్దరు మిగిలారు. ఈ ఇద్దరిలో రాహుల్ రూ. 50 లక్షలు గెలుకున్నాడు. యాంకర్, నటి శ్రీముఖి చివరి వరకూ రాహుల్ కు గట్టి పోటీనిచ్చారు.

పాతబస్తీ ధూల్‌పేటకు చెందిన ఈ కుర్రాడు ఏమాత్రం అంచనాల్లేకుండా పోటీలోకి దిగి ఎన్నోసార్లు ఎలిమినేషన్‌లో నిలిచి..ఒకసారి ఫేక్‌ ఎలిమినేషన్‌కు గురైన సినీ గాయకుడు, ‘రంగస్థలం ఫేం’ రాహుల్‌ సిప్లిగంజ్‌ అనూహ్యంగా బిగ్‌బాస్‌ సీజన్‌ త్రీ విన్నర్‌గా నిలిచారు. ఫైనలిస్టులుగా ఉన్న ఐదుగురు.. యాంకర్‌ శ్రీముఖి, సినీ నటుడు వరుణ్‌ సందేశ్‌, డ్యాన్స్‌ మాస్టర్‌ బాబా భాస్కర్‌, టీవీ నటుడు అలీ రజాలను వెనక్కి నెట్టి ప్రైజీమనీ కొట్టేశాడు. 105 రోజుల పాటు సాగిన ఈ రియాలిటీ షోలో ఆదివారం విజేతను ప్రకటించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ నటుడు చిరంజీవి చేతుల మీదుగా రాహుల్‌ రూ.50లక్షల ప్రైజ్‌మనీని అందుకున్నారు. శ్రీముఖి ద్వితీయ స్థానంలో నిలిచారు.

చిరంజీవి చేతులు మీదుగా అవార్డును అందుకుంటున్న రాహుల్  

హోస్ట్ అక్కినేని నాగార్జున ఈ డబ్బుతో ఏం చేస్తావు? అని రాహుల్‌ను ప్రశ్నించగా.. ‘నేను ఇప్పటిదాకా నా తల్లిదండ్రుల కోసం ఏమీ చేయలేదు. మేం అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఈ డబ్బుతో ఓ ఇల్లు కొని పేరెంట్స్‌కు బహుమతిగా ఇస్తాను’ అని చెప్పాడు. ధూల్‌పేటకు చెందిన రాహుల్‌ వృత్తిరీత్యా బార్బర్‌. ఆయనకు సోదరి, సోదరుడు ఉన్నాడు. రంగస్థలం సినిమాలో ఓ పాట పాడి ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. నగరంలో జరిగే హనుమాన్‌ జయంతి, వినాయక చవితి వేడుకలపై రాహుల్‌ చేసిన వీడియో సాంగ్స్‌ యువతను బాగా ఆకట్టుకున్నాయి.

బిగ్‌బాస్-3 షోలో మొత్తం 17 మంది పాల్గొన్నారు. రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్‌సందేశ్, అలీరెజా చివరివరకు కొనసాగారు. ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు వచ్చిన అలీరెజా ఎలిమినేట్ అయినట్టు సినీనటి రాశీఖన్నా, వరుణ్‌సందేశ్ ఎలిమినేషన్‌ను సినీనటి కేథరిన్, నృత్య దర్శకుడు బాబా భాస్కర్ ఎలిమినేషన్‌ను సినీనటి అంజలి ప్రకటించారు.

చివరకు షోలో మిగిలిన రాహుల్, శ్రీముఖిలో ఎలిమినేషన్‌ను తానే స్వయంగా ప్రకటిస్తానని యాంకర్ నాగార్జున బిగ్‌బాస్ హౌస్‌లోపలికి వెళ్లారు. ఇద్దరికి చెరో రూ.25 లక్షలు ఇస్తాను. పోటీనుంచి విరమించుకుంటారా? అని అడిగారు. దీన్ని ఇద్దరూ తిరస్కరించారు. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చని, ఓట్లేసిన ప్రేక్షకులు, అభిమానులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయమని స్పష్టంచేశారు. ఇద్దరినీ బిగ్‌బాస్ హౌస్ నుంచి స్టేజీ మీదకు తీసుకెళ్లిన నాగార్జున.. రాహుల్ సిప్లిగంజ్‌ను టైటిల్ విన్నర్‌గా ప్రకటించారు.

ప్రపంచంలోనే నంబర్‌వన్ షో: చిరంజీవి

బిగ్‌బాస్ ప్రపంచంలోనే నంబర్‌వన్ షో అని హీరో చిరంజీవి అన్నారు. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో బిగ్‌బాస్ షోలు నడుస్తున్నా.. ప్రాచుర్యంలో, ప్రేక్షకులు వీక్షించడంలో తెలుగు బిగ్‌బాస్ సీజన్- 3 మొదటిస్థానంలో ఉన్నదని తెలిపారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని చివరివరకు వచ్చిన ఇద్దరూ విజేతలేనని చిరు అన్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన ప్రతి పోటీదారుడిని ఆయన పేరుపేరునా పలకరించారు.