New delhi, November 3: ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ప్రజలు బయటికి రావడానికి జంకుతున్నారు. కాగా తొలిసారి ఢిల్లీలో వాయు కాలుష్యం(2.5 పీఎం) 1000 పాయింట్లు దాటి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మొత్తం పొగ కమ్మేయడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పొగ చూరడంతో రన్‌వే కనిపించడం లేదు. ఫలితంగా పలు విమానాలు దారి మళ్లాయి. మొత్తం 32 విమానాలను దారి మళ్లించినట్లు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం-జీఎంఆర్ అధికారులు వెల్లడించారు.
వెలుతురు సరిగ్గా లేని కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. 12 విమానాలను జైపూర్, అమృత్ సర్, లక్నో మీదుగా మళ్లించినట్లు పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని ఐజీఐ-జీఎంఆర్ అధికారులు వరుస ట్వీట్ల ద్వారా వెల్లడించింది.
ఐజీఐ-జీఎంఆర్ అధికారుల ట్వీట్
Delhi Airport statement: Due to low visibility at Delhi Airport, 37 flights were diverted between 9 am and 1 pm to places including Jaipur, Amritsar and Lucknow among others, today. As of now, the visibility has improved. https://t.co/lRxZei1mQ8
— ANI (@ANI) November 3, 2019
మధ్యాహ్నం ఒంటిగంట వరకు 32 విమానాలను దారి మళ్లించామని స్పష్టం చేశారు. వెలుతురు ఆశించిన స్థాయిలో లేకపోతే.. మరిన్ని విమానాలను దారి మళ్లించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. వాయు కాలుష్యం ఢిల్లీని మాత్రమే కాదు పొరుగునే ఉన్న ఇతర రాష్ట్రాలను కూడా చుట్టబెట్టింది. ఢిల్లీని ఆనుకుని ఉన్న హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ జిల్లాలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోకి వచ్చే గుర్‌గావ్, ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, గౌతమ బుద్ధ నగర్ జిల్లాలు కాలుష్యం బారిన పడ్డాయి.
నోయిడాలో కాలుష్యం
Noida: Major pollutants PM 2.5 at 486 and PM 10 at 459 both in 'severe' category in Sector-62, according to the National Air Quality Index (NAQI) data. Sector-125, Sector-1 and Sector-116 also in 'severe' category. pic.twitter.com/6tOPyjarMP
— ANI UP (@ANINewsUP) November 3, 2019
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ నొయిడా పరిధిలోని అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు. మంగళవారం వరకూ సెలవు కొనసాగుతుంది. ఢిల్లీలో ఇదివరకే పాఠశాలలకు సెలవును ప్రకటించారు. పంజాబీ బాగ్, నరేలా, పూసా, బవానా, ఆనంద్ విహార్, అశోక్ విహార్, ముండ్కా, ఐటీఓ వంటి ప్రాంతాల్లో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని ఎప్పుడో దాటేసింది.
పొల్యూషన్ లెవల్స్ ఎక్కువ కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు ఆప్ సర్కార్ సెలవులు ప్రకటించింది. కొన్నిచోట్ల కార్యాలయాల పనివేళలను మార్చింది. ఈ నెల 4 నుంచి 15 వరకు 21 ప్రభుత్వ శాఖలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఆరు గంటల పని చేయాలని సూచించింది. మరో 21 ప్రభుత్వ విభాగాలు ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఏడు గంటల వరకు పనిచేసేలా వేళలను మార్చినట్టు సర్కారు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఇటు ఫరీదాబాద్, గురుగావ్, ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్‌లోని ఎన్‌సిఆర్ పట్టణాల్లో బొగ్గు ఆధారిత పరిశ్రమలను మూసివేయాలని సర్కారు ఆదేశించింది .పంజాబ్, హర్యానాల నుంచి వస్తున్న పొగ రాజధానిలో వాయు కాలుష్యానికి కారణమవుతోందని, దీనిని నియంత్రించాలని విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే ఢిల్లీ, హర్యానాలో కాలుష్యాన్ని తగ్గించేందుకు అధికారులు వాటర్ ట్యాంకర్లతో నీటిని పిచికారి చేస్తున్నారు