New Delhi October 31: నవంబర్ 1వ తేదీ నుంచి అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో పాటూ, రైళ్ల టైం టేబుల్ మారనుంది. దీంతో పాటూ నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్, బిజినెస్ రంగాల్లో పలు మార్పులు జరుగనున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న రైళ్ల టైం టేబుల్‌ను రైల్వే శాఖ నవంబర్ 1 నుంచి మార్చనున్నది. 13వేల ప్యాసింజర్ రైళ్లు, 7 వేల గూడ్స్ రైళ్ల టైం టేబుల్‌ను మార్చనున్నట్టు సమాచారం. వీటితో పాటు 30 రాజధాని రైళ్ల వేళల్లో కూడా మార్పులు చేస్తారు.
అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ప్రతి 15 రోజులకొకసారి ఎల్పీజీ ధరలను సవరించే చమురు కంపెనీలు నవంబర్ 1న సిలిండర్ రేట్లను సవరించనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సిలిండర్ రేట్లు మళ్లీ పెరగవచ్చని తెలుస్తున్నది. 14.2 కిలోల సిలిండర్‌పై రూ.100 పెంచే అవకాశాలున్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
గ్యాస్ సిలిండర్ల హోం డెలివరీకి సంబంధించి సోమవారం(నవంబర్ 1) నుంచి రూల్స్ మారుతున్నాయి. సిలిండర్ డెలివరీ అవ్వాలంటే ఇక నుంచి వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని డెలివరీ బాయ్‌కు చెప్పవలసి ఉంటుంది. లేకపోతే డెలివరీ కాదు. గ్యాస్ సిలిండర్ల డెలివరీలో మోసాలను అరికట్టడం కోసం చమురు కంపెనీలు ఈ విధానాన్ని తీసుకువచ్చాయి. అయితే, ఈ విధానం కమర్షియల్ సిలిండర్లకు వర్తించదు.
పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకొన్నది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు పింఛనుదారులు బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేకుండా వీడియో కాల్ సదుపాయాన్ని కల్పించింది. ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తున్నది.
నెలలో 3 కంటే ఎక్కువ సార్లు డబ్బు జమ చేస్తే రూ.40, మూడు కంటే ఎక్కువ సార్లు విత్ డ్రా చేస్తే రూ.100 రుసుము విధించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా సిద్ధమైంది. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే రుసుము నిబంధన వర్తించదు. జన్‌ధన్ ఖాతాలకు కూడా ఈ రూల్ వర్తించదు. బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్‌బీ, యాక్సిస్, సెంట్రల్ బ్యాంక్ కూడా ఇదే తరహా చార్జీలకు సిద్ధం అయ్యాయి.
నవంబర్‌లో పలు కంపెనీలు ఐపీవోకు రానున్నాయి. పాలసీ బజార్ ఐపీవో నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నది. పేటీఎం ఐపీవో నవంబర్ 8 నుంచి అందుబాటులోకి రానుంది. ఇవి కాకుండా నైకా, ఎస్‌జేఎస్, ఎంటర్‌ప్రైజ్. సిగాచీ ఇండస్ట్రీస్ కూడా ఐపీవోకు రానున్నాయి. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకొనేవారికి ఇది మంచి అవకాశం.