Sputnik V COVID-19 Vaccine | (File Image)

Hyderabad, May 14:  భారతదేశంలో మరో కోవిడ్ నివారణ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. రష్యా అభివృద్ధి పరిచిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ యొక్క తొలి డోసును శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది.

రష్యా నుంచి తొలి విడతలో 1.5 లక్షల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మే 1న హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కు చేరాయి. వీటి దేశవ్యాప్త పంపిణీకి మే 13న కసౌలిలోని సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ నుండి రెగ్యులేటరీ క్లియరెన్స్ పొందిందని డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ శుక్రవారం ప్రకటించింది.

పరిమిత పైలట్‌లో భాగంగా, ఈ టీకా యొక్క సాఫ్ట్ లాంచ్ దేశంలో ఈరోజు జరిగింది. తొలి మోతాదును శుక్రవారం హైదరాబాద్‌లో పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని డోసుల వ్యాక్సిన్ ను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకోనుంది. ప్రస్తుతం ఒక డోస్ స్పుత్నిక్ వ్యాక్సిన్ ధర రూ. 948 గా నిర్ణయించారు. దీనికి 5% జీఎస్టీ అదనం. మొత్తంగా భారతదేశంలో ఒక్క డోస్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధర రూ.995.40 గా ఉండనుంది. ఈ వ్యాక్సిన్ ను మూడు వారాల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది.

Here's the update: 

కొంతకాలం తర్వాత భారతీయ ల్యాబరేటరీల్లోనే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారీ ప్రారంభం అవుతుంది. అప్పుడు ఈ వ్యాక్సిన్ ధర కొంతవరకు తగ్గుతుందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వెల్లడించింది. దేశంలో వ్యాక్సిన్ అవసరాలను తీర్చడం కోసం స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి డాక్టర్ రెడ్డీస్ క్యాబ్స్ దేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగంలోని వాటాదారులతో కలిసి పని చేస్తుంది. భారతదేశంలో కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి తాము ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు ఫార్మా దిగ్గజం పేర్కొంది. ఇక ఈ సుత్నిక్ వి వ్యాక్సిన్ కరోనాను అడ్డుకోవడంలో 91 శాతం ప్రభావవంతమైనదిగా క్లినికల్ ట్రయల్స్ లో రుజువైంది.