హైదరాబాద్, ఫిబ్రవరి 26 : బిగ్ బాస్ షోపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నారాయణ ఈ షోపై మరోసారి విరుచుకుపడ్డారు. బిగ్‌బాస్ అనేది సమాజానికి నేరపూరితమైన సంస్థ అని, ఇది ఓ కల్చరల్ షో, కల్చరల్ ఈవెంట్, గేమ్ షో కాదని, లైసెన్స్ తీసుకున్న బ్రోతల్ హౌజ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు సంబంధంలేని యువతి, యువకులను ఒకే ఇంట్లో పెట్టడం ఏంటని.. ఈ షో పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఈ షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసిన నారాయణ ‘స్టాప్ బిగ్‌బాస్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ప్రత్యేక ప్రచారం కూడా మొదలు పెట్టారు.
బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకుంది. విమర్శలు ఎన్ని ఉన్నా ఈ షోకు ఆదరణ మాత్రం తగ్గడం లేదు సరి కదా పెరుగుతుంది. అందుకే నిర్వాహకులు కూడా సీజన్ల మీద సీజన్లు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా సీజన్లు మొదలైపోయాయి. హిందీలో ఇప్పటికే బిగ్ బాస్ 15 సీజన్ పూర్తి కాగా ఓటీటీ తొలి సీజన్ కూడా పూర్తయింది. ఇక, ఇప్పుడు తెలుగులో కూడా ఓటీటీ మొదలు కానుంది. నేటి (ఫిబ్రవరి 26) నుండే తొలి తెలుగు ఓటీటీ బిగ్ బాస్ షో మొదలు కానుంది.
ఓటీటీ బిగ్ బాస్ తొలి సీజన్ ను ప్రముఖ బుల్లి తెర యాంకర్ ఓంకార్ సంస్థ అయిన ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తుండగా తొలి సీజన్ కు హైప్ తెచ్చేందుకు గతంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లను రంగంలోకి దింపనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మాజీ కంటెస్టెంట్ అరియనాతో పాటు మాజీ కంటెస్టెంట్లు ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజలు కూడా ఓటీటీ బిగ్ బాస్ తొలి సీజన్ లో ఇంట్లోకి వెళ్లేందుకు సిద్దమైనట్లు వినిపిస్తుంది.
ఇక, కొత్తగా.. యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, డ్యాన్స్ షో ఢీ-10 విజేత రాజు, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాకర్ ప్రత్యూష పేర్లు ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి. ఈ శనివారం అట్టహాసంగా తొలి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ మొదలు కాబోతుంది. కాగా.. బిగ్ బాస్ షో రెడ్ లైట్ ఏరియా కన్నా డేంజర్ అంటూ సీపీఐ పార్టీ నారాయణ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.